Nirmala Sitharaman: 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను వినియోగించుకోండి: సీతారామన్‌

Published : 22 Jun 2024 18:33 IST

దిల్లీ: రాష్ట్రాల ఆర్థికాభివృద్ధికి కేంద్రం మద్దతు ఎప్పుడూ ఉంటుందని కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ (Nirmala Sitharaman) తెలిపారు. ముందస్తు బడ్జెట్‌ సన్నాహక సమావేశాలు (Pre-Budget Meeting)ల్లో భాగంగా వివిధ రాష్ట్రాల, కేంద్ర పాలిత ప్రాంతాల ఆర్థిక మంత్రులతో దిల్లీలో ఆమె భేటీ అయ్యారు. 2024-25 బడ్జెట్‌ రూపకల్పనపై వారి సూచనలు, సలహాలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. సకాలంలో జీఎస్టీ బకాయిల చెల్లింపు, పన్నుల పంపిణీ ద్వారా రాష్ట్రాల అభివృద్ధికి తోడ్పాటునందిస్తామన్నారు.

వివిధ సంస్కరణలు చేపట్టేందుకు వీలుగా కేంద్రం అందజేస్తున్న 50 ఏళ్ల వడ్డీ రహిత రుణాలను అన్ని రాష్ట్రాలు వినియోగించుకోవాలని సీతారామన్ కోరారు. అయితే, ఈ పథకం ద్వారా అందిన మొత్తాన్ని పౌర కేంద్రీకృత ప్రాజెక్టుల కోసం వినియోగించాల్సి ఉంటుంది. అయా షరతులకు కట్టుబడి రాష్ట్రాలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవచ్చన్నారు. ‘స్పెషల్‌ అసిస్టెన్స్‌ టు స్టేట్స్‌ ఫర్‌ క్యాపిటల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌’ పేరిట కేంద్రం ఈ ప్రత్యేక పథకాన్ని తీసుకొచ్చింది. కొవిడ్‌ అనంతరం రాష్ట్రాలు తమ మూలధన వ్యయాలను పెంచాలన్న ఉద్దేశంతో 2020-21 సంవత్సరంలో ఈ పథకాన్ని తొలుత ప్రవేశపెట్టింది. దీని ద్వారా 50 ఏళ్లకు గానూ వడ్డీలేని రుణాలను రాష్ట్రాలకు అందిస్తారు. ఈ మొత్తాన్ని విద్య, వైద్యం, నీటి పారుదల, మంచినీటి సరఫరా, విద్యుత్‌, రహదారులు వంటి వాటి కోసం వినియోగించుకోవచ్చు. 

సమావేశంలో 2024-25 బడ్జెట్‌కు సంబంధించి పలువురు మంత్రులు తమ అభిప్రాయాలను కేంద్ర మంత్రితో పంచుకున్నారు. రాజస్థాన్‌లోని ఈస్ట్రన్‌ రాజస్థాన్‌ కెనాల్‌ ప్రాజెక్ట్‌ (ERCP), జల్‌ జీవన్‌ మిషన్‌, జాతీయ రాహదారులు, రైల్వే లైన్ల ఏర్పాటుకి రాబోయే బడ్జెట్‌లో నిధుల కేటాయింపును పెంచాలని ఆ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థికశాఖ మంత్రి దియా కుమారి కోరారు. ‘అప్పర్‌ భద్ర వాటర్‌ ప్రాజెక్ట్‌’ కోసం కేంద్రం ప్రకటించిన రూ.5,300 కోట్ల నిధులను విడుదల చేయాలని కర్ణాటక మంత్రి  క్రిష్ణ బైరి గౌడ్‌ విజ్ఞప్తి చేశారు. అంతేకాకుండా గృహ నిర్మాణాల కోసం కేంద్రం ఇస్తున్న వాటాను పట్టణ ప్రాంతాల్లో రూ.1.5 లక్షల నుంచి రూ.5 లక్షలకు, గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.2 లక్షల నుంచి రూ.3 లక్షలకు పెంచాలన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని