Sharechat: షేర్‌చాట్‌లో ఉద్యోగాల కోత.. 600 మందికి ఉద్వాసన!

Sharechat lay-offs: షేర్‌చాట్‌ 600 మంది ఉద్యోగుల్ని తొలగించింది. గతంలో భారీ సంఖ్యలో ఉద్యోగులను నియమించుకున్న ఆ కంపెనీ.. ఇప్పుడు తొలగింపు ప్రక్రియను చేపట్టింది.

Published : 16 Jan 2023 13:53 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ సోషల్‌ షేరింగ్‌ యాప్‌ షేర్‌చాట్‌ (Sharechat) మాతృ సంస్థ మొహల్లా టెక్ భారీ సంఖ్యలో ఉద్యోగులకు ఉద్వాసన (Lay offs) పలికింది. ఖర్చులు తగ్గించుకోవడంలో భాగంగా దాదాపు 600 మందిని తొలగించింది. ప్రస్తుతం కంపెనీలో దాదాపు 2,100 మంది పనిచేస్తుండగా.. అందులో 20 శాతం మంది ఉద్యోగుల్ని తొలగించింది. గతంలో భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకున్న నేపథ్యంలో ఇప్పుడు అధికంగా ఉన్న వారిని తొలగించిట్లు తెలిసింది.

తొలగింపు విషయాన్ని ఆ కంపెనీ ఉద్యోగులకు ఇ-మెయిల్‌ ద్వారా తెలియజేసింది. ప్రభావితం కాని ఉద్యోగులకు సైతం సమాచారం చేరవేసింది. తొలగించిన ఉద్యోగులకు 2022 డిసెంబర్‌ వరకు నూరు శాతం వేరియబుల్‌ పేని చెల్లించనున్నట్లు కంపెనీ పేర్కొంది. అలాగే నోటీసు పీరియడ్‌ ఉన్న కాలానికి పూర్తి వేతనం చెల్లించనున్నారు. పనిచేసిన కాలానికి గానూ ఏడాదికి రెండు వారాలా చొప్పున ఎక్స్‌గ్రేషియా చెల్లించనున్నారు. 2023 జూన్‌ వరకు ఆరోగ్య బీమా సదుపాయం కొనసాగుతుందని కంపెనీ తెలిపింది. వాడుకోని సెలవులను గరిష్ఠంగా 45 రోజుల వరకు ఎన్‌క్యాష్‌ చేసుకోవచ్చు.

ఐఐటీ పూర్వ విద్యార్థులైన సత్యదేవ, ఫరీద్‌ అషన్‌, భాను సింగ్ కలిసి 2015లో షేర్‌చాట్‌ యాప్‌ను ప్రారంభించారు. ప్రాంతీయ భాషలో కంటెంట్‌ను అందించడంతో అనతి కాలంలోనే ఈ యాప్‌ ప్రజాదరణ పొందింది. టిక్‌టాక్‌ బ్యాన్‌ తర్వాత ఇదే కంపెనీ మోజ్‌ పేరిట ఓ వీడియో షేరింగ్‌ యాప్‌ను సైతం తీసుకొచ్చింది. వీడియో షేరింగ్‌, సోషల్‌ మీడియా విభాగంలో మరింత విస్తరిస్తున్న ఈ కంపెనీలో పెద్ద పెద్ద కంపెనీలు పెట్టుబడి పెట్టాయి. దీంతో షేర్‌చాట్‌ మాతృ సంస్థ భారీ సంఖ్యలో ఉద్యోగుల్ని నియమించుకుంది. ఫండింగ్‌ నెమ్మదించడంతో ఇప్పుడు అధికంగా ఉన్న ఉద్యోగుల్ని తొలగించే ప్రక్రియ చేపట్టిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. గత డిసెంబర్‌లో సైతం ఇదే కంపెనీ జీత్‌ 11 ఫాంటసీ స్పోర్ట్స్‌ ప్లాట్‌ఫామ్‌ను మూసేసింది. అందులో 115 మంది ఉద్యోగులకు ఉద్వాసన పలికింది. నెల రోజులు తిరగకముందే షేర్‌ చాట్‌లో 20 శాతం మందిని తొలగించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని