Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం భారం ఇలా తగ్గించుకుందాం!

Health Insurance: ఆరోగ్య బీమా ప్రీమియం పెరిగే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ భారాన్ని తగ్గించుకునేందుకు ఉన్న కొన్ని మార్గాలను చూద్దాం!

Published : 14 Mar 2023 12:08 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆరోగ్య బీమా పాలసీలపై ప్రీమియం (Health insurance premium) మొత్తాలను పెంచేందుకు ఇన్సూరెన్స్‌ కంపెనీలు సన్నద్ధం అవుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. కొవిడ్‌ అనంతరం ఆరోగ్య బీమా క్లెయిములు పెరగడమే దీనికి కారణం! అందువల్లే ప్రీమియం మొత్తాలను పెంచే దిశగా కంపెనీలు అడుగులు వేస్తున్నాయి. గతేడాది 30% వరకు ప్రీమియం మొత్తాన్ని పెంచిన కంపెనీలు, ఈ ఏడాది మళ్లీ పెంచనున్నాయి. ఈ నేపథ్యంలో ప్రీమియం (Health insurance premium) ఖర్చును తగ్గించుకోవడానికి ఉన్న కొన్ని మార్గాలను చూద్దాం..

ఆన్‌లైన్‌లో కొనుగోలు..

బీమా ప్రీమియాన్ని తగ్గించుకోవడానికి ఉన్న తొలి మార్గం మీ పాలసీని ఆన్‌లైన్‌లో కొనుగోలు చేయడం. ఆన్‌లైన్‌లో బీమా పంపిణీ ఆఫ్‌లైన్‌తో పోలిస్తే తక్కువ ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. దీనివల్ల కంపెనీలు కొంతమేర నిర్వహణ వ్యయాల్ని తగ్గించుకోగలుగుతాయి. ఈ ప్రయోజనంలో కొంత భాగాన్ని పాలసీదారులకు బదిలీ చేయాలన్న ఉద్దేశంతో కంపెనీలు ప్రీమియంలో రాయితీ కల్పిస్తాయి.

చిన్న వయసులోనే..

ఆరోగ్య బీమా ప్రీమియం  (health insurance premium)పై ఎక్కువగా ప్రభావం చూపే అంశం వయసు. చిన్న వయసులోనే కొనుగోలు చేయడం వల్ల తగ్గింపు లభిస్తుంది. ముందు నుంచీ వ్యాధులు ఉన్నవారికి ప్రీమియం ఎక్కువగా ఉంటుంది. వయసు పెరిగేకొద్దీ, మధుమేహం, రక్తపోటు వంటి అనారోగ్యాలు వచ్చే అవకాశాలు పెరుగుతాయి. చిన్న వయసులో ఆరోగ్యంగా ఉన్నప్పుడే బీమా తీసుకోవడం వల్ల ప్రీమియం తగ్గించుకునేందుకు అవకాశం ఉంటుంది.

ఒకేసారి 2-3 ఏళ్లకు..

ఈ రోజుల్లో చాలా బీమా సంస్థలు రెండు నుంచి మూడు సంవత్సరాలకు ఆరోగ్య పాలసీలను అందిస్తున్నాయి. దీనివల్ల ప్రీమియం తగ్గింపుతో పాటు, ఏటా పెరిగే పెంపు నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. మీరు రెండేళ్ల ఆరోగ్య బీమా పాలసీని ఎంచుకోవడం ద్వారా 10 శాతం వరకు తగ్గింపు, మూడేళ్ల పాలసీపై 15 శాతం వరకు తగ్గింపును పొందే అవకాశం ఉంది.

ఫ్యామిలీ ఫ్లోటర్‌..

ఆరోగ్య బీమా అవసరాలు ప్రతి వ్యక్తికి వేర్వేరుగా ఉంటాయి. అయితే, ఫ్యామిలీ ఫ్లోటర్ ప్లాన్‌లను ఒక కుటుంబంలోని సభ్యులందరికీ సరిపోయేలా రూపొందించారు. ఒక వ్యక్తికి మాత్రమే వర్తించే వ్యక్తిగత కవర్‌కు భిన్నంగా, ఫ్యామిలీ-ఫ్లోటర్ ప్లాన్ మొత్తం కుటుంబ వైద్య ఖర్చులను కవర్ చేస్తుంది. ఒక్కొక్కరికీ వ్యక్తిగత ప్లాన్‌ను తీసుకోవడంతో పోలిస్తే ఇది చాలా తక్కువ ప్రీమియంకే అందుబాటులో ఉంటుంది. కుటుంబంలో వైద్య చికిత్స అవసరమైన ఎవరైనా ప్లాన్ కింద హామీ ఇచ్చిన మొత్తాన్ని ఉపయోగించుకోవచ్చు.

నో క్లెయిమ్ బోనస్‌..

‘నో క్లెయిమ్ బోనస్ (NCB)’ తక్కువ ఖర్చుతో ఎక్కువ బీమా మొత్తాన్ని పొందడానికి గొప్ప మార్గం. పాలసీ వ్యవధిలో ఎటువంటి బీమా క్లెయిమ్ చేయకుంటే, ఎలాంటి అదనపు ప్రీమియం చెల్లించకుండానే తదుపరి సంవత్సరానికి మీ పాలసీలో భాగంగా అదనపు బీమా మొత్తాన్ని పొందవచ్చు. ఈ రోజుల్లో, చాలా బీమా సంస్థలు ఎన్‌సీబీ వెసులుబాటుని అందిస్తున్నాయి. ఉదాహరణకు, మీరు రూ.10 లక్షల మొత్తంతో పాలసీని కొనుగోలు చేశారనుకుందాం. వరుసగా కొన్ని సంవత్సరాల పాటు క్లెయిమ్‌ చేయలేదు. అప్పుడు బేస్ పాలసీ కంటే అదనంగా రూ.8-10 లక్షల బీమా మొత్తాన్ని పొందే అవకాశం ఉంటుంది. అయితే, ఇది పాలసీని బట్టి మారుతూ ఉంటుంది. మీరు తీసుకునే పాలసీ ఏ రకమైన ఎన్‌సీబీ ప్రయోజనాలను అందజేస్తుందో ముందే తెలుసుకోవాలి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని