Ease of doing: ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌లో తెలుగు రాష్ట్రాలు టాప్‌

సరళతర వ్యాపార నిర్వహణలో (Ease of doing Business) తెలుగు రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి.

Published : 30 Jun 2022 15:28 IST

నివేదిక విడుదల చేసిన ఆర్థికశాఖమంత్రి నిర్మలా సీతారామన్‌

దిల్లీ: సరళతర వ్యాపార నిర్వహణలో (Ease of doing Business) తెలుగు రాష్ట్రాలు మరోసారి అగ్రస్థానంలో నిలిచాయి. కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ విడుదల చేసిన నివేదికలో ఏపీ, గుజరాత్‌, తెలంగాణ రాష్ట్రాలు తొలిస్థానాల్లో నిలిచాయి. వ్యాపార సంస్కరణలను సమర్థంగా అమలు చేయడంలో మొత్తం ఏడు రాష్ట్రాలు ర్యాంకులు సాధించగా.. వాటిలో ఈ మూడు రాష్ట్రాలు ముందంజలో నిలిచినట్లు తాజా నివేదిక వెల్లడించింది.

‘వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక 2020’ అమలు ఆధారంగా రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు కేంద్ర ఆర్థికశాఖ ర్యాంకులు ప్రకటించింది. ఇందులో మొత్తం ఏడు రాష్ట్రాలకు గాను ఆంధ్రప్రదేశ్‌, గుజరాత్‌, తెలంగాణ ముందువరుసలో నిలవగా హిమాచల్‌ ప్రదేశ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, ఒడిశా, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాలు వ్యాపార సంస్కరణలు అమలు చేసిన విభాగంలో ర్యాంకులు పొందాయి. ఈ విభాగంలో అస్సాం, కేరళ, గోవాతో సహా ఏడు రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఇక అభివృద్ధి చెందుతున్న వాణిజ్య వ్యవస్థ కేటగిరీలో 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి. వీటిలో దిల్లీ, పుదుచ్చేరి, త్రిపుర వంటి రాష్ట్రాలు ఉన్నట్లు తాజా నివేదిక వెల్లడించింది. ఈ కార్యక్రమంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్‌ గోయల్‌ పాల్గొన్నారు.

దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంలో భాగంగా రాష్ట్రాల మధ్య పోటీ వాతావరణాన్ని పెంచే లక్ష్యంతో సరళతర వ్యాపార నిర్వహణ ర్యాంకులను వాణిజ్య మంత్రిత్వశాఖలోని పరిశ్రమలు, అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం (DPIIT) ఏటా ఈ ర్యాంకులను ప్రకటిస్తోంది. వ్యాపార సంస్కరణల కార్యాచరణ ప్రణాళిక (BRAP) అమలు ఆధారంగా రాష్ట్రాలకు ర్యాంకులను కేటాయిస్తుంది. ఇందులో భాగంగా లైసెన్సింగ్‌ విధానం, అనుమతులు, ప్రభుత్వ సహకారం, కార్మికులు, పర్యావరణం వంటి 15 విభాగాల్లో మొత్తం 301 సంస్కరణలతో కూడిన లక్ష్యాలను నిర్దేశించింది. ఈ పద్ధతిని 2014లో మొదలుపెట్టగా ఇప్పటి వరకు 2015, 2016, 2017-18, 2019లో ర్యాంకులు ప్రకటించారు. తాజాగా 2020 సంవత్సరానికి గాను డీపీఐఐటీ తాజా నివేదిక విడుదల చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని