US: అమెరికాలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌.. కోట్లు కొల్లగొట్టిన తెలుగు వ్యక్తులు..!

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి కోట్ల రూపాయలు ఆర్జించిన ఆరోపణలపై అమెరికాలో ఏడుగురు భారత

Published : 29 Mar 2022 13:39 IST

న్యూయార్క్‌: ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌కు పాల్పడి కోట్ల రూపాయలు ఆర్జించిన ఆరోపణలపై అమెరికాలో ఏడుగురు భారత సంతతి వ్యక్తులపై ఫెడరల్‌ అధికారులు అభియోగాలు నమోదు చేశారు. ఈ స్కీమ్‌ ద్వారా వీరు మిలియన్ డాలర్ల లాభం పొందినట్లు పేర్కొన్నారు. రెండేళ్ల క్రితం వీరు ఈ మోసానికి పాల్పడగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

భారత సంతతికి చెందిన హరి ప్రసాద్‌ సూరి, లోకేశ్ లగుడు, చోటు ప్రభుతేజ్‌ పులగం ముగ్గురు స్నేహితులు. శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన క్లౌడ్‌ కంప్యూటింగ్‌ కమ్యూనికేషన్స్‌ కంపెనీ ‘ట్విలియో’లో పనిచేస్తున్నారు. 2020లో హరి ప్రసాద్‌ ట్విలియో కంపెనీ భవిష్యత్‌ ప్రణాళికకు సంబంధించిన రహస్య సమాచారాన్ని తన క్లోజ్‌ ఫ్రెండ్ అయిన దిలీప్‌ కుమార్‌ రెడ్డికి చేరవేశాడు. అలాగే లోకేశ్‌ కూడా తన గర్ల్‌ఫ్రెండ్‌, మరో స్నేహితుడు అభిషేక్‌కు కంపెనీ విషయాలను చెప్పాడు. ప్రభుతేజ్‌ తన సోదరుడు చేతన్‌ ప్రభుకు తెలిపాడు. అలా కంపెనీ సమాచారమందుకున్న వారు ట్విలియో ఆప్షన్స్‌లో విజయవంతంగా ట్రేడింగ్‌ చేశారు.

2020 మార్చిలో హరిప్రసాద్‌, లోకేశ్‌, ప్రభు తేజ్‌ ట్విలియో రెవెన్యూకు సంబంధించిన  డేటా బేస్‌లను యాక్సెస్‌ చేశారు. దీని ద్వారా కంపెనీ కస్టమర్ల సమాచారాన్ని తెలుసుకున్నారు. కొవిడ్‌ మహమ్మారి సమయంలో ట్విలియో కంపెనీ ఉత్పత్తులు, సేవల వినియోగం పెరిగినట్లు గుర్తించారు. ఈ వివరాలతో కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో వెల్లడిస్తే కచ్చితంగా ట్విలియో షేర్ల ధర పెరుగుతుందని గ్రహించారు. ఇదే విషయాన్ని ఈ ముగ్గురు తమ స్నేహితులు, బంధువులకు చేరవేశారు.

దీంతో.. ట్విలియో త్రైమాసిక ఫలితాలు వెల్లడించడానికంటే ముందుగానే మిగతా నలుగురు బ్రోకరేజ్‌ ఖాతాల ద్వారా ట్విలియో ఆప్షన్లు, స్టాక్‌ల్లో భారీగా పెట్టుబడులు పెట్టారు. 2020 మే 6న ట్విలియో త్రైమాసిక ఫలితాలను వెల్లడించడం, కంపెనీ షేర్లు పెరగడం చకచకా జరిగిపోయాయి. అయితే అనుమానం వచ్చిన సెక్యూరిటీస్‌ అండ్‌ ఎక్స్ఛేంజ్‌ కమిషన్‌ ఆరా తీయగా.. ఈ మోసం బయటపడింది.

ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ ద్వారా ఈ ఏడుగురు 1 మిలియన్‌ డాలర్‌కు పైగా అక్రమ లాభార్జన పొందినట్లు దర్యాప్తులో తేలింది. ఇందుకోసం ఈ ఏడుగురు ఓ ప్రైవేటు చాట్‌ ఛానల్‌ను రూపొందించుకుని, అందులో తెలుగులో మాట్లాడుకున్నట్లు తెలిసింది. కమిషన్‌ ఫిర్యాదు మేరకు ఫెడరల్‌ అధికారులు వీరిపై అభియోగాలు నమోదు చేశారు. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు