Updated : 05 Jan 2022 14:49 IST

Prepaid Cards: ఈ స్మార్ట్‌ కార్డుల‌తో స్మార్ట్‌గా పిల్ల‌లకు పాకెట్ మ‌నీ ఇవ్వండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: పిల్ల‌లు ఆర్థిక పాఠాల‌ను అనుభ‌వ పూర్వ‌కంగా నేర్చుకోవాల‌ని మీరు కోరుకుంటున్నారా? అయితే వారికి ఇలాంటి ఒక స్మార్ట్ కార్డ్ నూత‌న సంవ‌త్స‌ర కానుక‌గా ఇవ్వండి. సాధార‌ణంగా త‌ల్లిదండ్రులు.. పిల్ల‌ల‌కు ప్ర‌తి నెలా కొంత పాకెట్ మ‌నీ ఇస్తుంటారు. ఆ డ‌బ్బును వారి అవ‌స‌రాల‌కు వినియోగించుకోవాలని చెబుతుంటారు. ఇలా వారికి డ‌బ్బు ఖ‌ర్చు చేయ‌డం, పొదుపు చేయడం, నెల చివ‌ర‌కు ఎంత ఖ‌ర్చ‌వుతుంది? ఎంత మిగులుతుంది? ఇలాంటి లెక్క‌లు నేర్చుకుంటారనేది మీ ఆలోచ‌న‌. అయితే, ప్ర‌తిసారీ వాటిని ప‌ర్య‌వేక్షించ‌డం మీకు సాధ్యం కాక‌పోవ‌చ్చు. ఇలాంట‌ప్పుడే పిల్ల‌లు త‌ప్పుదారి ప‌ట్టే అవ‌కాశం ఉంది. పిల్ల‌లు త‌ల్లిదండ్రుల ప‌ర్య‌వేక్ష‌ణ‌లో ఉంటూనే వారి సొంతంగా, అనుభ‌వ పూర్వ‌కంగా డ‌బ్బు విష‌యాల‌ను నేర్చుకునేందుకు ఒక మంచి మార్గం స్మార్ట్ ప్రీపెయిడ్ కార్డ్‌. కొన్ని ఫిన్‌టెక్ సంస్థ‌లు బ్యాంకుల భాగ‌స్వామ్యంతో ఈ కార్డుల‌ను అందిస్తున్నాయి. ఈ కార్డుల ద్వారా పిల్ల‌లు ఆచ‌ర‌ణాత్మ‌కంగా డ‌బ్బు ఖ‌ర్చు చేసే విధానం, ఆదా చేసే విధానం, ఎక్కువ ఖ‌ర్చు కాకుండా ఆదా చేయ‌డం వంటి వాటిలో నూత‌న విధానాల‌ను నేర్చుకుంటారు.

ఈ స్మార్ట్‌కార్డులు ప్ర‌త్యేకించి 18 ఏళ్లలోపు పిల్లల కోసం రూపొందించారు. పాకెట్ మనీ సూత్రంపై ఇవి పనిచేస్తాయి. పిల్ల‌లు ఆదా చేసిన మొత్తంపై వ‌డ్డీ వ‌స్తుంది. ఈ స్మార్ట్ కార్డులో పేరెంటింగ్ కంట్రోల్ ఉంటుంది. అంటే పిల్లలు కార్డ్‌ను స్వైప్ చేసిన ప్రతిసారీ తల్లిదండ్రులకు మెసేజ్‌ అందుతుంది. ఏటీఎం విత్‌డ్రాల‌పై, ఖ‌ర్చుల‌పై ప‌రిమితులు విధించొచ్చు. కార్డు సంబంధింత యాప్ ద్వారా తల్లిదండ్రులు కార్డును యాక్టివేట్ లేదా డీయాక్టివేట్ చేయొచ్చు. త‌ల్లిదండ్రులు క‌నీస కేవైసీ పూర్తి చేసి నెల‌కు రూ.10వేలు, పూర్తి కేవైసీతో నెల‌కు రూ.2 ల‌క్ష‌ల వ‌ర‌కు కార్డులో లోడ్ చేయొచ్చు.

ఫామ్‌కార్డ్: ఇది కో-బ్రాండెడ్ ప్రీపెయిడ్ కార్డ్‌. పిల్ల‌ల కోసం ఐడీఎఫ్‌సీ ఫ‌స్ట్ బ్యాంక్ భాగ‌స్వామ్యంతో ఈ కార్డును జారీ చేస్తోంది. ఫామ్‌ యాప్ ద్వారా కార్డుకోసం ద‌ర‌ఖాస్తు, యాక్టివేష‌న్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్ గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ కార్డులో రెండు వేరియంట్లు అందుబాటులో ఉన్నాయి. మొద‌టిది 'ఫామ్‌కార్డ్ మి'. దీనికోసం రూ.299 ఫీజు చెల్లించాలి. రెండోది ఫామ్ కార్డ్.. దీని కోసం రూ.99 వన్‌-టైమ్ ఫీజు చెల్లించాలి. అద‌న‌పు ఫీజులు, ఛార్జీలు ఉండ‌వు. ఖాతాలో కనీస బ్యాలెన్స్ నిర్వహించాల్సిన అవసరం లేదు. పిల్ల‌లు చేసే ప్ర‌తి పేమెంట్‌పై రివార్డు పాయింట్లు ఇస్తుంది. ఈ రివార్డు పాయింట్ల‌తో డిస్కౌంట్లు, క్యాష్‌బ్యాక్‌లు వంటివి పొందొచ్చు.

స్లోన్ కిట్ ప్రీపెయిడ్ కార్డు: స్లోన్‌కిట్ మ‌నీ మేనేజ్‌మెంట్ యాప్ గూగుల్, యాపిల్ యాప్ స్టోర్ల‌లో అందుబాటులో ఉంటుంది. ఈ యాప్ డౌన్‌లోడ్‌ చేసుకుని, కేవైసీ ప్ర‌క్రియ‌ను పూర్తి చేయాలి. ఏడు రోజుల్లోగా రీలోడబుల్ ప్రీపెయిడ్ కార్డు (మీ పిల్ల‌ల పేరు ఆ కార్డుపై ఉంటుంది) అందుతుంది. డీసీబీ బ్యాంకుతో అనుసంధానం అయి ఈ యాప్ ప్రీపెయిడ్ కార్డుల‌ను జారీచేస్తుంది. సంవ‌త్స‌రానికి ప‌రిమితి రూ.12 ల‌క్ష‌ల‌కు దాట‌కుండా దీంట్లో ఒకసారి రూ.1 ల‌క్ష మొత్తం వరకు లోడ్ చేసుకోవ‌చ్చు. ఈ యాప్‌తో న‌లుగురు పిల్ల‌లకు సంబంధించిన కార్డుల‌ను త‌ల్లిదండ్రులు మేనేజ్ చేయొచ్చు. దీనికి ప్ర‌త్యేకంగా రిజిస్ట్రేష‌న్ ఛార్జీలు ఉండ‌వు గానీ వార్షిక రుసుము రూ.100 ఉంటుంది. ఈ యాప్ విద్యార్థుల‌కు అవ‌స‌రం ఉండే వివిధ ర‌కాల మ‌ర్చెంట్ల‌తో అనుసంధానమై ఉంది.

ఎఫ్‌వైపీ (Fyp) కార్డ్‌: ఎఫ్‌వైపీ ఫిన్‌టెక్ స్టార్ట‌ప్ యస్ బ్యాంక్‌, వీసాల‌తో క‌లిసి పిల్ల‌ల కోసం ఈ ప్రీపెయిడ్ కార్డును అందిస్తోంది. జీరో బ్యాలెన్స్‌తో ఖాతాను నిర్వ‌హించొచ్చు. అలాగే ఖాతాను తెరిచేందుకు ఎలాంటి ఫీజులూ చెల్లించ‌న‌వ‌స‌రం లేదు. పిల్ల‌లు చేసే ప్ర‌తి విజ‌య‌వంత‌మైన లావాదేవీకి రివార్డు పాయింట్లు, క్యాష్‌బ్యాక్‌లు వ‌స్తాయి. ఈ యాప్‌లో అందించే స‌మాచారం, వీడియోలు, క్విజ్‌ల ద్వారా ఆర్థిక స్కిల్స్‌ను పిల్ల‌లు నేర్చుకోవ‌చ్చు. ఎఫ్‌వైపీ యాప్‌తో కార్డు అనుసంధాన‌మై ఉంటుంది. ఈ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి పొందొచ్చు.

జూనియో కార్డ్‌: ఈ స్మార్ట్‌కార్డ్‌ను ఆర్‌బీఎల్ బ్యాంక్  భాగస్వామ్యంతో జూనియో జారీ చేస్తుంది. ఈ స్మార్ట్‌కార్డ్‌ ద్వారా పిల్లలు ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్ ద్వారా కొనుగోళ్లు చేయొచ్చు. కేవైసీ ప్రక్రియ పూర్తి చేసిన త‌క్ష‌ణ‌మే వర్చువల్‌గా కార్డును జారీ చేస్తారు. ఇది ఉచితంగా ల‌భిస్తుంది. ఫిజికల్ కార్డ్ పొందేందుకు రూ. 99 చెల్లించాల్సి ఉంటుంది. యూపీఐ ద్వారా కార్డులో డబ్బు లోడ్ చేయొచ్చు. యూపీఐ ద్వారా కార్డుకు లోడ్ చేసిన మొత్తంపై 2 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. మీ చిన్నారి సమీపంలోని దుకాణంలో కార్డ్‌ని స్వైప్ చేస్తే 3 శాతం క్యాష్‌బ్యాక్ ల‌భిస్తుంది. తల్లిదండ్రులు పిల్లల కోసం యాప్‌లో టాస్క్‌లను సృష్టించి, అదనపు పాకెట్ మనీగా రివార్డ్‌ను అందించొచ్చు. 

పెన్సిల్టన్ కార్డ్‌: ఈ కార్డును పెన్సిల్‌ట‌న్ ఫిన్‌టెక్ స్టార్ట‌ప్ సంస్థ అందిస్తోంది. మ‌నీ మేనేజ్‌మెంట్ స్కిల్స్ నేర్చుకోవ‌డంలోనూ, ఖ‌ర్చుల‌ను నిర్వ‌హించ‌డంలోనూ ఈ కార్డు టీనేజ‌ర్లు, విద్యార్థులకు స‌హాయ‌ప‌డుతుంది. ఆర్‌బీఎల్ బ్యాంక్ భాగ‌స్వామ్యంతో పెన్సిల్‌ట‌న్ సంస్థ రూపే డెబిట్‌ కార్డును అందిస్తుంది. వర్చువ‌ల్ కార్డు ఉచితంగా ల‌భిస్తుంది. ఫిజిక‌ల్ కార్డుకు రూ.199 చెల్లించాల్సి ఉంటుంది. త‌ల్లిదండ్రులు పిల్ల‌ల‌కు ఇచ్చే పాకెట్ మ‌నీ ఈ కార్డు ద్వారా ఇచ్చి ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయొచ్చు.

చివ‌రగా: ఈ స్మార్ట్‌కార్డుల ద్వారా త‌ల్లిదండ్రులు పిల్ల‌ల ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయ‌డంతో పాటు వారికి మ‌నీ మేనేజ్‌మెంట్‌ స్కిల్స్‌ను సుల‌భంగా నేర్పించొచ్చు. కొన్ని కార్డులు రివార్డు పాయింట్ల‌ను, క్యాష్ బ్యాక్‌లు అందిస్తున్నాయి. కాబ‌ట్టి వీటిని ఏవిధంగా నిర్వ‌హిస్తే ఖ‌ర్చులు త‌గ్గించుకుని, ఎంత వ‌ర‌కు డ‌బ్బు ఆదా చేయ‌గ‌లమనేది పిల్ల‌లు ఆలోచిస్తారు. అయితే ఈ కార్డుల‌ను తీసుకునే ముందు కార్డు ఫీచ‌ర్లు, ఛార్జీలు, రివార్డు పాయింట్లు వంటి వాటిని తెలుసుకోవాలి. ప్రారంభంలో ఎక్కువ మొత్తంలో డ‌బ్బును కార్డులో లోడ్ చేయ‌క‌పోవ‌డ‌మే మంచింది. ఎందుకంటే ఎక్కువ మొత్తంలో లోడ్ చేస్తే పిల్ల‌లు ఎక్కువ మొత్తంలో ఖ‌ర్చు చేసేందుకు ఆస్కారం ఉంటుంది. త‌ల్లిదండ్రులు త‌ప్ప‌నిస‌రిగా ఖ‌ర్చుల విష‌యంలో పిల్ల‌ల ఆలోచ‌న‌లు, ప్ర‌వ‌ర్త‌న‌ను తెలుసుకోవాలి. నెల‌వారీ పొదుపు ప్రాముఖ్య‌త‌ను, ఆర్థిక విష‌యాల‌ను పిల్ల‌ల‌కు చెప్పాలి.

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

జిల్లా వార్తలు

సినిమా

మరిన్ని

క్రీడలు

మరిన్ని

పాలిటిక్స్

మరిన్ని

వెబ్ ప్రత్యేకం

మరిన్ని

జాతీయం

మరిన్ని

జనరల్

మరిన్ని