Updated : 19 May 2022 14:16 IST

Saving Money: ఈ త‌ప్పులు చేస్తే పొదుపు చేయ‌డం క‌ష్ట‌మే!

ల‌క్ష్యాన్ని సాధించాలంటే.. త‌గిన ప్రణాళిక ఉండాలి. దాని ప్ర‌కార‌మే నిరంత‌ర సాధ‌న‌తో లక్ష్యం వైపు ఒక్కో అడుగు వేయాల్సి ఉంటుంది. ఆర్థికంగానూ ఇదే వ‌ర్తిస్తుంది. ఆర్థిక ప్ర‌యాణంలో ఏదైనా ల‌క్ష్యాన్ని సాధించ‌లంటే ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం మ‌దుపు చేయాలి. పెట్టుబ‌డులు పొదుపుతోనే సాధ్యం అవుతాయి కాబ‌ట్టి సంపాద‌న‌లో ఖ‌ర్చులను ప‌రిమితం చేయ‌డం చాలాముఖ్యం. అప్పుడే ఎలాంటి పొర‌పాట్లు లేకుండా డ‌బ్బు ఆదా చేయ‌గ‌లుగుతారు. 

పొదుపు చేయ‌డంలో సాధార‌ణంగా చేసే త‌ప్పులు..

నిజ‌మైన ఖ‌ర్చులను ట్రాక్ చేయ‌లేక‌పోవ‌డం..
మ‌న‌లో చాలా మంది నెల‌వారి ఖ‌ర్చ‌లను ట్రేక్ చేస్తుంటారు. అయితే నిజ‌మైన ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేస్తున్నారా?  కొన్ని సార్లు క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేస్తుంటాం. ఖ‌ర్చుల‌ను రాసుకునేట‌ప్పుడు ఆ విష‌యాన్ని మ‌ర్చిపోతుటాం. క్రెడిట్ కార్డు బిల్లు వ‌చ్చిన‌ప్పుడు గానీ అది అర్థం కాదు. ఖ‌ర్చుల‌ను స‌రిగ్గా ట్రాక్ చేయ‌క‌పోతే అన‌వ‌స‌ర వాటిపై డ‌బ్బు ఖ‌ర్చు చేసే అవ‌కాశం పెరుగుతుంది. అన‌వ‌స‌ర‌, అద‌న‌పు ఖ‌ర్చుల‌ను నియంత్రించ‌లేరు. దీంతో ఖ‌ర్చు ఎక్కువై పొదుపు త‌గ్గిపోతుంది. 

కాబ‌ట్టి, డ‌బ్బు ఆదా చేయడానికి, ప్ర‌తీ నెల, మూడు నెల‌ల‌కు, ఏడాదికి అయిన ఖ‌ర్చుల‌ను ట్రేక్ చేస్తుండాలి. ఇలా చేయ‌డం వ‌ల్ల గ‌త నెల‌ల్లో మీరు చేసిన అన‌వ‌స‌ర‌పు ఖ‌ర్చుల‌ను గుర్తించగ‌లుగుతారు. ఇది మ‌ర‌ల మ‌ర‌ల చేయ‌కుండా అద‌పు చేసుకోగ‌లుగుతారు. 

కొత్తగా వ‌స్తువుల‌ను కొనుగోలు చేయ‌డం..
మార్కెట్లోకి ఏదైనా కొత్త వ‌స్తువు వ‌చ్చిన వెంట‌నే కొనుగోలు చేయాల‌ని చూస్తుంటారు కొంద‌రు. కొత్త‌గా మార్కెట్లోకి వ‌చ్చిన‌ప్పుడు ఆ వ‌స్తువు ఖ‌రీదు ఎక్కువ‌గా ఉంటుంది. కొంత కాలానికి ధ‌ర త‌గ్గే అవ‌కాశం ఉంటుంది. అందువ‌ల్ల కొంత స‌మ‌యం వేచి చూడ‌డం వ‌ల్ల ఆఫ్ సీజ‌న్‌లో త‌క్కువ ధ‌ర‌కే వ‌స్తువును కొనుగోలు చేయ‌వ‌చ్చు. ఈ విధంగా అన‌వ‌స‌ర‌పు ఖర్చును త‌గ్గించుకుని పొదుపు పెంచుకోవ‌చ్చు. 

ఎమ్ఆర్‌పీ ధ‌ర‌కే కొనుగోలు చేయ‌డం..
ప్ర‌తీ వ‌స్తువ‌ను దాని ఎమ్ఆర్‌పీ ధ‌ర‌కు కొనాల‌ని లేదు. షాపింగ్ చేసేట‌ప్పుడు రిటైల‌ర్‌ను ధ‌ర త‌గ్గించ‌మ‌ని కోర‌వ‌చ్చు. ఇలా చేయ‌డం వ‌ల్ల ఖ‌ర్చు త‌గ్గుతుంది. ఆన్‌లైన్ షాపింగ్ చేసేట‌ప్పుడు వివిధ వెబ్‌సైట్‌ల‌ను అవి అందించే ధ‌ర‌ల‌ను పోల్చి చూడ‌వ‌చ్చు. ఆన్‌లైన్ సైట్లు ప్ర‌త్యేక విక్ర‌యాలు, ఆన్‌లైన్ డీల్స్‌తో వ‌స్తుంటాయి. అటువంటి టైమ్‌లో షాపింగ్ చేయడం వ‌ల్ల ఎక్కువ డిస్కౌంట్‌, క్యాష్ బ్యాక్‌లు ల‌భించే అవ‌కాశం ఉంటుంది. 

ఇక్క‌డ ఒక విష‌యం గుర్తించుకోవాలి. ఆన్‌లైన్ సైట్లో త‌క్కువ ధ‌ర‌కు వ‌స్తుంది కాదా అని.. తెలియ‌ని సైట్‌లో కొనుగోళ్లు జ‌ర‌ప‌డం మంచిది కాదు. న‌మ్మ‌క‌మైన సైట్లో మాత్ర‌మే కొనుగోళ్లు చేయాలి. అలాగే డీల్స్‌లో ధ‌ర త‌గ్గుతుందని అవ‌స‌రం లేని వ‌స్తువును కొనుగోలు చేయ‌డం వ‌ల్ల ఖ‌ర్చు పెరిగిపోతుంది. 

అద‌న‌పు ఫీచ‌ర్ల కోసం..
కొన్ని యాప్స్‌లో అద‌న‌పు ఫీచర్లు కోసం స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకోవాల్సి వ‌స్తుంది. ఇలాంటి సేవ‌లు పొందేందుకు అవ‌స‌రం ఉన్నా లేక‌పోయినా స‌బ్‌స్క్రిప్ష‌న్ తీసుకొంటుటారు. ఇది సరికాదు. స‌భ్య‌త్వం తీసుకునే ముందు మీకు అన్ని ఫీచర్లు నిజంగా అవసరమా కాదా అని తనిఖీ చేయడం ముఖ్యం. నిజంగా అవసరమైన సేవల్లో ఆ భాగానికి మాత్రమే సభ్యత్వాన్ని తీసుకోవ‌డం ద్వారా కొంత‌ డబ్బును ఆదా చేయవచ్చు.

అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేయ‌క‌పోవ‌డం..
ఒక్కోసారి అనుకోని ఖ‌ర్చులు కార‌ణంగా నెల, రెండు నెల‌ల పాటు డ‌బ్బు ఆదా చేయ‌లేక‌పోవ‌చ్చు. అలాంటి స‌మ‌యంలో రెగ్యుల‌ర్‌గా చేసే పెట్టుబ‌డులు దారి త‌ప్ప‌వ‌చ్చు. అత్య‌వ‌స‌ర నిధి ఉంటే.. ఈ పొర‌పాట్లు జ‌ర‌గ‌కుండా జాగ్ర‌త్త ప‌డ‌వ‌చ్చు. అదేవిధంగా  ఆదాయం పూర్తిగా కోల్పోయిన‌ప్పుడు లేదా త‌గ్గిన‌ప్పుడు ఖ‌ర్చుల‌కు ఇబ్బంది ప‌డ‌కుండా ఉండేందుకు కూడా ఇది స‌హాయ‌ప‌డుతుంది. అందువల్ల ప్ర‌తీ నెల కొంత మొత్తాన్ని అత్య‌వ‌స‌ర నిధి ఏర్పాటు కోసం పొదుపు చేయ‌డం చాలా ముఖ్యం.

చివరిగా..
ఖ‌ర్చుల‌ను నియంత్రించు కోవ‌డం చాలా వ‌ర‌కు మ‌న చేతిలోనే ఉంటుంది. ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం న‌డుచుకుంటే ఇది సాధ్య‌మే. ఆర్థిక ప్ర‌ణాళిక సిద్ధం చేసుకుని దాని ప్ర‌కారం ముందుగా మీరు పొదుపు చేయాల‌నుకున్న మొత్తాన్ని ప్ర‌క్క‌న పెట్టి మిగిలిన మొత్తంతోనే ఖ‌ర్చుల‌ను స‌ర్దుబాటు చేసుకుంటే.. వీలైనంత ఎక్కువ పొదుపు చేసి మీ ఆర్థిక ల‌క్ష్యాలు సాధించ‌డానికి కావాల్సిన పెట్టుబ‌డిని స‌మ‌కూర్చుకోవ‌చ్చు. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని