Mobile Exports: భారత్‌ నుంచి గణనీయంగా పెరిగిన మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులు

గత ఆర్థిక సంవత్సరం మొబైల్‌ ఫోన్‌ ఎగుమతులతో పోలిస్తే..ఈ ఆర్థిక సంవత్సరం భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి.

Published : 08 Apr 2023 15:59 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మన దేశంలో తయారై ఇతర దేశాలకు ఎగుమతి అవుతున్న మొబైల్‌ ఫోన్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. ఇండియా సెల్యులార్‌ అండ్‌ ఎలక్ట్రానిక్స్‌ అసోసియేషన్‌ (ICEA) డేటా ప్రకారం ప్రభుత్వ ప్రోత్సాహకాలతో భారతదేశం 2022-23 ఆర్థిక సంవత్సరంలో రూ.85,000 కోట్ల విలువైన మొబైల్ ఫోన్ ఎగుమతి చేసింది. ప్రొడక్షన్‌-లింక్డ్‌ ఇన్సెంటివ్‌ (PLI) స్కీమ్‌ల ద్వారా గత ఆర్థిక సంవత్సరంలో ఎగుమతులతో పోలిస్తే భారత్‌ నుంచి స్మార్ట్‌ఫోన్‌ ఎగుమతులు రెట్టింపు అయ్యాయి. మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో మొబైల్‌ ఎగుమతుల్లో భారత్‌ ఈ ఘనత సాధించిందని పరిశ్రమ వర్గాలు వెల్లడించాయి. భారత్‌ నుంచి మొబైల్‌ ఫోన్‌లను ఎక్కువగా ఎగుమతి అవుతున్న దేశాల్లో యూఏఈ, యూఎస్‌, నెదర్లాండ్స్‌, యూకే, ఇటలీ తొలి ఐదు స్థానాల్లో ఉన్నాయి.

భారత్‌లో విక్రయం జరుగుతున్న మొత్తం స్మార్ట్‌ఫోన్‌లలో 97 శాతానికి పైగా స్థానికంగానే ఉత్పత్తి చేస్తున్నారు. భారత్‌ ఇప్పుడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద మొబైల్‌ ఫోన్‌ తయారీదారుగా ఉంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.1 లక్ష కోట్ల ఎగుమతులు సాధించడమే లక్ష్యమని ఎలక్ట్రానిక్స్‌, ఐటీ మంత్రిత్వశాఖ తెలిపింది. 2022లో 80-85 శాతం ఐఫోన్‌లను చైనా ఉత్పత్తి చేయగా.. 2027 నాటికి భారత్‌ 45-50 శాతం యాపిల్‌ ఐఫోన్‌లను ఉత్పత్తి చేస్తుందని ఆశాభావం వ్యక్తంచేసింది. 2022 చివరి నాటికి ఐఫోన్‌ల మొత్తం ఉత్పత్తి సామర్థ్యంలో భారత్‌ 10-15 శాతం వాటాను కలిగి ఉంది. చైనా నుంచి స్మార్ట్‌ఫోన్‌ తయారీ పరిశ్రమ ఇతర దేశాలకు తరలడంతో భారత్‌, వియత్నాం అతిపెద్ద లబ్ధిదారులుగా మారనున్నాయన్నది ఒక అంచనా.

Trending

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని