స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు.. ఆకర్షణీయమేనా?

మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడుల్లో అధిక నష్టభయంతోపాటు, లాభాలు ఎక్కడ ఉంటాయి? అనే ప్రశ్న వస్తే, వెనువెంటనే స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో..., అనే సమాధానం లభిస్తుంది. ఇంతకీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు... అంటే ఏవి,

Published : 30 Jul 2021 02:21 IST

మ్యూచువల్‌ ఫండ్ల పెట్టుబడుల్లో అధిక నష్టభయంతోపాటు, లాభాలు ఎక్కడ ఉంటాయి? అనే ప్రశ్న వస్తే, వెనువెంటనే స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో..., అనే సమాధానం లభిస్తుంది. ఇంతకీ స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు... అంటే ఏవి, వాటి ప్రత్యేకత ఏమిటి? తెలుసుకుందాం..

దేశీయ స్టాక్‌మార్కెట్లలో దాదాపు 5,000 కంపెనీల నమోదై ఉన్నాయి. ఇందులో మార్కెట్‌ విలువ (మార్కెట్‌ కేపిటలైజేషన్‌) ప్రకారం 250వ కంపెనీ నుంచి దిగువన ఉన్న కంపెనీలను స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందినవిగా పరిగణిస్తున్నారు. సాధారణంగా ఈ తరగతికి చెందిన కంపెనీల మార్కెట్‌ కేపిటలైజేషన్‌ రూ.5,000 కోట్ల కంటే తక్కువగా ఉంటుంది. ఈ విభాగానికి చెందిన కంపెనీల షేర్లు కొనుగోలు చేసి లాభాలు ఆర్జించాలనుకునే మ్యూచువల్‌ ఫండ్‌ పథకాలను స్మాల్‌ క్యాప్‌ మ్యూచువల్‌ ఫండ్లుగా భావిస్తారు.  
స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు తమ అజమాయీషీలో ఉన్న నిధుల్లో 65 శాతాన్ని స్మాల్‌ క్యాప్‌ తరగతికి చెందిన కంపెనీల షేర్లు కొనుగోలు చేయటానికే కేటాయించాలి. మిగిలిన 35 శాతం సొమ్ముతో ఇతర విభాగాలకు చెందిన షేర్లు, రుణపత్రాలు కొనుగోలు చేయవచ్చు. సాధారణంగా కంపెనీలు చిన్నగా తమ ప్రస్థానాన్ని ప్రారంభించి క్రమేణా పెద్ద కంపెనీలు అవుతాయి.  ఇటువంటి కంపెనీలను గుర్తించి పెట్టుబడి పెట్టే అవకాశం స్మాల్‌ క్యాప్‌ ఫండ్లకు ఉంటుంది. అది కూడా ఫండ్‌ మేనేజర్‌ సత్తా మీద ఆధారపడి ఉంటుంది. అందుకే స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడి పెట్టటం ద్వారా అధిక లాభాలు కళ్లజూసే అవకాశం ఉంటుంది.

అదే సమయంలో ఈ తరహా పథకాల్లో రిస్కు కూడా అధికం. ఫండ్‌ మేనేజర్‌ అంచనాలు తప్పయినా, బేర్‌ మార్కెట్‌ వచ్చినా స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల విలువ వేగంగా కరిగిపోతుంది. మళ్లీ కోలుకోవటానికి అధిక సమయం పడుతుంది. 

స్మాల్‌ క్యాప్‌ పండ్లలో 2017- 18 లో మదుపరులకు అధిక లాభాలు లభించాయి. ఆ తర్వాత స్టాక్‌మార్కెట్లో దిద్దుబాటు (కరెక్షన్‌) ఫలితాలు ఈ ఫండ్లు పతనావస్థను చవిచూశాయి. కానీ గత మూడేళ్లుగా క్రమం తప్పకుండా ఈ ఫండ్లలో పెట్టుబడులు పెడుతూ వచ్చిన వారికి ఇటీవల కాలంలో అనూహ్యమైన లాభాలు గడించే అవకాశం వచ్చింది. 

ఈ నేపథ్యంలో ఎటువంటి మదుపరులకు స్మాల్‌ క్యాప్‌ ఫండ్లు అనువైనవనే ప్రశ్న తలెత్తుతుంది. ఈ కింది తరగతులకు చెందిన మదుపరులు స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడిని పరిశీలించవచ్చు...

* తమ పెట్టుబడిపై అధిక రిస్కును భరించగలిగిన మదుపరులు మాత్రమే స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల వైపు చూడాలి. అంతేగాకుండా తమ పెట్టుబడులను కనీసం 5 ఏళ్ల పాటు కొనసాగించగలిగి ఉండాలి. 

* ఇటువంటి పథకాల్లో ఒకేసారి పెట్టుబడి పెడితే ‘టైమింగ్‌ రిస్కు’ను ఎదుర్కొనాల్సి వస్తుంది. మార్కెట్‌ సూచీలు గరిష్ఠ స్థాయిల్లో ఉన్నప్పుడు స్మాల్‌ క్యాప్‌ పథకాల్లో పెట్టుబడి పెడితే..., ఆ తర్వాత మార్కెట్‌ దిద్దుబాటుకు లోనైతే, పెట్టిన పెట్టుబడి విలువ క్షీణిస్తుంది.

ఆ తర్వాత మళ్లీ పెట్టిన సొమ్ము వెనక్కి తీయటానికే ఎంతో కాలం ఎదురుచూడాల్సి వస్తుంది. దీనికి బదులు క్రమానుగత పెట్టుబడి విధానాన్ని (సిప్‌) అనుసరించి నెలసరి వాయిదాల పద్దతిలో పెట్టుబడులు పెడితే రిస్కు తగ్గిపోవటంతో పాటు, అధిక లాభాలు గడించటానికి వీలుంటుంది.

* అదే విధంగా పెట్టుబడి కోసం ఎంచుకున్న ఫండ్ల పనితీరును ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ ఉండాలి. పనితీరు సరిగా లేని ఫండ్ల నుంచి మెరుగైన పనితీరు కనబరుస్తున్న స్మాల్‌ క్యాప్‌ ఫండ్ల వైపు మొగ్గు చూపాల్సి ఉంటుంది.

* పెట్టుబడులన్నీ ఒకే బుట్టలో పెట్టరాదనేది సూక్తి. అందువల్ల లార్జ్‌ క్యాప్‌, మిడ్‌ క్యాప్‌ పథకాలతో పాటు కొంత మేరకు రుణ పథకాల్లో పెడుబడులు పెట్టటం శ్రేయస్కరం. అదే విధంగా తమ పెట్టుబడి మొత్తంలో 20 శాతం వరకూ స్మాల్‌ క్యాప్‌ పథకాలకు కేటాయించిన పక్షంలో లాభాలను పెంచుకునే (ప్రాఫిట్‌ మాగ్జిమైజేషన్‌) అవకాశం ఉంటుంది.

ఇది సరైన సమయమేనా?

అంతా బాగానే ఉంది. ఇప్పుడు స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు మొదలు పెట్టవచ్చా? అనే సందేహం ఎవరికైనా కలుగుతుంది. దీనికి సమాధానం చెప్పటం ఎంతో కష్టం. స్టాక్‌మార్కెట్‌ ఎప్పుడు పడుతుందో లేక ఎప్పుడు పెరుగుతుందో ఎవరూ చెప్పలేరు. అందువల్ల సిప్‌ పద్ధతిలో స్మాల్‌ క్యాప్‌ ఫండ్లలో పెట్టుబడులు ఎప్పుడైనా మొదలు పెట్టవచ్చు. తద్వారా ‘టైమింగ్‌ రిస్క్‌’ ను అధిగమించవచ్చు. ఒకేసారి పెట్టుబడి పెట్టే ఆలోచన ఉంటే, మార్కెట్‌ స్థితిగతులను, ఆర్థిక వ్యవస్థ తీరుతెన్నులు, ఎంచుకున్న స్మాల్‌ క్యాప్‌ పథకం పోర్ట్‌ఫోలియోను, దాని పనితీరును నిశితంగా పరిశీలించి... ఆ తర్వాతే నిర్ణయం తీసుకోవాలి.

- అజిత్‌ మేనన్‌, సీఈఓ, పీజీఐఎం ఇండియా మ్యూచువల్‌ ఫండ్‌

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని