Silicon Valley Bank: సిలికాన్ వ్యాలీ బ్యాంక్ కలకలం
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందరికీ సుపరిచితమే. అయితే అక్కడి ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ (ఎస్‌వీబీ) మాత్రం ఇటీవలి దాకా ఆ ప్రాంతం వెలుపల అత్యధికులకు తెలియదు.
మూసివేత, ఆస్తుల జప్తు
ఆందోళనలో ప్రపంచవ్యాప్త బ్యాంకులు, అంకురాలు
2008 తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యం ఇదే
అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అందరికీ సుపరిచితమే. అయితే అక్కడి ‘సిలికాన్ వ్యాలీ బ్యాంక్’ (ఎస్‌వీబీ) మాత్రం ఇటీవలి దాకా ఆ ప్రాంతం వెలుపల అత్యధికులకు తెలియదు. గురువారం అమెరికా మార్కెట్లో అంకుర పరిశ్రమ షేర్లు రక్తమోడడానికి కారణం ఈ బ్యాంకే. అంతే కాదు.. అంకుర సంస్థలు, టెక్ వర్గాల్లో ఇది తీవ్ర భయాందోళనలు రేకెత్తిస్తోంది. శుక్రవారం ఏకంగా ఈ బ్యాంక్‌ను నియంత్రణ సంస్థలు మూసివేయడంతో పాటు ఆస్తులను జప్తు చేయడంతో ఈ బ్యాంకు మాతృ సంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు దాదాపు 60 శాతం కుంగడం గమనార్హం.
ఇంతకీ ఏం జరిగిందంటే..: శాంతాక్లారా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ అనుబంధ సంస్థే సిలికాన్ వ్యాలీ బ్యాంక్. అమెరికాలో 16వ అతిపెద్ద బ్యాంక్ ఇది. టెక్ ఆధారిత వెంచర్ క్యాపిటల్ ఫండ్‌లకు నిధులు అందించడం దీని ప్రత్యేకత. ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ తన పోర్ట్‌ఫోలియోలో నష్టాలను పూడ్చుకోవడం కోసం, ఆర్థికంగా బలోపేతం అయ్యేందుకు 21 బిలియన్ డాలర్ల సెక్యూరిటీలను విక్రయించినట్లు.. 2.25 బిలియన్ డాలర్ల వాటా విక్రయాన్ని నిర్వహించనున్నట్లు గురువారం ప్రకటించింది. ఇక్కడి నుంచే బ్యాంకు వైఫల్య పరిణామాలు వేగంగా చోటు చేసుకున్నాయి. నికర వడ్డీ ఆదాయాల్లో భారీ క్షీణత నమోదు కావచ్చని ఎస్‌వీబీ పేర్కొనడంతో అగ్నికి ఆజ్యం పోసింది.
ఎస్‌వీబీ ప్రకటన రావడం ఆలస్యం.. బ్యాంకు డిపాజిట్లలో అధిక మొత్తం ఉపసంహరణకు గురయ్యాయి. దీంతో పెట్టుబడులను పరిమితం చేసుకోవాలని, డబ్బును ఉపసంహరించుకోవాలని పలువురు వెంచర్ క్యాపిటలిస్టులు తమ పోర్ట్‌ఫోలియో వ్యాపార సంస్థలకు ఆదేశాలు జారీ చేశారు. వేరొక బ్యాంకుకు నగదు బదిలీ చేయమని మరికొన్ని వీసీ సంస్థలు, పోర్ట్‌ఫోలియో కంపెనీలకు తెలిపాయి. కొన్ని మాత్రమే ఎస్‌వీబీకి అండగా నిలబడ్డాయి. ఈ సమస్యలకు తోడు సిల్వర్‌గేట్ క్యాపిటల్ కార్ప్ మూసివేతా సంభవించడంతో, బ్యాంకింగ్ షేర్లను కిందకు లాగాయి. ఈ పరిణామల మధ్య ఫెడరల్ డిపాజిట్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఈ బ్యాంకు ఆస్తులను జప్తు చేసింది. దీంతో 2008 ఆర్థిక సంక్షోభం సమయంలో వాషింగ్టన్ మ్యూచువల్ తర్వాత అతిపెద్ద బ్యాంకు వైఫల్యంగా ఇది నమోదైంది.
35 ఏళ్లలోనే అతిపెద్ద పతనం: మాతృసంస్థ ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు 35 ఏళ్లలోనే అత్యంత అధ్వానంగా ముగిశాయి. గురువారం ఏకంగా 60% క్షీణించడంతో 80 బిలియన్ డాలర్ల నష్టం వచ్చింది. వెంచర్ క్యాపిటలిస్టులకు సర్దిచెప్పడానికి బ్యాంకు ప్రయత్నం చేసింది. అయితే శుక్రవారం పరిణామంతో ట్రేడింగ్ మొదలవడానికి ముందే ఈ షేర్లలో ట్రేడింగ్‌ను నిలిపేశారు. గత సెప్టెంబరులో 406 డాలర్ల వద్ద ఉన్న ఎస్‌వీబీ ఫైనాన్షియల్ గ్రూప్ షేరు, ప్రస్తుతం 106 డాలర్లకు పతనమైంది. గత 5 రోజుల్లోనే షేరు విలువ 178 డాలర్లకు పైగా క్షీణించింది.
అంకురాలకు.. ఈ బ్యాంకుకు సంబంధం ఏమిటి?: అమెరికా అంకురాలకు ఎస్‌వీబీకి విడదీయలేని సంబంధం ఉంది. సిలికాన్ వ్యాలీ, టెక్ అంకురాలకు ఈ బ్యాంకే ఆర్థిక సహాయం చేస్తోంది. అమెరికాలోని సగం వెంచర్ క్యాపిటల్ మద్దతున్న అంకురాలతో ఇది వ్యాపారం చేస్తోంది. అంతే కాదు.. అమెరికాలో 44 శాతం టెక్, ఆరోగ్య సంరక్షణ కంపెనీలకూ ఇదే ఆధారం. అందుకే అంకుర, టెక్ పరిశ్రమల్లో భయాందోళనలు మొదలయ్యాయి.
* సిలికాన్ వ్యాలీ బ్యాంక్ అనేది ఎక్కువ టెక్ పరిశ్రమకే రుణాలిచ్చినందున.. ఈ పరిణామం ఇతర బ్యాంకులపై చూపకపోవచ్చని విశ్లేషకులు అంటున్నారు. ప్రధాన బ్యాంకులకు ఈ తరహా పరిస్థితులు రాకుండా కావలసినంత నిధులున్నాయని చెబుతున్నారు.
గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని


తాజా వార్తలు (Latest News)
-
World News
Long Covid: దీర్ఘకాలిక కొవిడ్‌తో క్యాన్సర్‌ను మించి ఇబ్బందులు
-
General News
Top Ten News @ 9 AM: ఈనాడు.నెట్‌లో టాప్ 10 వార్తలు
-
Ap-top-news News
Raghu Rama: నా వైద్య పరీక్షల నివేదికలను ధ్వంసం చేయబోతున్నారు
-
Ap-top-news News
Pradhan Mantri Matru Vandana Yojana: రెండో కాన్పులో అమ్మాయి పుడితే రూ.6వేలు
-
General News
Hyderabad News: చేప ప్రసాదం పంపిణీ ప్రారంభం..
-
Ap-top-news News
అవినీతి, అక్రమాలను ప్రశ్నిస్తే మార్గదర్శిపై దాడులు: కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్