PPF-SSY: నెలాఖరులో గుడ్‌న్యూస్‌.. చిన్న మొత్తాలపై వడ్డీ రేట్లు పెంపు..?

Small savings schemes: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై త్వరలో వడ్డీ రేట్లు పెరిగే అవకాశం కనిపిస్తోంది. నెలాఖరులో దీనికి సంబంధించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.

Published : 25 Mar 2023 14:06 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (Small savings schemes) కేంద్ర ప్రభుత్వం మరోసారి వడ్డీ రేట్లు పెంచే అవకాశం కనిపిస్తోంది. ఏప్రిల్‌-జూన్‌ త్రైమాసికానికి (April- June) గానూ కేంద్రం మార్చి నెలాఖరులో కొత్త వడ్డీ రేట్లను సవరించనుంది. జనవరి- మార్చి త్రైమాసికానికి గానూ గతంలో కొన్ని చిన్న మొత్తాల పథకాలపై వడ్డీ రేట్లు పెంచినప్పటికీ.. పీపీఎఫ్‌ (PPF), సుకన్య సమృద్ధి యోజన (SSY) పథకాల జోలికి పోలేదు. దీంతో ఈసారి వడ్డీ రేట్లు (Interest rates) పెంచే అవకాశం కనిపిస్తోంది.

చిన్న మొత్తాల పొదుపు పథకాలపై (Small savings schemes) ప్రతి మూడు నెలలకోసారి ప్రభుత్వం వడ్డీ రేట్లను సవరిస్తుంటుంది. సెకండరీ మార్కెట్‌లో ప్రభుత్వ సెక్యూరిటీలపై వచ్చే రాబడి ఆధారంగా ఈ రేట్లను మారుస్తుంటుంది. చిన్న మొత్తాల పొదుపు పథకాల వడ్డీ రేట్లను సవరించాల్సిన ప్రతిసారీ చివరి మూడు నెలలకు సంబంధించి ప్రభుత్వ సెక్యూరిటీల రాబడులను చూస్తుంది. దీని ఆధారంగా వడ్డీ రేట్లను నిర్ణయిస్తుంది.

2011లో శ్యామలా గోపీనాథ్‌ కమిటీ సిఫార్సులకు అనుగుణంగా కేంద్ర ఆర్థిక శాఖ 2016లో ఒక ఫార్ములాను నోటిఫై చేసింది. దీని ప్రకారం.. బాండ్లపై వచ్చే రాబడికి 25 బేసిస్‌ పాయింట్లను పీపీఎఫ్‌కు వడ్డీగా చెల్లించాలి. అదే సుకన్య సమృద్ధి యోజనకైతే 75 బేసిస్‌ పాయింట్లు కలుపుతారు. సీనియర్‌ సిటిజన్‌ స్కీమ్‌కు గరిష్ఠంగా 100 బేసిస్‌ పాయింట్లు అదనంగా చెల్లించాలి. డిసెంబర్‌-ఫిబ్రవరి త్రైమాసికంలో బెంచ్‌మార్క్‌ అయిన 10 ఏళ్ల బాండ్లపై 7.37 వడ్డీ రాబడి వస్తోంది.

పీపీఎఫ్‌పై ప్రస్తుతం 7.1 శాతం వడ్డీ రేటు ఇస్తున్నారు. ఫార్ములా ప్రకారం ఈ మొత్తం 7.6 శాతానికి పెరగాలి. అదే సుకన్య సమృద్ధి యోజనలో అయితే ప్రస్తుతం 7.6 శాతంగా ఉన్న వడ్డీ రేటు 8.1 శాతానికి చేరే అవకాశం ఉంటుంది. అయితే, జనవరి-మార్చి త్రైమాసికంలో కొన్ని పథకాలపై 20-110 బేసిస్‌ పాయింట్లను కేంద్రం పెంచింది. పీపీఎఫ్‌, సుకన్య సమృద్ధి యోజన పథకాలపై వడ్డీ రేట్లు మార్చలేదు. ఈసారైనా పెంచుతారో లేదో చూడాలంటే నెలాఖరు వరకు వేచి చూడాల్సిందే. ప్రస్తుతం బ్యాంకు ఫిక్స్‌డ్‌ డిపాజిట్లలో సైతం దాదాపు ఇదే స్థాయి రాబడి వస్తోంది.

ప్రస్తుత వడ్డీ రేట్లు ఇలా..


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని