నోట్ల మార్పిడి Day 1: క్యూలు తక్కువే.. గందరగోళమే ఎక్కువ..!

Rs 2000 note exchange Day1: దేశవ్యాప్తంగా రూ.2వేల నోట్ల మార్పిడి ప్రక్రియ ప్రారంభమైంది. తొలిరోజు క్యూ లైన్లు లేనప్పటికీ.. గందరగోళ పరిస్థితులు మాత్రం కనిపించాయి.

Published : 24 May 2023 02:02 IST

దిల్లీ: దేశవ్యాప్తంగా రూ.2 వేల నోట్ల మార్పిడి ప్రక్రియ మొదలైంది. ఆర్‌బీఐ నోట్ల ఉపసంహరణ నిర్ణయంతో తొలి రోజైన మంగళవారం తమ వద్ద ఉన్న నోట్లను మార్చుకునేందుకు ప్రజలు ముందుకొచ్చారు. వాస్తవంగా సెప్టెంబర్‌ 30 వరకు గడువు ఉన్నప్పటికీ.. పలువురు తొలి రోజే బ్యాంకుల వద్ద కనిపించారు. అయితే, 2016 నోట్ల రద్దు నాటి స్థాయిలో క్యూలైన్లు లేకపోయినా బ్యాంకుల మధ్య నిబంధనల విషయంలో వ్యత్యాసం ఉండడం గందరగోళానికి దారితీసింది.

చలామణిలో ఉన్న రూ.2వేల నోట్లను వెనక్కి తీసుకుంటున్నట్లు ఆర్‌బీఐ శుక్రవారం ప్రకటించింది. మంగళవారం నుంచి నోట్ల మార్పిడికి అవకాశం ఇస్తున్నట్లు వెల్లడించింది. అయితే, నోట్ల మార్పిడికి గుర్తింపు కార్డు, డిపాజిట్‌ ఫారం నింపడం తప్పనిసరి కాదని ఆర్‌బీఐ పేర్కొంది. ఇక్కడే గందరగోళం నెలకొంది. ఆర్‌బీఐ గుర్తింపు కార్డు తప్పనిసరి కాదని పేర్కొన్నప్పటికీ.. కొన్ని బ్యాంకులు ఐడీ కార్డును తప్పనిసరి అని పేర్కొన్నాయి. ఇంకొన్ని కొన్ని గుర్తింపు కార్డు అడగకపోయినా రిజిస్టర్‌లో ఖాతాదారుని పేరు, మొబైల్‌ నంబర్‌ నమోదు చేయాలని సూచించాయి. కొన్ని ప్రాంతాల్లో ఆధార్‌ లేదా పాన్‌ వివరాలు సమర్పించాలని బ్యాంకులు తమను కోరాయని కస్టమర్లు పేర్కొన్నారు. కొన్ని బ్యాంకులు నోట్ల మార్పిడికి కాకుండా కేవలం డిపాజిట్‌కు మాత్రమే అనుమతిచ్చాయని వెల్లడించారు.

గందరగోళానికి కారణమిదే..

ఆర్‌బీఐ నిర్ణయం ప్రకటించిన వెంటనే ప్రభుత్వరంగానికి చెందిన అతిపెద్ద బ్యాంక్‌ SBI అన్ని బ్రాంచ్‌లకు మెమో జారీ చేసింది. నోట్ల మార్పిడికి స్లిప్‌ గానీ, ఫారం నింపాల్సిన అవసరం లేదని పేర్కొంది. కోటక్‌ మహీంద్రా, హెచ్‌ఎస్‌బీసీ మాత్రం ఇతర బ్యాంకు ఖాతాదారులకు ఫారం/గుర్తింపు కార్డును తప్పనిసరి చేశాయి. యాక్సిస్‌ బ్యాంక్‌, స్టాండర్డ్‌ ఛార్టర్డ్‌, యెస్‌ బ్యాంక్‌, కెనరా బ్యాంక్‌, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా మాత్రం ఐడీ ప్రూఫ్‌, ఫారంను తప్పనిసరి చేయలేదు. వేరే బ్యాంకు ఖాతాదారులు ఫారం నింపాల్సిన అవసరం లేనప్పటికీ.. గుర్తింపు కార్డును మాత్రం బ్యాంక్‌ ఆఫ్‌ బరోడా తప్పనిసరి చేసింది. ఇక ప్రైవేటు రంగానికి చెందిన అతిపెద్ద బ్యాంకులైన ఐసీఐసీఐ, హెచ్‌డీఎప్‌సీ మాత్రం కస్టమర్లందరూ ఫారం నింపాలని సూచించాయి. వేరే బ్యాంక్‌ ఖాతాదారులు మాత్రం ఐడీ ప్రూఫ్‌ కూడా సమర్పించాలని సూచించాయి. ఇలా ఒక్కో బ్యాంక్‌ ఒక్కో రకమైన నిబంధనలు పెట్టడంతో కొంత గందరగోళం నెలకొనడం కనిపించింది.

చిన్న చిన్న క్యూలైన్లే..

2016లో నోట్ల రద్దు సమయంలో బ్యాంకుల వద్ద పెద్ద పెద్ద క్యూలైన్లు దర్శనమిచ్చాయి. అయితే, ఇప్పుడా పరిస్థితి ఎక్కడా కనిపించలేదు. అప్పట్లో రూ.500, రూ.1000 నోట్లను పూర్తిగా రద్దు చేశారు. మార్చుకోవడానికి 50 రోజులు మాత్రమే గడువు ఇచ్చారు. ఇప్పుడు పరిస్థితి అందుకు భిన్నం. నోట్లు చెల్లుబాటు అవుతూనే, వాటిని మార్చుకోవడానికి 131 రోజులు గడువు ఇచ్చారు. చలామణిలో ఉన్న నగదు సైతం 10 శాతమే కావడంతో మునుపటి పరిస్థితి బ్యాంకుల వద్ద కనిపించలేదు. దీనికితోడు ఇంకా నాలుగు నెలల గడువు ఉండడం కూడా క్యూలైన్లు లేకపోవడానికి కారణమని పలువురు బ్యాంక్‌ అధికారులు తెలిపారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని