రెండో ఇల్లు కొనుగోలుతో ఎంత పన్ను ఆదా చేసుకోవచ్చో మీకు తెలుసా?

గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాల్లో స్థిరాస్తి రంగం అంచ‌నాల‌కు మించి రాణించింది. కొద్దో గొప్పో భూమి ఉన్న సామాన్య జ‌నాలు సైతం రియ‌ల్ ఎస్టేట్ బూమ్‌తో ల‌క్షాధికారుల‌య్యారు. సొంత ఇల్లు ఒక‌టున్నా మ‌రోదాన్ని కొనేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు.....

Updated : 02 Jan 2021 17:18 IST

గ‌డ‌చిన రెండు ద‌శాబ్దాల్లో స్థిరాస్తి రంగం అంచ‌నాల‌కు మించి రాణించింది. కొద్దో గొప్పో భూమి ఉన్న సామాన్య జ‌నాలు సైతం రియ‌ల్ ఎస్టేట్ బూమ్‌తో ల‌క్షాధికారుల‌య్యారు. సొంత ఇల్లు ఒక‌టున్నా మ‌రోదాన్ని కొనేందుకు చాలా మంది ఆస‌క్తి చూపిస్తున్నారు. కొంద‌ర‌మే ఆస్తిపాస్తుల‌ను పెంచుకునేందుకు చూస్తుంటే మ‌రికొంద‌రు దీనిపై అద్దె రూపంలో అద‌నంగా ఆదాయం వ‌చ్చే ఉద్దేశంతో కొనాల‌నుకుంటున్నారు. చాలా మందికి స్థిరాస్తి ఉంటే ఎక్క‌డ లేని భ‌రోసా క‌లుగుతుంది. స్థిరాస్తి సామ్రాజ్యంలో వ‌చ్చిన రాబ‌డుల‌ను చూస్తే దీంట్లో పెట్టుబ‌డి లాభ‌దాయ‌క‌మే అనిపించ‌క మాన‌దు. మ‌రి రెండో ఇల్లు కొన‌డంలో ఉన్న సాధ‌క‌బాధ‌కాల‌ను తెలుసుకుందాం.

ఇల్లు కొనడమే భారమైన ఈ రోజుల్లో కొంత మంది మాత్రమే ఇల్లు సొంతం చేసుకుని రెండో ఇల్లు కొనుగోలు చేయగలిగే స్థితి లో ఉన్నారు. మరి, అలంటి వారు రెండో ఇంటిని సొంతం చేసుకోవ‌డంలో ఉన్న ప్ర‌యోజ‌నాలు ఇవే. 1. ప‌న్ను ఆదా - ఇంటిని కొనుగోలు చేసేటప్పుడు కొంత వ‌ర‌కైనా గృహ రుణం పొందేలా చూస్తుంటారు. వేత‌నాలు అందుకునే ఉద్యోగుల‌కు ఇది క‌లిసొచ్చే అంశం. గృహ‌రుణం అస‌లుపై సెక్ష‌న్ 80సీ కింద రూ.1.5ల‌క్ష‌ల దాకా ప‌న్ను మిన‌హాయింపు పొందొచ్చు. ఇక గృహ‌రుణ వ‌డ్డీపై సెక్ష‌న్‌ 24బీ కింద రూ.2ల‌క్ష‌ల దాకా పన్ను ఆదా ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. ఇల్లు అద్దెకిచ్చినా, యాజ‌మానే స్వ‌యంగా ఇంట్లో నివ‌సించినా రూ.2ల‌క్ష‌ల దాకా ప‌న్ను ఆదా పొందే వీలుంటుంది. 2.ప్ర‌త్యామ్నాయ ఆదాయ వ‌న‌రుగా - రెండో ఇల్లు కుటుంబానికి అద‌న‌పు ఆదాయాన్ని స‌మ‌కూరుస్తుంది. అదే ఇల్లు ఏ ఐటీ హ‌బ్‌కు చేరువ‌లో ఉంటే అద్దెలు భారీగా వ‌చ్చే అవ‌కాశం ఉంది. ఈ అద్దెతో గృహ రుణం కూడా తీర్చేసుకోవచ్చు. ఏటా 10శాతం పెరిగే అద్దెతో మంచి లాభ‌మే. గృహ రుణాన్ని ముందుగా తీర్చేస్తే ఆ వ‌చ్చే అద్దె ఇత‌ర కుటుంబ ఖ‌ర్చుల‌కు అక్క‌ర‌కు వ‌స్తుంది. 3. భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు - రెండో ఇల్లు ఉంటే ఎన్నో భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు అక్క‌ర‌కు వ‌స్తుంది. సొంత రిటైర్‌మెంట్‌, పిల్ల‌ల ఉన్న‌త చ‌దువులు, వారి పెళ్లిళ్ల‌కు ఉప‌యోగ‌ప‌డుతుంది. ప‌ద‌వీ విర‌మ‌ణ పొందిన వారు రివ‌ర్స్ మార్టిగేజ్ ద్వారా రెండో ఇంటిపై క్ర‌మ‌మైన ఆదాయాన్ని పొందొచ్చు. పెట్టుబ‌డుల‌పై ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం చూపిస్తుంది కాబ‌ట్టి స్థిరాస్తి ఈ విష‌యంలో అన్నింటికంటే ముందుండి బాగా విలువ పెరుగుతుంది. మ‌న‌కు అవ‌స‌ర‌మైన‌ప్పుడు అమ్ముకోవ‌చ్చు లేదా త‌న‌ఖా పెట్టి రుణం పొందొచ్చు. ప్ర‌యోజ‌నాలొక్క‌టే ఇంటి కొనుగోలు నిర్ణ‌యంలో స్ప‌ష్ట‌త‌నివ్వాలి. ఇంటి కొనుగోలు దీర్ఘ‌కాల ప్ర‌ణాళిక‌లో భాగం. ఉపాధి కోల్పోయిన సంద‌ర్భాల్లో ఈఎమ్ఐలు క‌ట్టలేని ప‌రిస్థితి ఏర్ప‌డితే బ్యాంకులు జ‌ప్తుచేసి ఇంటిని వేలం వేసినా వేస్తారు.

కొన్ని న‌ష్టాల గురించి తెలుసుకుందాం…

1. అప్పుల ఊబిలో…ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో ఇంటి కొనుగోలు విలాసవంత‌మైన‌ది కాకుండా ఓ అవ‌స‌రంగా చూస్తున్నాం. ఇంటిని కొనుగోలు చేస్తున్నామంటే దీర్ఘ‌కాలంపాటు అంటే 20 లేదా 25ఏళ్ల దాకా వాయిదాలు చెల్లించేందుకు సిద్ధ‌ప‌డుతున్న‌ట్టు లెక్క‌, అంటే అప్పుల ఊబిలో చిక్కుకున్న‌ట్టే లెక్క‌. ఇది ప‌రోక్షంగా పొదుపుపై ప్ర‌భావం చూపిస్తుంది. అంత భారీ రుణం చెల్లించేట‌ప్పుడు జీవ‌న విధానంలో అనేక స‌ర్దుబాట్లు చేసుకోవాల్సి వ‌స్తుంది. ఇవ‌న్నీ వెర‌సి ఏదైనా అత్య‌వ‌స‌రం ఏర్పడితే మాత్రం ల‌క్ష్యాలు కుంటుప‌డిపోతాయి.

2. న‌గ‌దు ల‌భ్య‌త‌ - మాంద్యం స‌మ‌యంలో స్థిరాస్తి సంస్థ‌లు అపార్ట్‌మెంట్‌ల‌లోని ఫ్లాట్ల పైన‌ డిస్కౌంట్ ఇచ్చిన సంద‌ర్భాలున్నాయి. అయిన‌ప్ప‌టికీ కొనుగోలు చేసేవారు ఎవ‌రూ లేకపోయారు. సంక్షోభంలో ఆస్తిని అమ్మ‌డం చాలా క‌ష్టమైన ప‌ని. మంచి రోజుల్లోనూ మొత్తం అమ్మ‌కాల ప్ర‌క్రియ పూర్తిచేసుకోవ‌డానికి క‌నీసం 2 లేదా 3 నెల‌ల స‌మ‌యం ప‌డుతుంది. లేదా తక్కువ మొత్తానికి సెటిల్ కావాల్సి ఉంటుంది. స్థిరాస్తి పెట్టుబ‌డిలోంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకునేందుకు ఆస్కార‌మే లేదు. అవ‌స‌ర‌మైతే ఆస్తి మొత్తాన్ని అమ్మేయాల్సి ఉంటుంది.

3. మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో…రూ.65ల‌క్ష‌లు విలువ‌చేసే స్థిరాస్తి కొనేందుకు సిద్ధ‌ప‌డ్డార‌నుకుందాం. దీంట్లో డౌన్‌పేమెంట్ కింద రూ.15లక్ష‌లు పోయినా రూ.50ల‌క్ష‌ల‌కు రుణం తీసుకోవాల్సిందే. ఇది 20ఏళ్లకు 9శాతం వార్షిక వ‌డ్డీకి నెల‌వారీ వాయిదా లెక్కిస్తే నెల‌కు రూ.44,986 అవుతుంది. మొత్త‌మంతా క‌లిపి రూ.1.08కోట్లు చెల్లించిన‌వార‌వుతారు. ఇదే వాయిదా సొమ్మును, డౌన్‌పేమెంట్‌ను క‌లిపి మ్యూచువ‌ల్ ఫండ్ల‌లో పెడితే ఎలా ఉంటుందో చూద్దాం. 20ఏళ్ల‌కు 12శాతం రాబ‌డి అంచ‌నా వేసుకుంటే ఏకంగా రూ.5.95కోట్ల సంప‌ద జ‌మ అవుతుంది. ఈ కాలంలో ఇంటి విలువ ఏకంగా 9 రెట్లు పెర‌గ‌డ‌మ‌నేది చాలా అరుదని చెప్పొచ్చు.

4.అపార్ట్‌మెంటా… ఇండిపెండెంట్ ఇల్లా? అపార్ట్‌మెంట్ కొన్న‌ట్ట‌యితే పెట్టుబ‌డి ప‌రంగా చూస్తే అద్దె వ‌సూళ్ల ద్వారా బాగానే వ‌చ్చినా ఇండిపెండెంట్ ఇంటితో పోలిస్తే అపార్ట్‌మెంట్ విలువ త్వ‌ర‌గా త‌గ్గిపోతుంది. ఇండిపెండెంట్ ఇంటికి మొద‌ట్లో పెట్టుబ‌డి ఎక్కువ పెట్టినా త‌ర్వాత త‌ర్వాత దాని విలువ పెరుగుతంది. భూమి విలువ పెరగ‌డ‌మే ఇందుకు కార‌ణం. 5) ప్ర‌త్యామ్నాయ ప‌న్ను ఆదా మార్గాలు - పైన పేర్కొన‌ట్టు గృహ‌రుణాలు సెక్ష‌న్ 80సీ, 24బీ కింద ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాలు క‌ల్పిస్తాయి. అయితే, స్థిరాస్తితో ముడిప‌డి ఉన్న సంక్లిష్ట‌త‌ల‌తో పోలిస్తే అనేక ఇత‌ర ప‌న్ను ఆదా ప‌థ‌కాలు అందుబాటులో ఉన్నాయి. పీపీఎఫ్‌, బీమా ప్రీమియంలు, ప‌న్నుర‌హిత ఎఫ్‌డీలు… ఇలాంటివెన్నో ఉన్నాయి. ఈఎల్ఎస్ఎస్ మ్యూచువ‌ల్ ఫండ్ల ద్వారా కూడా ప‌న్ను ఆదా ప్ర‌యోజ‌నాన్ని పొందొచ్చు. ఇవి మంచి రాబ‌డుల‌ను సైతం అందిస్తాయి. సెక్ష‌న్ 80సీ ప‌రిమితిని ఈ ఆప్ష‌న్ల‌న్నింటితో పూర్తిచేశాకే గృహ‌రుణానికి వినియోగించుకునేందుకు ప‌రిశీలించాలి. మొద‌ట్లో గృహ‌రుణంపై అధిక వ‌డ్డీ వ‌ల్ల ఎక్కువ పన్ను ఆదా పొందేందుకు అవ‌కాశ‌మున్నా… క్ర‌మేపీ వ‌డ్డీ త‌గ్గ‌డం వ‌ల్ల ఎక్కువ ప‌న్ను ఆదా చేసుకోలేక పొదుపు పై ప్ర‌భావం చూపిస్తుంది.

చివ‌ర‌గా…

పెట్టుబ‌డి అవ‌స‌రాల‌కు రెండో ఇంటిని కొనుగోలు చేసేవారు ప్ర‌యోజ‌నాలు, న‌ష్టాల గురించి క్షుణ్ణంగా అధ్య‌య‌నం చేయాలి. ఆస్తి పంప‌కాల్లో వార‌స‌త్వ భ‌యాలు కూడా పొంచి ఉంటాయి. ఇవీ కాకుండా ఖాళీగా ఉన్న స్థ‌లాన్ని భూక‌బ్జాదారుల నుంచి ర‌క్షించుకునేందుకు చాలా ఇబ్బందులు ఉంటాయి. భ‌విష్య‌త్‌లో ఇంటి నిర్వ‌హ‌ణ‌కు పెద్ద‌మొత్తంలో పెట్టాల్సి వ‌స్తుంది. అన్నీ అనుకూలంగా ఉంద‌ని భావిస్తేనే రెండో ఇంటిని కొనుగోలు చేసేందుకు మొగ్గుచూపించాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని