సింగిల్ vs రెగ్యుల‌ర్ ప్రీమియం ట‌ర్మ్ ప్లాన్ - ఏది మేలు? 

సింగిల్ లేదా రెగ్యుల‌ర్ ప్రీమియం ట‌ర్మ్ బీమాలో ఏది మేలు? ఇప్పుడు తెలుసుకుందాం.

Updated : 12 Jan 2022 13:05 IST

      
జీవిత బీమా పాల‌సీని కొనుగోలు చేసిన‌ప్పుడు, ప్రీమియం చెల్లింపుల‌కు సంస్థ‌లు రెండు ర‌కాల ఆప్ష‌న్ల‌ను ఇస్తాయి. క్ర‌మ వాయిదాల‌లో లేదా సింగిల్ ప్రీమియం. వాయిదాల ప‌ద్థ‌తిని ఎంచుకున్నవారు.. నెల‌వారిగా, త్రైమాసికంగా, అర్థ‌వార్షికంగా, వార్షికంగా ఇలా ఏ ఆప్ష‌న్ ఎంచుకుంటే.. ఆ కాల‌వ్య‌వ‌ధి ప్ర‌కారం ప్రీమియం చెల్లించాల్సి ఉంటుంది. సింగిల్ ప్రీమియం పేమెంట్ ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే ఒకేసారి ప్రీమియం మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. ఇలా చెల్లించిన వారికి డిస్కౌంట్ల‌ను కూడా ఇస్తుంటాయి. డిస్కౌంట్ ల‌భిస్తుంది కాబ‌ట్టి ఒకేసారి ప్రీమియం చెల్లించి పాల‌సీ కొనుగోలు చేయాల్సిందిగా సంస్థ‌లు సూచిస్తాయి. అయితే సింగిల్ ప్రీమియం కంటే రెగ్యుల‌ర్ ప్రీమియం ప్లాన్స్ మేలు అంటున్నారు విశ్లేష‌కులు. అది ఎందుకో చూద్దాం..

నిరంత‌రంగా ప్రీమియం చెల్లించేకంటే ఒకేసారి ప్రీమియం చెల్లిస్తే త‌క్కువ చెల్లిస్తామ‌నుకుంటారు. అందువ‌ల్లే సింగిల్ ప్రీమియం ఆప్ష‌ను ఎంచుకుంటారు కొంద‌మంది. కానీ మీ ఆలోచ‌న త‌ప్పు కావ‌చ్చు. దీన్ని ఒక ఉదాహ‌ర‌ణతో అర్థం చేసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. రాజేష్, సురేష్ ఇద్ద‌రు స్నేహితులు. ఇద్ద‌రి వ‌య‌సు 30 సంవ‌త్స‌రాలు. ఇద్ద‌రు రూ. 50 ల‌క్ష‌ల క‌వ‌రేజ్‌తో మ‌రో 30 సంవ‌త్స‌రాలు ట‌ర్మ్ ప్లాన్ తీసుకున్నారానుకుందాం. రాజేష్ వార్షిక ప్రీమియం ఆప్ష‌న్‌ను ఎంచ‌కుంటే, సురేష్ సింగిల్ ప్రీమియం ఆప్ష‌న్‌ను ఎంచుకున్నాడు. 30 సంవ‌త్స‌రాల పాటు రూ. 10వేల చొప్పున రాజేష్ చెల్లించిన వార్షిక ప్రీమియం రూ. 3 ల‌క్ష‌లు. 

సురేష్ సింగిల్ ప్రీమియం ఆప్ష‌న్‌ను ఎంచుకున్నాడు కాబ‌ట్టి అత‌నికి సంస్థ‌లు ప్రీమియంలో రూ. 1.50 ల‌క్ష‌ల‌ డిస్కౌంట్‌ను అందించాయి. ఇక్క‌డ సురేష్ చెల్లించాల్సిన మొత్తం ప్రీమియంలో స‌గం ప్రీమియం మాత్ర‌మే చెల్లిస్తున్నాడు కాబ‌ట్టి మిగిలిన రూ. 1.50 ల‌క్ష‌లు ఆదా చేశాడు అనుకోవ‌చ్చు. కాని ఇక్క‌డ మీరు ద్రవ్యోల్బణాన్ని మ‌ర్చిపోతున్నారు. 6 శాతం ద్రవ్యోల్బణాన్ని లెక్కిస్తే రూ. 1.50 ల‌క్ష‌ల విలువ‌ 30 సంవ‌త్స‌రాల త‌ర్వాత రూ. 8.60 ల‌క్ష‌లకు చేరుకుంటుంది. డ‌బ్బు.. స‌మ‌యం విలువ ప‌రంగా సురేష్ చెల్లించాల్సిన దాని కంటే ఎక్కువ చెల్లించాడు. 

ప్రీమియం చెల్లింపు భారం కాకుండా..

సింగిల్ ప్రీమియం ఆప్ష‌న్ ఎంచుకుంటే పెద్ద మొత్తంలో ఒకేసారి చెల్లింపులు చేయాల్సి వ‌స్తుంది కాబ‌ట్టి ప్రీమియం చెల్లింపులు భారం అయ్యే ప్ర‌మాదం ఉంది. ఇందుకోసం పెట్టుబ‌డులు పెట్టాల్సిన డ‌బ్బును మ‌ళ్లించే ప్ర‌మాదం ఉంది. దీర్ఘ‌కాలిక ల‌క్ష్యాలు దెబ్బ‌తిన‌వ‌చ్చు. అదే రెగ్యుల‌ర్ ప్రీమియం ఆప్ష‌న్‌ను ఎంచుకుంటే చిన్న మొత్తాల‌లో చెల్లించ‌వ‌చ్చు. కాబ‌ట్టి నెల‌వారి ఆదాయం నుంచి కొంత మొత్తాన్ని ప్రీమియం చెల్లింపుల‌కు కేటాయించ‌వ‌చ్చు. ఇది పాకెట్ ఫ్రెండ్లీ ఆప్ష‌న్‌. 

రిస్క్‌..
ఒక‌వేళ‌ పాల‌సీ తీసుకున్న ఐదో ఏడాది పాల‌సీదారుడు మ‌ర‌ణిస్తే వార్షిక ప్రీమియం తీసుకున్న వారు ఐదేళ్ల ప్రీమియంలు మాత్ర‌మే చెల్లించి ఉంటారు. ఆ త‌ర్వాత ప్రీమియంలు చెల్లించ‌కుండానే పాల‌సీదారుని కుటుంబానికి హామీ మొత్తం అందుతుంది. సింగిల్ ప్రీమియం పాల‌సీ 30 ఏళ్ల‌కు సంబంధించిన ప్రీమియంలు ఇదివ‌ర‌కే చెల్లించి ఉంటారు కాబ‌ట్టి కొంత మేర న‌ష్ట‌పోవ‌చ్చు. పైన తీసుకున్న ఉదాహ‌ర‌ణ ప్ర‌కారం రెగ్యుల‌ర్‌గా చెల్లిస్తే ఐదేళ్ల‌కు రూ. 50 వేలు చెల్లించి ఉంటారు. ఒకేసారి చెల్లిస్తే రూ. 1.50 ల‌క్ష‌లు చెల్లిస్తున్నారు కాబ‌ట్టి మిగిలిన రూ.1 ల‌క్ష న‌ష్ట‌పోయిన‌ట్టే.

ప‌న్ను ప్ర‌యోజ‌నాలు..
రెండింటిలో ఏ ఆప్ష‌న్‌ను ఎంచుకున్నా చెల్లించిన ప్రీమియంపై సెక్ష‌న్ 80సి ప్ర‌కారం రూ. 1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు మిన‌హాయింపు పొందవ‌చ్చు. అయితే సింగిల్ ప్రీమియంలో ఒక‌సారి మాత్ర‌మే మిన‌హాయింపు క్లెయిమ్ చేసుకునేందుకు అవ‌కాశం ఉంటుంది. అదే రెగ్యుల‌ర్ ప్రీమియం అయితే ప్రీమియంలు చెల్లించినంత కాలం మిన‌హాయింపు ల‌భిస్తుంది. 

చివ‌రిగా..
పైన తెలిపిన ప్ర‌కారం రెగ్యుల‌ర్ ప్రీమియం పాల‌సీతో ప్రీమియం తేలిక‌గా చెల్లించ‌డంతో పాటు, ప‌న్ను ప్ర‌యోజ‌నాలను దీర్ఘ‌కాలం పాటు పొంద‌చ్చు. మీరు జీతం ద్వారా ఆదాయం పొందుతున్న వారు అయితే క్ర‌మ‌మైన ఆదాయం ఉంటుంది కాబ‌ట్టి సుల‌భంగా ప్రీమియంలు చెల్లించ‌గ‌లుగుతారు. అందువ‌ల్ల‌ రెగ్యుల‌ర్ ఆప్ష‌న్‌లో ప్రీమియం ఎక్కువ అయిన‌ప్ప‌టికీ  క్ర‌మంగా చెల్లిండ‌మే ప్ర‌యోజ‌న‌క‌రంగా ఉంటుంది. బీమా అనేది వార్షిక కాంట్రాక్టు లాంటిది. మీకు అవసరం ఉన్నన్ని ఏళ్ళు ఇలా చెల్లిస్తూ ఉండవచ్చు. ఎప్పుడైనా తక్కువ ప్రీమియం తో ఎక్కువ బీమా హామీ అందించే పాలసీ లభిస్తే మీరు ప్రస్తుత పాలసీ బదులు ఆ పాలసీ ఎంచుకోవచ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని