Updated : 19 May 2022 17:16 IST

Stock Market: మార్కెట్లను ముంచేసిన ‘మాంద్యం’ భయం..!

కుప్పకూలిన సూచీలు.. రూ.7లక్షల కోట్ల సంపద ఆవిరి

ముంబయి: ద్రవ్యోల్బణం దెబ్బకొట్టింది.. వడ్డీ రేట్ల పెంపు భయం బెంబేలెత్తించింది.. మాంద్యం ముంచేసింది.. వెరసి సగటు మదుపరి కోటానుకోట్ల సంపద ఆవిరైంది..! దలాల్‌స్ట్రీట్‌ గురువారం ఎరుపురంగ పులుముకుంది. అంతర్జాతీయ మార్కెట్ల ప్రతికూల సంకేతాలకు తోడు దేశీయంగా వెల్లువెత్తిన అమ్మకాలను సూచీలను కూలదోశాయి. ఫలితంగా బలమైన ప్రతిఘటన స్థానాలను దాటుకుని మరీ నిఫ్టీ పతనమైంది. నేటి ట్రేడింగ్‌లో సెన్సెక్స్‌ ఏకంగా 1400 పాయింట్లు పతనమవ్వగా.. నిఫ్టీ 15,800 దిగువకు పడిపోయింది. ఈ ఒక్కరోజే బీఎస్‌ఈలో నమోదిత సంస్థల మార్కెట్‌ విలువ ఏకంగా దాదాపు రూ.7లక్షల కోట్ల మేర తరగిపోయింది.

సూచీల పయనం సాగిందిలా..

అమెరికా మార్కెట్లు బుధవారం నష్టాలతో ముగియడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్లపై తీవ్రంగా పడింది. దీంతో ఆరంభంలోనే సూచీలు కుప్పకూలాయి. ఈ ఉదయం 53,070 పాయింట్ల వద్ద మొదలైన సెన్సెక్స్‌ ఏ దశలోనూ కోలుకోలేకపోయింది. ఒకానొక సమయంలో 52,669 వద్ద ఇంట్రాడే కనిష్ఠానికి పడిపోయింది. చివరకు 1416.30(2.16శాతం) పాయింట్లు పతనమై 52,792.23 వద్ద ముగిసింది. అటు నిఫ్టీ కూడా 430.90 (2.65శాతం) పాయింట్లు కుంగి 15,809.40 వద్ద స్థిరపడింది. అన్ని రంగాల షేర్లు నష్టాల్లో ముగిశాయి. అత్యధికంగా ఐటీ, లోహ రంగ షేర్లు 4-5 శాతం మేర పడిపోయాయి.

బలహీనంగా ప్రపంచ మార్కెట్లు..

గత రెండేళ్లలో ఎన్నడూ లేనంత పతనాన్ని నిన్న అమెరికా మార్కెట్లు చవిచూడటం భారత్‌ సూచీల కుంగుబాటుకు  ఆజ్యం పోసింది. అమెరికా మార్కెట్లలో కూడా మాంద్యం భయాలు నెలకొన్నాయి. అక్కడ ద్రవ్య పరపతి విధానాన్ని మరింత కఠినతరం చేయనున్నారనే ప్రచారం.. వాల్‌స్ట్రీట్‌లో గుబులు రేపుతోంది. నిన్నటి ట్రేడింగ్‌లో డోజోన్స్‌ 3.2 శాతం పడిపోగా.. ఎస్‌అండ్‌పీ 500 సూచీ 3.6శాతం విలువ కోల్పోయింది. నాస్‌డాక్‌ కాపోజిట్‌ 4.3శాతం పతనమైంది. అమెరికా రిటైల్‌ దిగ్గజం టార్గెట్‌ షేర్లు 25శాతం పతనమయ్యాయి. 1987 అక్టోబర్‌  తర్వాత ఈ స్థాయిలో దాని షేర్లు ఎన్నడూ పడిపోలేదు.

ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా ద్రవ్యోల్బణం భారీగా పెరగడంతో ఆసియా సూచీలు కూడా ప్రతికూలంగానే ట్రేడవుతున్నాయి. హాంగ్‌కాంగ్‌ సూచీ 2.25శాతం పతనమైంది. చైనా టెక్‌ దిగ్గజం టెన్సెంట్‌ షేరు 6శాతం విలువ కోల్పోయింది. నిక్కీ 225 సూచీ 1.75శాతం విలువ కోల్పోగా.. దక్షిణ కొరియాకు చెందిన కేవోఎస్‌పీఐ 1.34శాతం పడిపోయింది. ఆస్ట్రేలియాకు చెందిన ఏఎస్‌ఎక్స్‌200 సూచీ 1.61శాతం పతనమైంది.

40 ఏళ్లలో ఎన్నడూ లేని ధరలు..!

అమెరికాలో వినిమయ వస్తువుల ధరలు 8.2శాతం పెరిగాయి. గత 40 ఏళ్లలో ఈ స్థాయిలో అక్కడ ఏనాడూ ధరలు పెరగలేదు.  దీంతో ఫెడ్‌ వడ్డీరేట్ల పెంపును నమ్ముకొంది. ఫెడ్‌ చీఫ్‌ జెరోమ్‌ పావెల్‌ కూడా వడ్డీరేట్ల పెంపు కొనసాగుతుందని వెల్లడించారు. జూన్‌14-15 తేదీల్లో ఫెడరల్‌ ఓపెన్‌ మార్కెట్‌ కమిటీ భేటీ కానుంది. అమెరికాలో నిరుద్యోగం రేటు ఏప్రిల్‌ నెలలో 3.6శాతంగా నిలిచింది. కొవిడ్‌ వ్యాప్తికి ముందున్న 3.5శాతం కంటే ఇది కొంచెం ఎక్కువ. నిరుద్యోగుల సంఖ్య 10లక్షలను దాటేసింది.

వడ్డీరేట్లపై ఆర్‌బీఐ దృష్టి..

ప్రపంచ సెంట్రల్‌ బ్యాంకుల వలే ఆర్‌బీఐ కూడా వడ్డీ రేట్లపెంపుపై దృష్టి సారించింది. మే4 వ తేదీన ఆర్‌బీఐ భేటీలో ద్రవ్యోల్బణం కట్టడికి వడ్డీరేట్ల పెంపును ఆయుధంగా వాడటంపై చర్చ జరిగింది. దీంతో భవిష్యత్తులోనూ వడ్డీ రేట్లు పెరుగుతాయని భావిస్తున్నారు.

భగభగలాడుతున్న చమురు ధరలు..

రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం కారణంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఏడు వారాల్లో అత్యధికంగా బ్రెంట్‌ క్రూడ్‌ పీపా ధర 110 డాలర్లకు చేరింది. చాలా దేశాలు రష్యా చమురుపై నిషేధం విధించడంతో ఏర్పడిన కొరత కూడా ఈ ధరల పెరుగుదలకు ఆజ్యం పోసింది. దీనికి తోడు చైనాలో 11శాతం తక్కువగా క్రూడ్‌ ప్రాసెస్‌ చేయడం సరఫరాలపై ఒత్తిడి పెంచుతోంది.

రూపాయ పతనం..

రుపాయ పతనం కొనసాగడం మార్కెట్‌ను ఆందోళనకు గురి చేస్తోంది. గురువారం కూడా రూపాయి మారకం విలువ డాలర్‌తో పోలిస్తే 14 పైసలు క్షీణించి 77.72 వద్ద ముగిసింది. ఈ ఏడాది రూపాయి 4శాతం విలువ కోల్పోయింది.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts