Simple ONE EV: సింపుల్‌ వన్‌ వచ్చేసింది.. ఒక్కసారి ఛార్జ్‌ చేస్తే 212km

Simple ONE electric scooter: విద్యుత్‌ ద్విచక్ర వాహన తయారీ సంస్థ సింపుల్‌ ఎనర్జీ తమ సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ (Simple ONE electric scooter)ను భారత్‌లో విడుదల చేసింది. దీని ధర, ఫీచర్లు, బ్యాటరీ రేంజ్‌ వంటి వివరాలు తెలుసుకుందాం..!

Updated : 23 May 2023 16:18 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: గతకొంత కాలంగా విద్యుత్‌ వాహన ప్రియులు ఆతృతగా ఎదురు చూస్తున్న ‘సింపుల్‌ వన్‌ ఎలక్ట్రిక్‌ స్కూటర్‌ (Simple ONE electric scooter)’ ఎట్టకేలకు మంగళవారం విడుదలైంది. ఈ స్కూటర్‌ను సింపుల్‌ ఎనర్జీ 2021 ఆగస్టులోనే ఆవిష్కరించింది. అప్పటి నుంచి ఏదో ఒక అప్‌డేట్‌తో వాహన ప్రియుల్లో ఆసక్తి రేకెత్తిస్తూ వచ్చింది. అయితే, కస్టమర్లకు మెరుగైన అనుభూతిని, సురక్షితమైన డ్రైవింగ్‌ ఎక్స్‌పీరియెన్స్‌ను ఇవ్వడం కోసం సుదీర్ఘంగా టెస్ట్‌ డ్రైవ్‌ పరీక్షలు నిర్వహించినట్లు కంపెనీ తెలిపింది. 

సింపుల్‌ వన్‌ (Simple ONE electric scooter) ‘రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌’పై చాలా సమయం, డబ్బు వెచ్చించినట్లు సింపుల్‌ ఎనర్జీ వ్యవస్థాపకుడు, సీఈఓ సుహాస్‌ రాజ్‌కుమార్‌ తెలిపారు. సుదీర్ఘ దూరం, అత్యంత స్మార్ట్‌, ఫాస్ట్‌ టెక్నాలజీ, డ్యుయల్‌ బ్యాటరీ ఈ స్కూటర్‌ ప్రత్యేకతలని వెల్లడించారు. IP67 రేటింగ్‌తో కూడిన 5kWh లిథియం ఐయాన్‌ డ్యుయల్‌ బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నట్లు తెలిపారు. 95 శాతం పరికరాలను దేశీయంగానే సమకూర్చుకున్నట్లు వెల్లడించారు.

సింపుల్‌ వన్‌ (Simple ONE electric scooter)లో ఆండ్రాయిడ్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో 7 అంగుళాల డిజిటల్‌ డిస్‌ప్లేను ఇస్తున్నట్లు కంపెనీ తెలిపింది. నావిగేషన్‌, డాక్యుమెంట్‌ స్టోరేజ్‌, బ్లూటూత్‌ కనెక్టివిటీ, బ్యాటరీ రేంజ్‌ వివరాలు, కాల్‌ అలర్ట్‌ వంటి వివరాలు తెరపై కనిపిస్తాయని వెల్లడించింది. ఒక్క నిమిషంలోనే 1.5 కి.మీ ప్రయాణించేందుకు కావాల్సిన ఛార్జింగ్‌ పూర్తవుతుందని తెలిపింది. అలా ఇంట్లో 5 గంటల 54 నిమిషాల్లో 0- 80 శాతం ఛార్జింగ్‌ పూర్తవుతుందని పేర్కొంది. ఒకసారి పూర్తిగా ఛార్జ్‌ చేస్తే 212 కి.మీ వరకు ప్రయాణిస్తుందని తెలిపింది. 2.77 సెకన్లలో 0 నుంచి 40 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుందని వెల్లడించింది. మొత్తం ఆరు రంగుల్లో ఈ స్కూటర్‌ అందుబాటులో ఉంది.

సింపుల్‌ వన్‌ స్కూటర్‌ (Simple ONE electric scooter) ధర రూ.1.45 లక్షల (ఎక్స్‌షోరూం, బెంగళూరు) నుంచి ప్రారంభమవుతుంది. 750 వాట్‌ పోర్టబుల్‌ ఛార్జర్‌కు అదనంగా రూ.13,000 చెల్లించాల్సి ఉంటుంది. తొలుత బెంగళూరులో జూన్‌ 6 నుంచి డెలివరీలు ప్రారంభం కానున్నాయి. తర్వాత మిగతా నగరాల్లో ఈ స్కూటర్లు అందుబాటులోకి వస్తాయని కంపెనీ తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని