Financial Planning: యువ‌త తెలుసుకోవాల్సిన కొన్ని ఆర్థిక విష‌యాలు

సంపాదించే యువ‌త అత్య‌వ‌స‌రంగా ఏర్ప‌డే విప‌త్తుల నుంచే కాక‌ భ‌విష్య‌త్తు మీద కూడా ద్రుష్టి పెట్టాలి.

Updated : 21 Sep 2022 17:09 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యువ‌కుల సంపాద‌న మొద‌లైన త‌ర్వాత వారి అస‌లు జీవితం మొద‌ల‌వుతుంది. సంపాద‌న ప్రారంభంలో భ‌విష్య‌త్‌కు ఉప‌యోపడని ఖ‌ర్చులు, నిర్ణ‌యాలు తీసుకుంటూ ఉంటారు. చాలా మంది చిన్న వ‌య‌సులో పూర్తిగా అర్థం చేసుకోని ఉత్ప‌త్తులు లేదా ఆస్తుల్లో పెట్టుబ‌డి పెడ‌తారు. అంతేకాకుండా త‌మ జీవిత ల‌క్ష్యాల‌ను చేరుకోవ‌డానికి త‌మ‌కు చాలా స‌మ‌యం ఉందిలే అనుకుంటారు. కానీ ప్ర‌స్తుత ప్ర‌పంచ ప‌రిస్థితి, ఎప్ప‌టిక‌ప్పుడు మారుతున్న ల‌క్ష్యాల‌ కార‌ణంగా.. ఆర్థికంగా, భౌగోళికంగా, పెట్టుబ‌డుల్లో యువ‌త మ‌రింత చురుకుగా ఉండాలి. సంపాదించే యువ‌త ఈ వ‌య‌సు నుంచే ప‌ద‌వీ విర‌మ‌ణ ప్ర‌ణాళిక‌ గురించి ఆలోచించాలి. అంటే సంపాద‌న ప్రారంభించిన కొత్తల్లోనే కొన్ని ఆర్థిక విష‌యాలు తెలుసుకోవాలి.

బ్యాంకుల‌పై ఆధార‌ప‌డొద్దు

పొదుపు ఖాతాల‌కు రోజువారీ ఆర్థిక కార్య‌క‌లాపాలు నిర్వ‌హించ‌డానికి, అత్య‌వ‌స‌ర నిధిని దాచ‌డానికి బ్యాంకుల‌పై ఆధార‌ప‌డొచ్చు. బ్యాంకుల్లో పెట్టుబ‌డుల‌కు 2.5-6% వ‌ర‌కు వ‌డ్డీ రాబ‌డి వ‌స్తుంది. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని త‌ట్టుకునే ఆదాయం బ్యాంకు సాధార‌ణ ఎఫ్‌డీల్లో, పొదుపు ఖాతాల‌లో రాద‌ని గ్ర‌హించాలి. బ్యాంకుల్లో దీర్ఘ‌కాల పెట్టుబ‌డులకు కాల‌క్ర‌మేణా వాటి విలువ త‌గ్గుతుందేగాని పెర‌గ‌దు. యువ‌త‌కు దీర్ఘ‌కాల బ్యాంకు పెట్టుబ‌డులు స‌రికావు. వీటి బదులు ఇతర పథకాలను ఎంచుకుని మంచి రాబడి పొందొచ్చు. అవేంటో కింద ఉన్నాయి.

సిప్ (SIP)లు ప్రారంభించండి

సంపాద‌న మొద‌లైననాటి నుంచే మ్యూచువ‌ల్ ఫండ్లలో క్ర‌మానుగ‌త పెట్టుబ‌డులు (సిప్‌) ప్రారంభించండి. SIPని ముందుగానే ప్రారంభించి దీర్ఘ‌కాలికంగా కొన‌సాగించిన‌ప్పుడు మంచి నిధి సమకూర్చుకునే అవ‌కాశం ఉంది. SIPలు మీ పెట్టుబ‌డుల‌కు క్ర‌మ‌శిక్ష‌ణ‌ను అల‌వాటు చేస్తాయి. మార్కెట్ భావోద్వేగాల నుంచి మిమ్మ‌ల్ని కాపాడ‌తాయి. ఇలాంటి దీర్ఘ‌కాల SIP.. మీ పిల్ల‌ల ఉన్న‌త విద్య‌కు, మీ ప‌ద‌వీ విర‌మ‌ణ నిధికి ఎంత‌గానో ఉప‌యోగ‌ప‌డుతుంది.

పీపీఎఫ్ (PPF)

యువ‌త‌కు దీర్ఘ‌కాలం పాటు పొదుపు చేయ‌డానికి త‌గినంత స‌మ‌యం ఉంటుంది. ఈ PPF కూడా దీర్ఘ‌కాల మ‌దుపునకు ఒక అద్భుత‌మైన అవ‌కాశ‌మే. 15 సంవ‌త్స‌రాల పాటు పెట్టుబ‌డిని కొన‌సాగించ‌వ‌చ్చు. ఆ తర్వాత కూడా 5 సంవ‌త్స‌రాలకొక‌సారి PPF పెట్టుబ‌డి కాలాన్ని అప‌రిమితంగా పెంచుకోవ‌చ్చు. దీనిలో ప్ర‌స్తుత వ‌డ్డీ రాబ‌డి ఏడాదికి 7.10% ఉంది. ఈ PPF పెట్టుబ‌డుల‌కు ప్ర‌భుత్వ హామీ ఉంటుంది. పీపీఎఫ్ ఖాతాను పోస్టాఫీసులో గానీ, ప్ర‌భుత్వ రంగ బ్యాంకులోగానీ ప్రారంభించ‌వ‌చ్చు. ఒక ఆర్థిక సంవ‌త్స‌రంలో క‌నీసం రూ. 500 డిపాజిట్ చేయాలి. గ‌రిష్ఠంగా రూ.1.50 ల‌క్ష‌ల వ‌ర‌కు డిపాజిట్ చేయొచ్చు. PPFలో మెచ్యూరిటీపై పొందే అస‌లు, వ‌డ్డీ మొత్తం కూడా ప‌న్ను ర‌హితం.

ట‌ర్మ్ జీవిత బీమా

యుక్త వ‌య‌సులో ఉన్న వారికి, కుటుంబం ఉన్న వారికి జీవిత బీమా అత్య‌వ‌స‌రం. ఈ జీవిత బీమాను ఏజెంట్లు, తెలిసిన వారు చెప్పార‌నో మొహ‌మాటానికి పోయి పెట్టుబ‌డుల‌తో కూడిన ఎండోమెంట్/హోల్ లైఫ్/మనీ బ్యాక్/యూనిట్ లింక్డ్ జీవిత బీమా పాల‌సీల‌ను కొనుగోలు చేయొద్దు. వీటిలో మెచ్యూరిటీ స‌మ‌యానికి వ‌చ్చే రాబ‌డి మొత్తం చాలా త‌క్కువ‌గా ఉంటుంది. పాలసీదారుడు మరణిస్తే కుటుంబానికి అందే బీమా మొత్తం కూడా త‌క్కువే ఉంటుంది. అస‌లైన జీవిత బీమా అంటే ట‌ర్మ్ జీవిత బీమానే అని చెప్ప‌వ‌చ్చు. చిన్న వ‌య‌సులోనే ట‌ర్మ్ బీమాను కొనుగోలు చేయ‌డం వ‌ల్ల చాలా త‌క్కువ ప్రీమియంతో ఎక్కువ బీమా క‌వ‌రేజీని పొంద‌వ‌చ్చు. మీరు ట‌ర్మ్ బీమా కొనుగోలు ఆల‌స్యంచేసేకొద్దీ మీ వ‌య‌సు, ఆరోగ్య స్థితి ఆధారంగా ప్రీమియం ఎక్కువ అవుతుంది. ఈ ట‌ర్మ్ బీమా మీ కుటుంబానికి ఆర్థిక భ‌రోసా, మీకు మాన‌సిక భ‌రోసానిస్తుంది. మీపై భారీ పెట్టుబ‌డి ఒత్తిడిని త‌గ్గిస్తుంది.

ఆరోగ్య బీమా

ఏ వ‌య‌సు వారికైనా ఈ ఆరోగ్య బీమా అనేది త‌ప్ప‌నిస‌రి. అయితే, యువ‌త తాము ఆరోగ్య‌వంతులుగానే ఉన్నామ‌నే ఆలోచ‌న‌తో దీన్ని నిర్ల‌క్ష్యం చేస్తుంటార. ఈ ఆలోచ‌న స‌రైంది కాదు. మారుతున్న ఆరోగ్య అల‌వాట్లు, జీవ‌న‌శైలి కార‌ణంగా ఎలాంటి అనారోగ్య ప‌రిస్థితులు ఎప్పుడు ఏర్ప‌డ‌తాయో ఊహించ‌లేం. చిన్న వ‌య‌సులో ఆరోగ్య బీమా ప్రీమియంలు చాలా త‌క్కువ‌గా ఉంటాయి. సంపాద‌న వ‌య‌సులో ఉంటారు కాబ‌ట్టి ఈ త‌క్కువ ఆరోగ్య బీమా ప్రీమియంలు పెద్ద భార‌మేమీ కావు.

చివరిగా: యువత అర్థంకాని పెట్టుబడులను ఎంచుకోవడం సరికాదు. మితంగా ఖర్చులు చేస్తూ, ఆర్థిక లక్ష్యాలను తెలుసుకుని దానికి అనుగుణంగా పెట్టుబడులు పెట్టడం వల్ల వారి దీర్ఘకాల లక్ష్యాలను చేరుకోగలుగుతారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని