National stock exchange: రిటైల్‌ మదుపర్లూ.. డబ్బులు పోతాయ్‌ జాగ్రత్త

చిన్న మదుపర్లు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ, ఎండీ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ హెచ్చరించారు. అందుకు బదులు మ్యూచువల్‌ ఫండ్‌ల ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మేలని సూచించారు.

Updated : 15 Jun 2024 04:56 IST

ఎఫ్‌ అండ్‌ ఓ ట్రేడింగ్‌ వద్దు
ఫండ్ల ద్వారా ఈక్విటీస్‌లో పెట్టుబడులు పెట్టండి
ఎన్‌ఎస్‌ఈ అధిపతి ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌

దిల్లీ: చిన్న మదుపర్లు డెరివేటివ్స్‌ ట్రేడింగ్‌కు దూరంగా ఉండాలని నేషనల్‌ స్టాక్‌ ఎక్స్ఛేంజీ(ఎన్‌ఎస్‌ఈ) సీఈఓ, ఎండీ ఆశిష్‌ కుమార్‌ చౌహాన్‌ హెచ్చరించారు. అందుకు బదులు మ్యూచువల్‌ ఫండ్‌ల ద్వారా ఈక్విటీల్లో పెట్టుబడులు పెట్టడం మేలని సూచించారు. నష్టభయాన్ని తట్టుకునే, మార్కెట్‌పై పూర్తి అవగాహన ఉండే కొద్ది మంది మదుపర్లు మాత్రమే ఫ్యూచర్స్‌ అండ్‌ ఆప్షన్స్‌(ఎఫ్‌ అండ్‌ ఓ) ట్రేడింగ్‌కు పరిమితం అయితే మంచిదని శుక్రవారమిక్కడ జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన అన్నారు. ఎఫ్‌ అండ్‌ ఓను అర్థం చేసుకోలేని వారు లేదా నష్టభయాన్ని భరించలేని వారు వీటికి దూరంగా ఉండడం శ్రేయస్కరమని తెలిపారు. ఇటీవలే ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, ముఖ్య ఆర్థిక సలహాదారు వి. అనంత నాగేశ్వరన్‌లు కూడా ఎఫ్‌ అండ్‌ ఓల విషయంలో రిటైల్‌ మదుపర్లను హెచ్చరించారు.  

ఎందుకింత ఆసక్తి: డెరివేటివ్స్‌లో నష్టభయం ఉందని తెలిసినా.. అందులో వచ్చే అదాటు లాభాలపై మదుపర్లు ఆశపడుతుండడంతో ట్రేడింగ్‌ పరిమాణాలు భారీగా పెరుగుతున్నాయి. మార్చి 2019లో ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో రూ.217 లక్షల కోట్ల టర్నోవరు నమోదు కాగా.. 2024 కల్లా ఇది రూ.8,740 లక్షల కోట్లకు చేరడమే ఇందుకు ఉదాహరణ. అదే సమయంలో ఈక్విటీ నగదు విభాగంలో సగటు రోజువారీ టర్నోవరు రూ.1 లక్ష కోట్లుగా ఉండగా.. ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో మాత్రం రూ.330 లక్షల కోట్ల టర్నోవరు నమోదు కావడం గమనార్హం. 

89 శాతం మంది నష్టాల్లోనే: ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో ట్రేడింగ్‌ చేసే వ్యక్తిగత ట్రేడర్లలో 89 శాతం మంది నష్టాలను చవిచూశారని సెబీ నిర్వహించిన ఒక సర్వేలో తేలింది. 2021-22లో సగటున రూ.1.1 లక్షలను వీరు కోల్పోయారు. కరోనా సమయంలో ఎఫ్‌ అండ్‌ ఓ విభాగంలో ట్రేడింగ్‌ చేసే మదుపర్ల సంఖ్య అసాధారణంగా పెరిగింది. 2018-19లో ఈ విభాగంలో ట్రేడింగ్‌ చేసే వారి సంఖ్య 7.1 లక్షలుగా ఉండగా.. 2020-21 నాటికి 45.24 లక్షలకు చేరింది. మరో వైపు, డెరివేటివ్‌ విభాగంలోకి రాబోయే షేర్లకు సెబీ కఠిన నిబంధనలను ఈ నెల మొదట్లో ప్రతిపాదించింది. దీని కింద తక్కువ టర్నోవరు ఉన్న షేర్లను ఎఫ్‌ అండ్‌ ఓకు దూరంగా ఉంచుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని