సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు ల‌భించే కొన్ని ఆదాయ, ప‌న్ను ప్ర‌యోజ‌నాలు

60 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు నిర్దిష్ట ఆదాయం మేర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు.

Updated : 29 Apr 2022 13:11 IST

సీనియ‌ర్ సిటిజ‌న్ల‌కు త‌మ పెట్టుబ‌డుల‌పై వ‌చ్చే రాబ‌డిపై ఆదాయ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు, ఆరోగ్య బీమా ప్రీమియంపై ప‌న్ను మిన‌హాయింపు, డిపాజిట్ల నుండి వ‌చ్చే ఆదాయంపై అధిక TDS ప‌రిమితి వ‌ర‌కు వారి ప్ర‌యోజ‌నం కోసం అనేక ప‌న్ను ప్ర‌యోజ‌నాలు ఉన్నాయి. 60 ఏళ్లు పైబ‌డిన సీనియ‌ర్ సిటిజ‌న్లు నిర్దిష్ట ఆదాయం మేర‌కు ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను పొందుతారు.

డిపాజిట్ల‌పై మిన‌హాయింపు:

60 సంవ‌త్స‌రాలు లేదా అంత‌కంటే ఎక్కువ వ‌య‌స్సున్న వారు బ్యాంకులు, పోస్టాఫీసు, కో-ఆప‌రేటివ్ బ్యాంకుల్లో పొదుపు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు కింద రూ. 50 వేల వరకు వ‌డ్డీ ఆదాయాన్ని సంపాదిస్తే ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80TTB కింద ప‌న్ను మిన‌హాయింపుకు అర్హులు.

వైద్య బీమా ప్రీమియం:

సీనియ‌ర్ సిటిజ‌న్స్ ఆరోగ్య బీమా పాల‌సీల‌ను ఎంచుకునే స‌మ‌యంలో వారు పాల‌సీలో మిన‌హాయించ‌ద‌గిన లేదా స‌హ‌-చెల్లింపు భాగాన్ని జాగ్ర‌త్త‌గా ఎంచుకోవాలి. ఆరోగ్య బీమా పాల‌సీకి చెల్లించిన ప్రీమియం ఆదాయ‌పు ప‌న్ను చ‌ట్టంలోని సెక్ష‌న్ 80డీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు ఆర్హ‌త ఉంటుంది. జీవిత బీమా పాల‌సీలో రైడ‌ర్ల‌కు చెల్లించే ప్రీమియం కూడా ఈ సెక్ష‌న్ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌కు అర్హ‌త ఉంటుంది.

అయితే ప‌న్ను ప్ర‌యోజ‌న ప‌రిమాణం వైద్య‌ప‌రంగా బీమా చేయ‌బ‌డిన వ్య‌క్తి వ‌య‌స్సుపై ఆధార‌ప‌డి ఉంటుంది.  60 సంవ‌త్స‌రాల క‌న్నా త‌క్కువ వ‌య‌స్సు వారు పొంద‌గ‌లిగే ప‌న్ను ప్ర‌యోజ‌నం రూ. 25 వేలు మాత్ర‌మే. 60 సంవ‌త్స‌రాలు దాటిన త‌ల్లిదండ్రుల ఆరోగ్య బీమా ప్రీమియంపై పొంద‌గ‌లిగే గ‌రిష్ట మిన‌హాయింపు సంవ‌త్స‌రానికి రూ. 50 వేలు.వ్య‌క్తి వ‌య‌స్సు 60 ఏళ్లు పైబ‌డి ఉంటే అత‌ని/ఆమె బీమా ప్రీమియం తో పాటు త‌ల్లిదండ్రుల కోసం ప్రీమియం కూడా చెల్లిస్తే పొంద‌గ‌లిగే మొత్తం మిన‌హాయింపు రూ. 1 ల‌క్ష‌.

ఆదాయ‌పు ప‌న్ను ప్ర‌యోజ‌నం కోసం 60 - 80 ఏళ్ల మ‌ధ్య ఉన్న ప‌న్ను చెల్లింపుదారుల‌ను సీనియ‌ర్ సిటిజ‌న్‌లుగా ప‌రిగ‌ణిస్తారు. 80 ఏళ్లు పైబ‌డిన వారిని సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్లుగా ప‌రిగ‌ణిస్తారు. సీనియ‌ర్ సిటిజ‌న్‌కు ల‌భించే ఆదాయ‌పు ప‌న్ను ప‌రిమితి రూ. 3 ల‌క్ష‌లు, సూప‌ర్ సీనియ‌ర్ సిటిజ‌న్‌కు అందుబాటులో ఉన్న ప‌రిమితి రూ. 5 ల‌క్ష‌లు. 60 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సున్న‌వారికి మిన‌హాయింపు ప‌రిమితి రూ. 2,50,000. ఎన్ఆర్ఐ.. సీనియ‌ర్ సిటిజ‌న్ అయిన‌ప్ప‌టికీ ఈ ప‌న్ను ప్ర‌యోజ‌నాలు అందుబాటులో ఉండ‌వు.

ఫారం 15హెచ్:

సీనియ‌ర్ సిటిజ‌న్‌గా ఆర్ధిక సంవ‌త్స‌రంలో మొత్తం ఆదాయం మిన‌హాయింపు ప‌రిమితిలో ఉంటే, TDS క‌ట్ చేయ‌కుండా ఉండేందుకు డిపాజిట‌ర్ బ్యాంకుకి ఫార‌మ్ 15హెచ్ స‌మ‌ర్పించాలి. నాన్ సీనియ‌ర్ సిటిజ‌న్ల‌యితే ఫారం 15జీ స‌మ‌ర్పించ‌వ‌చ్చు. డిపాజిట్లు ఒక సంవ‌త్స‌రం కంటే ఎక్కువ ఉంటే అవి ఉన్నంత కాలం ఈ ఫార‌మ్‌ల‌ను ప్ర‌తి సంవ‌త్స‌రం ఏప్రిల్ నెల‌లో స‌మ‌ర్పించాలి.

సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్ స్కీమ్:

చాలా మంది ప‌ద‌వీ విర‌మ‌ణ చేసిన‌వారి మొద‌టి ఎంపిక ఇది. సీనియ‌ర్ సిటిజ‌న్స్ సేవింగ్స్ స్కీమ్ (SCSS) అనేది చాలా మంది ఉద్యోగ విర‌మ‌ణ చేసేవారి పెట్టుబ‌డి పోర్ట్‌ఫోలియోలో త‌ప్ప‌నిస‌రిగా ఉంటుంది. 60 ఏళ్లు పైబ‌డిన ఎవ‌రైనా పోస్టాఫీస్ లేదా బ్యాంకు నుండి ఈ ప‌థ‌కంలో చేర‌వచ్చు. ఈ ప‌థ‌కం 5 ఏళ్ల ప‌ద‌వీ కాలానికి క‌లిగి ఉంటుంది. అయితే, ప‌థ‌కం మెచ్యూర్ అయిన త‌ర్వాత దీనిని 3 ఏళ్ల పాటు పొడిగించ‌వ‌చ్చు. ప్ర‌స్తుతం వ‌డ్డీ రేటు సంవ‌త్స‌రానికి 7.40% గా ఉంది, వ‌డ్డీ త్రైమాసికానికి చెల్లిస్తారు. అర్హ‌త ఉన్న ప‌న్ను శ్లాబ్ ఆధారంగా వ‌డ్డీకి ప‌న్ను విధించ‌బ‌డుతుంది. క‌నీసం రూ. 1,000తో ఖాతా తెర‌వొచ్చు. గ‌రిష్ట పెట్టుబ‌డి ప‌రిమితి రూ. 15 ల‌క్ష‌లు. ఇది సెక్ష‌న్ 80సీ కింద ప‌న్ను ప్ర‌యోజ‌నాల‌ను కూడా అందిస్తుంది. మ‌ధ్య‌లో ఉప‌సంహ‌ర‌ణ‌కు అనుమ‌తి ఉంటుంది.

బ్యాంకు ఎఫ్‌డీల‌పై అద‌న‌పు వ‌డ్డీ:

సీనియ‌ర్ సిటిజ‌న్‌ల‌కు అందించే బ్యాంక్ ఫిక్స్‌డ్ డిపాజిట్లు అద‌న‌పు వ‌డ్డీతో ల‌భిస్తాయి. చాలా బ్యాంకులు 0.5% అద‌న‌పు వ‌డ్డీని వీరికి అందిస్తాయి. దాదాపు అన్ని బ్యాంకులు సీనియ‌ర్ సిటిజ‌న్ల ఎఫ్‌డీల‌పై కొద్దిగా ఎక్కువ‌ వ‌డ్డీ రేట్ల‌ను అందిస్తున్నాయి. అయితే, వీటికి విధించే ప‌న్నులు.. వ‌డ్డీ రాబ‌డిని త‌గ్గిస్తాయి. అందుకే, సీనియ‌ర్ సిటిజ‌న్లు ప‌న్ను ఆదా చేసే 5 ఏళ్ళ ఎఫ్‌డీలను తీసుకోవ‌డం మంచిది. డిపాజిట్ స‌మ‌యంలో బ్యాంకుకు వ‌య‌స్సు రుజువు స‌మ‌ర్పించాలి.

సీనియ‌ర్ సిటిజ‌న్‌లు (75 సంవ‌త్స‌రాలు ఇంత‌కంటే ఎక్కువ వ‌య‌సున్న‌వారు) ఆదాయ ప‌న్ను త‌గ్గించుకోవ‌డానికి ఆర్ధిక చ‌ట్టం 2021, సెక్ష‌న్ 194పీని ఉప‌యోగించ‌వ‌చ్చు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని