Wealth Tax: సంపద పన్నుకు 74% మంది భారతీయుల మద్దతు!

Wealth Tax: సంపన్నులపై అధిక పన్ను విధించాలనే ప్రతిపాదనపై చాలామంది సానుకూలంగా స్పందించినట్లు ఓ ప్రముఖ సర్వే వెల్లడించింది.

Published : 24 Jun 2024 10:10 IST

Wealth Tax | దిల్లీ: అత్యంత ధనవంతులపై ‘సంపద పన్ను’ (Wealth Tax) విధించే అంశాన్ని పరిగణలోకి తీసుకోవడానికి వచ్చే నెలలో జీ20 (G20) కూటమి దేశాల ఆర్థిక మంత్రులు సమావేశం కానున్నారు. ఈ తరుణంలో సభ్యదేశాల్లోని 68 శాతం మంది ప్రజలు ఈ ప్రతిపాదనకు మద్దతిస్తున్నారని ఓ ప్రముఖ సర్వే వెల్లడించింది. భారత్‌లో ఏకంగా 74 శాతం మంది దీనిపై సానుకూలంగా స్పందించినట్లు తెలిపింది. ప్రపంచ ఆకలి, ఆర్థిక అసమానతలు, వాతావరణ మార్పులు వంటి సమస్యల పరిష్కారానికి సందప పన్ను (Wealth Tax) సరైందేనని అభిప్రాయపడ్డారు.

ఈ సర్వేను ఎర్త్‌4ఆల్‌, గ్లోబల్‌ కామన్స్‌ అలయన్స్‌ సంయుక్తంగా నిర్వహించాయి. జీ20 సభ్యదేశాల్లోని దాదాపు 22,000 మంది పౌరుల నుంచి అభిప్రాయాలను సేకరించారు. సంపన్నులపై పన్ను (Wealth Tax) ప్రతిపాదన 2013 నుంచి చర్చలో ఉంది. ఏటా దీనికి మద్దతు పెరుగుతూ వస్తోంది. ప్రస్తుతం జీ20 (G20) కూటమికి బ్రెజిల్‌ అధ్యక్షత వహిస్తోంది. సంపద పన్ను అంశంపై ఏకాభిప్రాయానికి కృషి చేస్తోంది. జులైలో జరిగే ఆర్థిక మంత్రుల సమావేశంలో ఉమ్మడి ప్రకటన వెలువడేలా ప్రయత్నాలను ముమ్మరం చేసింది.

అదానీ వార్షిక వేతనం రూ.9.26 కోట్లు

ఈ ప్రతిపాదన వెనక ఫ్రెంచ్ ఆర్థికవేత్త గాబ్రియేల్ జుక్మాన్ కీలక పాత్ర పోషించారు. ఆయన మంగళవారం ఓ నివేదికను విడుదల చేయనున్నారు. సంపద పన్ను (Wealth Tax) ఎలా పనిచేస్తుంది? ఎంతవరకు ప్రభావం చూపనుందో అందులో వివరించనున్నారు. జుక్మాన్ ప్రకారం.. ‘‘సాధారణ ప్రజలతో పోలిస్తే సంపన్నులు చాలా తక్కువ పన్ను చెల్లిస్తారు. సంపద పన్ను వల్ల అంతర్జాతీయంగా ఓ ప్రమాణం ఏర్పడుతుంది. ప్రతి దేశంలోని బిలియనీర్లు తమ సంపదలో కనీసం 2 శాతం వార్షికంగా పన్నులు చెల్లించాల్సి ఉంటుంది’’ అని ఆయన వివరించారు.

భారతీయుల మనోగతం..

సర్వే నివేదిక ప్రకారం.. భారతీయుల్లో చాలామంది వాతావరణ మార్పులు, ప్రకృతి సంరక్షణకు సంబంధించి తక్షణమే సంస్కరణలు చేపట్టాలని కోరుకున్నారు. సంపన్నులపై విధించిన పన్నుతో వచ్చే ఆదాయాన్ని అందుకోసం ఉపయోగించాలని వారు ఆకాంక్షించారు. సార్వజనీన కనీస ఆదాయానికి (Universal Basic Income) 71 శాతం, ఉద్గారాల నివారణకు ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై 74 శాతం, మెరుగైన వర్క్‌-లైఫ్‌ బ్యాలెన్స్‌కు 76 శాతం మంది మద్దతిచ్చారు. విద్యుదుత్పత్తి, రవాణా, నిర్మాణం, పరిశ్రమలు, ఆహారం ఇలా అన్నిరంగాల్లో వచ్చే దశాబ్ద కాలంలో సమూల మార్పులు రావాల్సిఉందని 68 శాతం మంది భారతీయులు అభిప్రాయపడ్డారు. ఆర్థికవృద్ధి కంటే ఆరోగ్యం, పర్యావరణ ఆధారిత అభివృద్ధిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని 81 శాతం మంది పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని