Nirmala Sitharaman: ఆ పని రెగ్యులేటరీలు చూసుకుంటాయ్‌.. అదానీ షేర్ల పతనంపై నిర్మలమ్మ

అదానీ గ్రూప్‌(Adani Group) షేర్ల పతనంపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మరోమారు కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యవహారంలో నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేస్తాయని చెప్పారు. 

Updated : 04 Feb 2023 19:12 IST

దిల్లీ: అమెరికాకు సంస్థ హిండెన్‌ బర్గ్‌ ఇచ్చిన నివేదికతో అదానీ గ్రూప్‌(Adani Group) షేర్లు భారీగా పతనమయ్యాయి. ఈ పతనం స్టాక్‌ మార్కెట్లో సృష్టించిన ఆందోళన అంతా ఇంతా కాదు. దీనిపై మరోమారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్(Nirmala Sitharaman) స్పందించారు. నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేస్తాయని శనివారం వెల్లడించారు. 

‘నియంత్రణ సంస్థలు వాటి పని అవి చేసుకుపోతాయి. దీనిపై నిన్న రిజర్వ్‌ బ్యాంకు చెప్పిన మాటలు విన్నాం. దీనికంటే ముందు బ్యాంకులు, ఎల్‌ఐసీ స్పందించాయి. ప్రభుత్వంతో సంబంధం లేకుండా నియంత్రణ సంస్థలు స్వతంత్రంగా వ్యవహరిస్తాయి. మార్కెట్లను క్రమబద్ధీకరించేందుకు తగిన చర్యలు తీసుకుంటాయి. సెబీ ఆ పరిస్థితులను దగ్గరుండి పర్యవేక్షిస్తుంది’ అని మంత్రి వెల్లడించారు. అలాగే అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ రూ.20,000 కోట్ల మలి విడత పబ్లిక్‌ ఆఫర్‌ (Adani Enterprises FPO)ను ఉపసంహరించుకోవడంపై ఎదురైన ప్రశ్నలను మంత్రి తోసిపుచ్చారు. గతంలోనూ ఎఫ్‌పీఓలను ఉపసంహరించుకున్న ఉదంతాలు ఉన్నాయని పేర్కొన్నారు.

అదానీ షేర్ల పతనంపై సెబీ రియాక్షన్‌

అదానీ గ్రూప్‌ షేర్లు పతనంపై మార్కెట్‌ నియంత్రణ సెబీ స్పందించింది. మార్కెట్‌ సమగ్రతను కాపాడేందుకు, షేర్లలో అసాధారణ ఒడుదొడుకులకు గురైనప్పుడు తగిన చర్యలు తీసుకునే విషయంలో కట్టుబడి ఉన్నామని పేర్కొంది. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. గత వారం వ్యాపార దిగ్గజానికి చెందిన షేర్ల ధరల్లో అసాధారణంగా మార్పులను గమనించామని పేర్కొంది. అయితే, ఎక్కడా అదానీ గ్రూప్‌ పేరును ప్రస్తావించనప్పటికీ.. సెబీ ప్రకటన అదానీ గ్రూప్‌ గురించేనని అధికార వర్గాలు ధ్రువీకరించాయి.

ఇదీ చదవండి: మన మార్కెట్లకు ఢోకా లేదు

బాండ్ల ప్లాన్‌కూ అదానీ బ్రేక్‌!

బాండ్ల విక్రయాల ద్వారా దాదాపు వెయ్యి కోట్ల రూపాయల నిధులు సమీకరించాలన్న ప్రణాళికనూ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌(Adani Enterprises) నిలిపివేసిందని సమాచారం. జనవరిలో బాండ్లు జారీ ద్వారా ఈ మొత్తాన్ని సమీకరించాలని తొలుత నిర్ణయించుకున్న ఆ కంపెనీ.. తర్వాత ప్రణాళికను ఉపసంహరించుకుందని ఈ వ్యవహారంతో సంబంధం ఉన్న వ్యక్తులు వెల్లడించినట్లు బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది. ఇటీవల హిండెన్‌బర్గ్‌ రీసెర్చి వెలువరించిన నివేదికతో అదానీ గ్రూప్‌ షేర్లు, బాండ్లకు విలువ పడిపోయిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రూ.20 వేల కోట్ల విలువైన మలి విడత పబ్లిక్ ఆఫర్‌ను ఉపసంహరించుకున్న నేపథ్యంలో.. ఈ బాండ్ల విక్రయ ప్రణాళికనూ నిలిపివేసినట్లు తెలుస్తోంది. అదానీ గ్రూప్‌ షేర్ల విలువల క్షీణత వల్ల ఆ గ్రూప్‌ నిధుల సమీకరణ సామర్థ్యం దెబ్బతినొచ్చని మూడీస్‌ ఇన్వెస్టర్స్‌ సర్వీస్‌ ఇదివరకే హెచ్చరించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని