Stock Market Returns: 3 వారాల్లో ₹1.13లక్షల లాభం.. 113% దూసుకెళ్లిన వెరండా షేర్లు!

వెరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ షేర్లు వరుసగా ఇది ఎనిమిదో రోజు అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి...

Published : 02 May 2022 20:47 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: వెరండా లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ కంపెనీ షేర్లు ఇటీవలే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. సోమవారం 5 శాతం ఎగబాకి అప్పర్‌ సర్క్యూట్‌ని తాకాయి. ఇలా అప్పర్‌ సర్క్యూట్‌కి చేరడం వరుసగా ఇది ఎనిమిదో రోజు. ఏప్రిల్‌ 20న రూ.171.55 వద్ద ఈ కంపెనీ షేరు ధర ఇప్పటి వరకు 70 శాతానికి పైగా ఎగబాకి బీఎస్‌ఈలో రూ.291.20కి చేరింది. 

ఏప్రిల్‌ 11న వెరండా లెర్నింగ్‌ షేర్లు స్టాక్‌ మార్కెట్‌లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.137తో పోలిస్తే షేరు విలువ ఇప్పటి వరకు 113 శాతం పెరిగింది. ఏప్రిల్‌ 25న ‘టైమ్‌’ను కొనుగోలు చేయనున్నట్లు వెరండా ప్రకటించింది. ఈ ఒప్పంద విలువ రూ.287 కోట్లు. ఈ ప్రకటన తర్వాత షేర్లు మరింత రాణించాయి. ఐపీఓలో కనీసం 100 షేర్లు (ఒక లాట్‌) కొనాలని నిబంధన విధించారు. ఈ లెక్కన ఒక్కో రిటైల్‌ ఇన్వెస్టర్‌ రూ.13,700 కనీస పెట్టుబడి పెట్టారు. ఇప్పటి వరకు షేర్లు 113 శాతం ఎగబాకడంతో వీరి పెట్టుబడి కాస్తా రూ.28,720 అయ్యింది. అంటే ఒక్కో లాట్‌పై రూ.15,020 లాభాన్ని ఆర్జించారు. గరిష్ఠంగా రూ.1,91,800 పెట్టి 14,00 షేర్లు కొన్నవారికి రూ.2,16,734 లాభం రావడం విశేషం. ఈ లెక్కన రూ.1,00,000 మదుపు చేసిన వారు రూ.1,13,000 లాభాన్ని సంపాదించారు.

లెర్నింగ్‌ సొల్యూషన్స్‌ లిమిటెడ్‌ను 2018లో స్థాపించారు. వివిధ పోటీ పరీక్షలకు ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్ మాధ్యమాల ద్వారా శిక్షణనందించడమే లక్ష్యంగా దీన్ని ప్రారంభించారు. యూపీఎస్సీ, సీఏ, బ్యాంకింగ్‌, రైల్వే, స్టేట్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్స్‌, ఎస్‌ఎస్‌సీ.. ఇలా అనేక విభాగాల్లో ఈ సంస్థ శిక్షణనందిస్తోంది. వెరండా రేస్‌, వెరండా సీఏ, వరంగా ఐఏఎస్‌, ఎడ్యురేకా ఈ కంపెనీకి అనుబంధంగా పనిచేస్తున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని