Updated : 22 Apr 2022 17:36 IST

Health insurance: ఆరోగ్య బీమా పాల‌సీ యుక్త వ‌య‌స్సులోనే తీసుకోవాలా?

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమాను యుక్త వయసులో ఉన్నప్పుడే తీసుకోవాలి. చాలా మంది పెద్ద వారికి క‌దా అనారోగ్యాలు వ‌స్తాయి.. వారికి క‌దా కావ‌ల్సింది ఆరోగ్య బీమా అనుకుంటారు. కానీ యువ‌త ఇంట్లోనే ఉండ‌రు, చ‌దువు రీత్యా, ఉద్యోగ రీత్యా బ‌య‌ట‌కు తిరుగుతుంటారు. బ‌య‌ట వాతావ‌ర‌ణానికి, ఆఫీస్‌లో కాకుండా ఏదైనా ప‌రిశ్ర‌మ‌లో ఉన్న ప‌రిస్థితుల‌కు అనారోగ్యం క‌ల‌గొచ్చు. లేదా ప్ర‌మాదాల బారిన ప‌డొచ్చు. రోడ్డు ప్ర‌మాదాల‌కు గురి కావ‌చ్చు. అందువ‌ల్ల యుక్త వయసులో ఉన్న‌ప్పుడే  ప్ర‌మాద బీమాతో క‌లిపి ఉన్న ఆరోగ్య బీమా కొనుగోలు చేస్తే మంచిది. అనుకోని సంఘ‌ట‌న‌లు జ‌రిగిన‌ప్పుడు మంచి చికిత్స తీసుకోవ‌డానికి ఆర్థిక భరోసా ఉంటుంది.

ఆరోగ్య బీమాలో మీ అవ‌స‌రాల‌కు అనుగుణంగా యాడ్‌-ఆన్ క‌వ‌ర్‌ల‌ను ఎంచుకోవ‌చ్చు. వైద్య ద్ర‌వ్యోల్బ‌ణం గురించి ఆందోళ‌న చెంద‌కుండా మీకు, మీ కుటుంబానికి నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ సేవ‌ల‌ను అందించ‌డానికి ఒక వ్య‌క్తిగత లేదా కుటుంబ ఆరోగ్య బీమాలో పెట్టుబ‌డి పెట్టండి. ప్ర‌స్తుత్త కొవిడ్ ప‌రిస్థితుల్లో మ‌న ఆరోగ్యానికి సంబంధించి, గ‌త 2 సంవ‌త్స‌రాలుగా అనేక మంది కుటుంబ స‌భ్యులు ఒకే స‌మ‌యంలో లేక అదే సంవ‌త్స‌రంలో తీవ్ర అనారోగ్యానికి గుర‌యిన సందర్భాలూ ఉన్నాయి. య‌వ్వ‌నంలో ఉన్న‌వారు కూడా ప్రాణాంత‌క‌మైన క‌రోనా వైర‌స్‌ల నుంచి ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అనుకోని ఇటువంటి ఆరోగ్య ఉత్పాతాలు ఎదుర్కోవడానికి ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడే ఆరోగ్య బీమా తీసుకుంటే ఉప‌యుక్తంగా ఉంటుంది.

ఈ అంశాల‌ను ప‌రిశీలిస్తే, దేశంలోని యువ జ‌నాభా కూడా ఆరోగ్య సంర‌క్ష‌ణ సంబంధిత ఖ‌ర్చుల నుంచి త‌మ‌ను తాము ఆర్థికంగా ర‌క్షించుకోవ‌డానికి ఆరోగ్య బీమా పాల‌సీలో పెట్టుబ‌డి పెట్ట‌డం వివేక‌మైన ప‌ని. మీరు య‌వ్వ‌నంలో, ఆరోగ్యంగా ఉన్న‌ప్పుడు ఆరోగ్య బీమా ప‌థ‌కాన్ని తీసుకోవ‌డం వ‌ల్ల అనేక  ప్రయోజ‌నాలున్నాయి. చిన్న వ‌య‌స్సులో, ఎటువంటి వ్యాధులు లేకుండా ఉన్న‌ప్పుడు ఆరోగ్య బీమా పాల‌సీని కొనుగోలు చేయ‌డం వ‌ల్ల మీకు త‌క్కువ ప్రీమియంతో పాల‌సీ ల‌భిస్తుంది.  విస్తృత క‌వ‌రేజీ కూడా ఉంటుంది. కంటి శుక్లం, మోకాలి మార్పిడి వంటి కొన్ని వ్యాధుల కోసం త‌ప్ప‌నిస‌రి వెయిటింగ్ పీరియడ్‌ను యువత అధిగమించవచ్చు.

కంపెనీ అందించిన ఆరోగ్య పాల‌సీ సాధార‌ణంగా రూ. 3-5 ల‌క్ష‌ల ప్రామాణిక బీమా మొత్తం, అనేక మిన‌హాయింపులు లేదా స‌హ‌-చెల్లింపుల‌తో వ‌స్తుంది. ఆ మొత్తం స‌రిపోతుందా లేదా అని ఆలోచించాలి. ఒకే సంవ‌త్స‌రంలో కుటుంబంలో అంద‌రూ అనారోగ్యానికి గురైతే మీకు, మీ కుటుంబానికి అయ్యే ఆస్ప‌త్రి ఖ‌ర్చుల‌కు కంపెనీ ఇచ్చే ఆరోగ్య బీమా స‌రిపోదు. ప్ర‌తి సంవ‌త్స‌రం 15% చొప్పున పెరుగుతున్న వైద్య ద్ర‌వ్యోల్బ‌ణాన్ని ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవాలి. సొంతంగా కూడా ఒక ఆరోగ్య బీమా పాల‌సీ తీసుకుంటే మీరు మీ ఉద్యోగాన్ని మార్చిన‌ప్ప‌టికీ లేదా ఉద్యోగాన్ని నిలిపివేసిన‌ప్ప‌టికీ మీ వ్యక్తిగ‌త ఆరోగ్య సంర‌క్ష‌ణ పాల‌సీ అమ‌లులో ఉంటుంది.

బీమా మొత్తం, మీ జీతం, మీరు నివ‌సిస్తున్న న‌గ‌రం, కుటుంబ వ్యాధుల చ‌రిత్ర‌పై ఆధార‌ప‌డి పాల‌సీ తీసుకోవాలి. ఉదా: మీరు న‌లుగురు వ్య‌క్తుల కుటుంబాన్ని క‌లిగి ఉంటే, క‌నీసం రూ. 15 - 20 ల‌క్ష‌ల బీమా క‌వ‌రేజీని పొంద‌డం మంచిది. బీమా సంస్థ ఆసుప‌త్రుల నెట్‌వ‌ర్క్‌, న‌గ‌దు ర‌హిత సౌక‌ర్యాల ల‌భ్య‌త‌, ఆరోగ్య క‌వ‌ర్ నుంచి మిన‌హాయించిన అనారోగ్యాలు, బీమా సంస్థ‌లు అందించే యాడ్‌-ఆన్‌ల వంటి అంశాల‌ను కూడా చూడండి. మీకు గ‌రిష్ఠ ర‌క్ష‌ణ‌ను అందించే ఆరోగ్య బీమా క‌వ‌ర్‌ను ఖ‌రారు చేసే ముందు పెద్దా చిన్నా అన్ని అంశాల‌నూ ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌డం చాలా ముఖ్యం.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని