Investment Tips: ఆర్థిక నిర్ణయాల్లో తోడుగా ఆరు సూత్రాలు

కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడే ఆరు కీలక సూత్రాలను పరిశీలిద్దాం.....

Published : 28 May 2022 11:33 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఒక ఆర్థికపరమైన నిర్ణయం తీసుకోవడం అంత సులభమైన పని కాదు. అవి దీర్ఘకాలంలో ప్రభావం చూపుతాయి. పైగా కొన్ని నిర్ధిష్టమైన లక్ష్యాల కోసం భారీ ఎత్తున డబ్బు కేటాయించాల్సి ఉంటుంది. మరి అలాంటి కీలక ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడంలో ఉపయోగపడే ఆరు సూత్రాలను పరిశీలిద్దాం..

ముక్కలు ముక్కలుగా చేయండి..

ధనవంతుడిగా మారాలనుకుకోవడం ప్రతిఒక్కరి కల. కానీ, దాన్ని ఎలా సాధిస్తామనేదే అసలైన ప్రశ్న. ఇక్కడే ముక్కలు ముక్కలుగా చేయడం అనే వ్యూహం పనికొస్తుంది. మీ అంతిమ లక్ష్యాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించండి. ఉదాహరణకు మీరు స్టాక్స్‌లో మదుపు చేద్దామనుకుంటున్నారు. తొలి పెట్టుబడికే మీకు మొత్తం స్టాక్‌ మార్కెట్‌పై ప్రావీణ్యం ఉండాల్సిన అవసరం లేదు. ఆ రంగంలో ఓ చిన్న అంశాన్ని తీసుకొని దాన్ని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. బ్యాంకింగ్, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ ఇలా ఏదో ఒక రంగాన్ని ఎంచుకొని దానిపై పూర్తి అవగాహనను పెంచుకుంటే సరిపోతుంది. ఇలా ఒక్కో రంగాన్ని అధ్యయనం చేస్తూపోతే కాలక్రమంలో మొత్తం స్టాక్‌ మార్కెట్‌ కదలికలపై పట్టు సాధించొచ్చు.

భిన్నంగా ఆలోచించండి..

మీరు ప్రస్తుతం ఉన్న పరిస్థితిని భిన్న కోణంలో చూడగలగాలి. అప్పుడు మీ బుర్రకు ప్రత్యామ్నాయ పరిష్కార మార్గాలు తడతాయి. ఉదాహరణకు చాలా మంది స్టాక్‌ మార్కెట్‌లో డబ్బులు సంపాదించడం కష్టమని చెబుతుంటారు. మీరు భిన్నంగా ఆలోచించేవారే అయితే.. వీరంతా ఆ నిర్ణయానికి ఎందుకు వచ్చారో తెలుసుకోవాలనుకుంటారు. ఆ సమస్య ఏంటో మీరు గుర్తించగలిగితే.. పరిష్కారం మీ ముందే ఉంటుంది. కాబట్టి అందరి కంటే భిన్న కోణంలో ఆలోచిస్తే సమాధానాలు మన కళ్ల ముందుంటాయి.

నష్టానికీ సిద్ధం కావాలి..

ఆశావాదంతో ముందుకు సాగడం చాలా అవసరం. కానీ, రాబోయే ఉపద్రవాలను ముందే గుర్తించగలిగి సిద్ధంగా ఉండడం కూడా ముఖ్యమే. కాబట్టి మీరు ఏదైనా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకుంటే.. అది సఫలం కాకపోతే వచ్చే పరిణామాలను ముందే ఊహించాలి. దాన్ని ఎలా ఎదుర్కోవాలో సిద్ధం కావాలి. జరగబోయే నష్టాన్ని ఎలా పూడ్చుకోగలరో ప్రణాళికలు రచించండి. అప్పుడు మీరు పెద్దగా భయపడాల్సిన అవసరం ఉండదు. చాలా మంది ఇతరుల ప్రోద్బలంతో వెనకాముందు ఆలోచించకుండా అవగాహనలేని మార్గాల్లో పెట్టుబడి పెట్టి మోసపోతుంటారు. తీరా అసలు విషయం తెలిసి మానసికంగా కుంగి.. చివరకు ఆత్మహత్యలకు పాల్పడ్డ సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ముందుగానే మన నిర్ణయ పర్యవసానాలను గుర్తించి వాటికి సిద్ధంగా ఉండాలి.

తప్పులను రాసిపెట్టుకోండి..

మనమంతా తప్పులు చేస్తాం. కానీ, వాటి నుంచి పాఠం నేర్చుకున్నవారే విజయవంతమవుతారు. నిజానికి మనలో చాలా మంది చేసిన తప్పుల్ని మర్చిపోయి.. వాటినే రిపీట్‌ చేస్తుంటారు. అలా జరక్కుండా ఉండాలంటే.. మీ తప్పును మీరు గుర్తించిన వెంటనే ఒక దగ్గర రాసిపెట్టుకోవాలి. వాటిని అప్పుడప్పుడు చదువుతూ ఉండాలి. ఏదైనా కీలక నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడూ వాటిని ఓసారి తిరగేయాలి. అప్పుడు అది మీ మైండ్‌లో ఫిక్సయి తిరిగి ఆ తప్పుని రిపీట్‌ చేయకపోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకు మీరు ఓ స్టాక్‌ని కొన్నారనుకుందాం. కానీ, అది కాస్త నష్టాల్లోకి జారుకోగానే భయపడి స్వల్ప నష్టాలతో బయటకొచ్చారు. తీరాచూస్తే వారం రోజుల్లో అది 20 శాతానికి పైగా పెరిగింది. ఇక్కడ మీరు భయపడి వెంటనే అమ్మడం తప్పని గుర్తించాలి. దాన్ని మరోసారి చేయకుండా జాగ్రత్తపడాలి.

మీ ఆలోచనలకు లెక్కలు జోడించాలి..

ఒక ఆర్థికపరమైన నిర్ణయం తీసుకునేటప్పుడు లెక్క పక్కాగా ఉండాలి. ఇంకా చెప్పాలంటే ఓ గణాంక శాస్త్రజ్ఞుడిగా ఆలోచించాలి. అప్పుడే మీరు ప్రాక్టికల్‌గా ఆలోచించగలిగి సరైన నిర్ణయం తీసుకోగలుగుతారు. ఉదాహరణకు స్టాక్ మార్కెట్‌లో కొన్ని మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ ఏడాదిలో 300%, 500% రాబడినిచ్చిందని చదువుతుంటారు. వెంటనే స్టాక్‌ మార్కెట్‌లో మదుపు చేస్తే భారీ లాభాలొస్తాయన్న అంచనాకు వచ్చేస్తారు. కానీ, నిజానికి అలాంటి మల్టీబ్యాగర్‌ స్టాక్స్‌ చాలా చాలా తక్కువని మీరు గుర్తించాలి. వేల కంపెనీలు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయి ఉండగా.. కేవలం రెండు లేదా మూడు కంపెనీలు మాత్రమే అలాంటి రిటర్న్స్‌నిచ్చాయన్న విషయాన్ని మీరు గుర్తించగలగాలి. మరోవైపు మీరు ఏదైనా పెన్నీ స్టాక్‌ని మల్టీబ్యాగర్‌ అవుతుందని ఊహించి ఇన్వెస్ట్‌ చేస్తే పరిస్థితులు తలకిందులు కావొచ్చు. మల్టీబ్యాగర్‌ అయ్యే అవకాశం ఉందని ఏటా దాదాపు 1000 స్టాక్స్‌ వరకు నిపుణులు సూచిస్తుంటారు. కానీ, వాటిలో ఏ పదో, పన్నెండో నిజంగా మంచి లాభాలిస్తాయి. ఈ విషయాన్ని గమనించగలిగితే.. వందల రెట్ల రాబడిని ఆర్జించడం అన్ని సందర్భాల్లో సాధ్యం కాదని తెలుసుకోవచ్చు. దానికి అనుగుణంగా మీ నిర్ణయాలు ఉంటాయి.

ఇలా ఎందుకు జరిగింది?.. విశ్లేషించాలి

‘ఇలా ఎందుకు జరిగిందంటే..’ అనే వ్యూహాన్ని ప్రపంచ ప్రఖ్యాత మదుపరి చార్లెస్‌ ముంగర్‌ సూచించారు. మనం మదుపు చేసిన స్టాక్స్‌లో ఏదైనా 10 శాతం కుంగితే.. దానికి గురించి పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అసలు అలా ఎందుకు జరిగిందో ఆరా తీయాలి. భౌగోళిక రాజకీయ, అధిక విలువ, ఊహాగానాలు.. ఇలా కరాణాలు చాలా ఉండొచ్చు. అలా మూలకారణాన్ని గుర్తించగలిగితే.. మీ పెట్టుబడిని కొనసాగించాలా? లేదా ఉపసంహరించుకోవాలా? తెలిసిపోతుంది.

మీ సాధారణ ఆలోచన పరిధిని దాటి కొంత వినూత్న ఆర్థిక నిర్ణయాలు తీసుకోవడానికి పైన తెలిపిన టిప్స్‌ కచ్చితంగా ఉపయోగపడతాయి. పైగా ఆర్థిక విషయాల్లోనే కాదు.. వృత్తిపరమైన, వ్యక్తిగత లక్ష్యాల సాధనలోనూ ఇవి ఉపయోగకరంగా ఉంటాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని