ఎన్‌పీఎస్‌లో అదనపు రూ. 50 వేల మినహాయింపు మంచిదేనా?

ఎన్‌పీఎస్‌ తో కలిపి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ష‌న్ 80C కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. ఏప్రిల్ 1, 2015 నుంచి సెక్ష‌న్ 80CCD(1B) కింద ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఎన్పీఎస్ లో అదనంగా రూ.50 వేలు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు...

Published : 25 Dec 2020 12:35 IST

అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు కోసం ఎన్‌పీఎస్‌లో రూ.50 వేలు పెట్టుబ‌డులు పెట్ట‌డం స‌రైన నిర్ణ‌యం కాదు అని ఆర్థిక నిపుణుల సూచ‌న‌.. పెట్టుబ‌డుదారులు వీలైనంత వ‌ర‌కు ప‌న్ను ఆదా చేసుకోవాలని ప్ర‌య‌త్నిస్తారు. ఎన్‌పీఎస్‌లో అద‌నంగా రూ.50 వేలు సెక్ష‌న్ 80CCD(1B) తో అద‌న‌పు లాభం ఉంటుందా? సెక్ష‌న్ 80 సీ కాకుండా అద‌నంగా ప‌న్ను మిన‌హాయింపు పొంద‌వ‌చ్చు. మ‌రి మీరు ఇందులో పెట్టుబ‌డులు పెట్టారా? ఎన్‌పీఎస్‌లో ప‌న్ను మిన‌హాయింపు ల‌భించే అంశాలు..

ఎన్‌పీఎస్‌ తో కలిపి రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు సెక్ష‌న్ 80C కింద ప‌న్ను మిన‌హాయింపులు ల‌భిస్తాయి. ఏప్రిల్ 1, 2015 నుంచి సెక్ష‌న్ 80CCD(1B) కింద ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు ఎన్పీఎస్ లో అదనంగా రూ.50 వేలు పెట్టుబ‌డులు పెట్ట‌వ‌చ్చు.

ఉదాహ‌ర‌ణ‌కు, రూ.50 వేలు ఎన్‌పీఎస్‌లో వ‌చ్చే 15 ఏళ్ల కొర‌కు పెట్టుబ‌డులు పెడితే రాబ‌డి 10 శాతం అనుకుందాం, రూ.15.88 ల‌క్ష‌లు వ‌స్తుంది. ఏప్రిల్ 1, 2019 నుంచి 60 శాతం విత్‌డ్రా చేసుకున్న‌ప్ప‌టికీ ప‌న్ను ఉండ‌దు. వివ‌రాల్లోకి వెళ్తే…

ఎన్‌పీఎస్ పూర్తి ప‌న్ను మిన‌హాయింపు ( EEE) ఉంటుంది. 60 శాతానికి ప‌న్ను ఉండ‌దు కావున రూ.9.528 ల‌క్ష‌లు చేతికి ల‌భిస్తుంది. కానీ ఎందుకు పెట్టుబ‌డుల‌కు సిద్ధ‌ప‌డ‌రు అంటే మిగ‌తా రూ.6.35 ల‌క్ష‌ల తో తప్పక యాన్యుటీ పధకం(పెన్ష‌న్ ప్లాన్) లో మదుపు చేయాల్సి ఉంటుంది. యాన్యుటీ ప్లాన్ ఎలా ప‌నిచేస్తుంది తెలుసుకుందాం.

ప‌న్ను వ‌ర్తించే ఆదాయం రూ.10,00,000 అనుకుందాం. సెక్షన్ 80C కింద రూ.1,50,000 ఎన్పీఎస్ + పీపీఎఫ్ +ఈపీఎఫ్ + ఈఎల్ఎస్ఎస్ క‌లిపి ఆదా చేసుకోవచ్చు.

నిక‌రంగా ప‌న్ను వ‌ర్తించే ఆదాయం రూ.8,50,000
ఉదాహ‌ర‌ణ‌కు, మొత్తం ట్యాక్స్ రూ.82,500 . అంటే పన్ను పోను ఆదాయం రూ.7,67,500.

ఉదాహ‌ర‌ణ‌కు రూ.50 వేలు ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెడితే, రూ.8,00,000(8,50,000 - 50,000) ప‌న్ను కింద‌కి వ‌స్తుంది. మొత్తం ప‌న్ను రూ.72,500. అంటే పన్ను పోను ఆదాయం = రూ.8,00,000 - 72,500 = రూ.7,27,500

మొద‌టి కేసులో ఎన్‌పీఎస్‌లో అదనంగా రూ. 50 వేలు పెట్టుబ‌డులు పెట్ట‌లేదు. అందుకే రూ. 40,000 మిగిలాయి(రూ. 10 వేల పన్ను కట్టాక). దీంతో ప్రతి ఏడాది ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో 15 ఏళ్ల‌కి పెట్టుబ‌డులు పెడితే (12 శాతం రాబ‌డి అనుకుంటే) రూ.14.91 ల‌క్ష‌లు వ‌స్తుంది.

రెండో కేసులో ఎన్‌పీఎస్‌లో అదనంగా పెట్టుబ‌డులు పెట్టారు. ఎన్‌పీఎస్‌లో 15 సంవ‌త్స‌రాల‌కు 10 శాతం రాబ‌డి అనుకుంటే రూ.15.88 ల‌క్ష‌లు ల‌భిస్తాయి. అయితే పైన చెప్పిన‌ట్లుగా రూ.9.5 ల‌క్ష‌లు మాత్ర‌మే చేతికి ల‌భిస్తాయి. రూ.6.35 లక్ష‌ల‌కు యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది.

ఇక్క‌డ ఎన్‌పీఎస్‌లో 50 శాతం ఈక్విటీ పెట్టుబ‌డులు ఉన్నాయ‌నుకుంటే ఈక్విటీ మ్యూచువ‌ల్ ఫండ్ల‌కు స‌మానంగా రాబ‌డి వ‌స్తుందని అనుకుంటారు. కానీ ఇది త‌ప్పు. కేవ‌లం ప‌న్ను మిన‌హాయింపు కోస‌మే పెట్టుబ‌డులు పెట్ట‌కూడ‌దు. ఎన్‌పీఎస్‌లో 40 శాతం ప‌న్ను ర‌హిత కార్ప‌స్ తో యాన్యుటీ కొనుగోలు చేయాల్సి ఉంటుంది. పెన్షన్ పై కూడా పన్ను వర్తింస్తుందని గమనించండి. కేవ‌లం ప‌న్ను ఆదా కోసం ఎన్‌పీఎస్‌లో పెట్టుబ‌డులు పెట్టి పోర్ట్‌ఫోలియోను త‌ప్పిదాలు చేయ‌కూడ‌దు. ఎన్‌పీఎస్ కూడా ఒక రకంగా యులిప్ వంటిదే. లిక్విడిటీ ఉండ‌దు.

ఎన్‌పీఎస్ పెట్టుబ‌డులు సూచించ‌క‌పోవ‌డానికి ఒక కార‌ణం
ఒక‌వేళ 60 సంవ‌త్స‌రాలకు ముందు ఎన్‌పీఎస్ నుంచి ఉప‌సంహ‌రించుకోవాల‌నుకుంటే 80 శాతం నిధులు యాన్యుటీలో మిగిలిపోతాయి. కేవ‌లం 20 శాతం మాత్ర‌మే ప‌న్ను ర‌హితంగా ఉంటాయి. అదే మ్యూచువ‌ల్ ఫండ్లలో అయితే ఎప్పుడైనా మొత్తం డ‌బ్బును తీసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి, సెక్ష‌న్‌ 80CCD(1B) కింద అద‌న‌పు ప‌న్ను మిన‌హాయింపు పొందేందుకు రూ.50 వేలు పెట్టుబ‌డులు పెట్టడం అంతగా ఉపయోగకరం కాదు.

చివ‌ర‌గా.. ఎన్‌పీఎస్‌ను ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం నిధిని స‌మ‌కూర్చుకునే సాధ‌నంగా ఉప‌యోగించుకోవ‌చ్చు. దీంతో సెక్ష‌న్ 80 సీ కింద ప‌న్ను మిన‌హాయింపులు కూడా ల‌భిస్తాయి. ఈపీఎఫ్ తో పాటు ఎన్‌పీఎస్ ప‌ద‌వీ విర‌మ‌ణ కోసం త‌గిన పదవీ విరమణ నిధిని జ‌మ‌చేసుకునేందుకు ఉప‌యోగ‌ప‌డుతుంది. నెల‌వారిగా పెన్ష‌న్ కూడా పొందే అవ‌కాశం ఉంటుంది. అయితే దీనికి లాక్-ఇన్ పీరియ‌డ్ ఉండ‌టంతో అత్య‌వ‌స‌ర స‌మ‌యాల్లో న‌గ‌దు తీసుకునేందుకు వీల్లేక‌పోవ‌డం ఎన్‌పీఎస్‌లో ఉన్న లోపంగా చెప్ప‌వ‌చ్చు. ఎన్పీస్ లో పెట్టుబడులు చేస్తూ సెక్షన్ 80C ద్వారా పన్ను మినహాయింపు పొందే వారు సెక్ష‌న్ 80CCD(1B) లో అద‌న‌పు ప‌న్ను ఆదా కోసం రూ.50 వేలు పెట్టుబ‌డులు పెట్ట‌డం అనేది సూచించ‌ద‌గిన‌ది కాదు. ఎన్పీఎస్ లో కొంత భాగం యాన్యుటీ కోసం లాక్ చేస్తారు. దీనికి బ‌దులుగా మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెట్టుబ‌డులు పెడితే అవ‌స‌ర‌మైన‌ప్పుడు పూర్తి న‌గ‌దు తీసుకునే అవ‌కాశం ఉండ‌టంతో పాటు మంచి రాబ‌డిని కూడా పొంద‌వ‌చ్చు. క్రమంగా దీర్ఘకాలం కోసం పెట్టుబడులు పెట్టే వారికి మ్యూచువల్ ఫండ్లు మంచి నిధిని ఏర్పాటు చేసే అవకాశాన్ని కల్పిస్తాయి. ఈ నిధి తో 60 ఏళ్ళ వయసు నిండాక సీనియర్ సిటిజెన్ సేవింగ్స్ స్కీం లాంటి మంచి రాబడి అందించే పథకాల్లో మదుపు చేసి పెన్షన్ పొందొచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని