Stock Market: లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు

Stock Market: అమెరికాలో రేట్ల పెంపు విషయంలో ఫెడ్ ఇక నెమ్మదించే అవకాశం ఉందన్న అంచనాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి.

Updated : 24 Nov 2022 10:03 IST

ముంబయి: అంతర్జాతీయ మార్కెట్లలోని సానుకూల సంకేతాల నేపథ్యంలో దేశీయ స్టాక్ మార్కెట్‌ సూచీలు గురువారం లాభాలతో ట్రేడింగ్‌ను ప్రారంభించాయి. ఉదయం 9:24 గంటల సమయంలో సెన్సెక్స్‌ 122 పాయింట్ల లాభంతో 61,632 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు లాభపడి 18,303 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ.81.68 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్‌ 30 సూచీలో భారతీ ఎయిర్‌టెల్‌, కొటాక్‌ మహీంద్రా బ్యాంక్‌ మాత్రమే నష్టాల్లో ఉన్నాయి. ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, పవర్‌గ్రిడ్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, డాక్టర్‌ రెడ్డీస్‌, హెచ్‌యూఎల్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, టీసీఎస్‌, టెక్‌ మహీంద్రా షేర్లు అత్యధికంగా లాభపడుతున్న వాటిలో ఉన్నాయి.

అమెరికా ఫెడరల్‌ రిజర్వు సమావేశానికి సంబంధించిన మినిట్స్‌ వివరాలు బుధవారం విడుదలయ్యాయి. ద్రవ్యోల్బణం కొంతమేర తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో రేట్ల పెంపు విషయంలో ఇకపై కాస్త మెతకవైఖరి అవలంబించాలని చాలా మంది ఫెడ్‌ నిపుణులు అభిప్రాయపడ్డారు. ఇప్పటి వరకు అనుసరిస్తూ వచ్చిన 75 బేసిస్‌ పాయింట్లు పెంపును ఇకపై తగ్గించాలని వారంతా సూచించారు. ఈ పరిణామాల నేపథ్యంలో అమెరికా మార్కెట్లు బుధవారం లాభాలతో ముగిశాయి. ఆసియా- పసిఫిక్‌ సూచీల్లోనూ అదే ట్రెండ్‌ కొనసాగుతోంది.

గమనించాల్సిన స్టాక్స్‌...

కీస్టోన్‌ రియల్టర్స్‌: కంపెనీ షేర్లు ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదుకానున్నాయి. రూ.541 ఇష్యూ ధరతో ఈ కంపెనీ ఐపీఓకి వచ్చింది.

జేఎస్‌డబ్ల్యూ ఎనర్జీ: జేఎస్‌డబ్ల్యూ రెన్యూవబుల్‌ ఎనర్జీ (విజయనగర్‌) లిమిటెడ్‌ టర్మ్‌ లోన్‌ ద్వారా రూ.3,900 కోట్లను సమీకరించాలని నిర్ణయించింది.

టీసీఎస్‌: బీఎస్‌ఎన్‌ఎల్‌ 4జీ నెట్‌వర్క్‌ను దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు టీసీఎస్‌, ఐటీఐ బిడ్లు దాఖలు చేశాయి.

ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌: ఈ కంపెనీలో ఎల్‌ఐసీ తన వాటాను మరో 2 శాతం పెంచుకుంది. దీంతో ఎంఅండ్‌ఎం ఫైనాన్షియల్‌లో ఎల్‌ఐసీ మొత్తం వాటా 7.02 శాతానికి చేరింది.

ఎస్‌బీఐ కార్డ్‌: చీఫ్‌ రిస్క్‌ ఆఫీసర్‌ అపర్ణ కుప్పుస్వామి తన పదవికి రాజీనామా చేశారు.

ఐనాక్స్‌ గ్రీన్‌ ఎనర్జీ సర్వీసెస్‌: పోలస్‌ గ్లోబల్‌ ఫండ్‌ తమ 53.85 లక్షల షేర్లను విక్రయించి ఐనాక్స్‌ గ్రీన్‌ నుంచి పూర్తిగా వైదొలగింది. మరోవైపు ఎలారా ఇండియా, నొమురా సింగపూర్‌, యెస్‌ బ్యాంక్‌ సైతం తమ వాటాల్లో కొంత భాగాన్ని తగ్గించుకున్నాయి.

ఐఐఎఫ్‌ఎల్‌ వెల్త్‌ మేనేజ్‌మెంట్‌: ఈ కంపెనీలో ఉన్న తమ వాటాల్లో 15.12 శాతాన్ని జనరల్‌ అట్లాంటిక్‌ సింగపూర్‌ ఫండ్‌ విక్రయించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు