Fixed Deposit: పెద్ద ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ కంటే చిన్న చిన్న ఎఫ్‌డీలే మేలు! ఎలాగంటే?

Fixed Deposit: చాలా మంది తమ దగ్గర ఉన్న మొత్తాన్ని ఒకే ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ చేస్తుంటారు. కానీ, అలా కాకుండా దాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి పలు ఎఫ్‌డీలు చేస్తే ప్రయోజాలు ఎక్కువని నిపుణులు సూచిస్తున్నారు.

Published : 09 Jun 2023 13:25 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఇన్వెస్ట్‌మెంట్‌ అనగానే భారతీయులకు మొదట ఫిక్స్‌డ్‌ డిపాజిటే (Fixed Deposit) గుర్తొస్తుంది. భద్రత, కచ్చితమైన రాబడే అందుకు కారణం. అయితే, చాలా మంది ఒకే బ్యాంకులో పెద్ద మొత్తంలో ఎఫ్‌డీ (Fixed Deposit) చేస్తే ఎలాంటి సమస్యా ఉండదనుకుంటారు. కానీ, అది అంత ప్రయోజనకరమైన మార్గం కాదని ఆర్థిక నిపుణులు సూచిస్తుంటారు. పెద్ద మొత్తాన్ని చిన్న చిన్న భాగాలుగా విభజించి.. పలు బ్యాంకుల్లో డిపాజిట్‌ చేస్తే ప్రయోజనాలు ఎక్కువని చెబుతుంటారు. ఎందుకో చూద్దాం..!

డైవర్సిఫికేషన్‌..

ఉదాహరణకు మీ దగ్గర రూ.25 లక్షలు ఉన్నాయనుకుందాం. దాన్ని ఒకే బ్యాంకులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌ (Fixed Deposit) చేయడం కంటే.. దాన్ని రూ.5 లక్షల కింద ఐదు భాగాలు చేసి ఐదు బ్యాంకుల్లో ఎఫ్‌డీ (Fixed Deposit) చేస్తే మేలని నిపుణుల సూచన. ఫలితంగా ఏదైనా బ్యాంకు ఆర్థిక ఇబ్బందుల్లో చిక్కుకున్నా.. మిగిలిన మొత్తం భద్రంగా ఉంటుంది. అదే ఒకే బ్యాంకులో రూ.25 లక్షలు డిపాజిట్ చేస్తే.. తీరా ఆ బ్యాంకు దివాలా తీస్తే ఇబ్బందులు ఎదుర్కోక తప్పదు. పీఎంసీ బ్యాంక్‌, యెస్‌ బ్యాంక్‌, కపోల్‌ బ్యాంకు విషయంలో డిపాజిటర్లు చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వచ్చింది. కపోల్‌ కార్యకలాపాలపై ఇప్పటికీ మారటోరియం కొనసాగుతోంది. మరోవైపు డిపాజిట్‌ ఇన్సూరెన్స్‌ కింద ఒక్కో బ్యాంకులో రూ.5 లక్షల వరకు డిపాజిట్లపై బీమా సదుపాయం ఉంటుంది. దీని ప్రయోజనం పొందాలంటే చిన్న చిన్న మొత్తాలను ఎఫ్‌డీ చేయాలని నిపుణులు సూచిస్తున్నారు.

రీఇన్వెస్ట్‌మెంట్ రిస్క్‌..

ఒకవేళ ఒకే బ్యాంకులో రూ.25 లక్షలు ఇన్వెస్ట్‌ చేశారనుకుందాం. దాని గడువు ముగిసే సరికి వివిధ కారణాల వల్ల డిపాజిట్ రేట్లు దిగొచ్చాయనుకుందాం. అలాంటప్పుడు తిరిగి ఇన్వెస్ట్‌ చేయాలంటే ఆ తక్కువ రేటు వద్దే చేయాల్సి ఉంటుంది. కొంత కాలానికి మళ్లీ వడ్డీరేట్లు పెరిగితే ఆ ప్రయోజనాన్ని మిస్‌ అవుతాం. అలా కాకుండా.. పెద్ద మొత్తాన్ని కొన్ని భాగాలుగా విభజించి వివిధ కాలపరిమితులలో ఇన్వెస్ట్‌ చేయాలి. అలాంటప్పుడు ఒక ఎఫ్‌డీ (Fixed Deposit) కాలపరిమితి ముగిసినప్పుడు తక్కువ వడ్డీరేటు ఉన్నా.. మిగిలినవి మెచ్యూర్‌ అయ్యే సమయానికి పెరిగే అవకాశం ఉంటుంది. తిరిగి ఇన్వెస్ట్ చేసినప్పుడు పెరిగిన వడ్డీరేట్ల ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవచ్చు.

అత్యవసర సమయాల్లో..

అత్యవసర పరిస్థితుల్లో ఒక్కోసారి ఎఫ్‌డీ (Fixed Deposit)ని బ్రేక్‌ చేయాల్సి వస్తుంటుంది. అలాంటప్పుడు పెద్ద మొత్తంలో చేసిన డిపాజిట్‌ను ఉపసంహరించుకుంటే.. పెనాల్టీ ఎక్కువే ఉంటుంది. పైగా మన అవసరం తీరిన తర్వాత మిగిలిన మొత్తాన్ని ఆ సమయంలో తక్కువ డిపాజిట్‌ రేట్లు నడుస్తుంటే.. ఆ రేటు వద్దే ఎఫ్‌డీ చేయాల్సి ఉంటుంది. 

ఉదాహరణకు మీకు రూ.2 లక్షలు అవసరమనుకుందాం. ఒకవేళ రూ.25 లక్షల ఎఫ్‌డీ (Fixed Deposit)ని బ్రేక్‌ చేస్తే పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. పైగా మిగిలిన రూ.23 లక్షలను అప్పుడు ఎంత డిపాజిట్‌ రేట్‌ ఉంటే.. ఆ రేటు వద్దే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అదే ఒకవేళ రూ.5 లక్షల డిపాజిట్లు ఐదు ఉంటే.. దాంట్లో ఏదో ఒకదాన్ని బ్రేక్‌ చేయాల్సి వచ్చినా.. పెద్దగా నష్టం ఉండదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని