Recurring Deposit: ఆర్‌డీ చేస్తున్నారా? ఇవి గుర్తుంచుకోండి..

ఒకటి నుంచి మూడు సంవత్సరాల స్వల్పకాల లక్ష్యాల కోసం ఆర్‌డీ ఖాతాను ఎంచుకోవొచ్చు.

Published : 31 Jan 2023 15:11 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: పెట్టుబడులు పెట్టేటప్పుడు ఆర్థిక లక్ష్యాల సాధన కోసం సహాయపడే మార్గాలను ఎంచుకోవాలి. ఒకేసారి పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టలేనివారు, నెలవారీగా నిర్దిష్ట మొత్తాన్ని పొదుపు చేసి పెట్టుబడులు పెట్టాలనుకునేవారు రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతాను ఎంచుకోవచ్చు. ఇది సురక్షితమైన మార్గం. మీ స్వల్పకాల ఆర్థిక లక్ష్యాలను చేరుకునేందుకు సహాయపడుతుంది. ఆర్‌డీ ఖాతా టర్మ్‌ డిపాజిట్‌ మాదిరిగా పనిచేస్తుంది. ఎటువంటి నష్టభయం లేకుండా క్రమమైన డిపాజిట్లు చేస్తూ మంచి రాబడిని సాధించవచ్చు. ఆర్‌డీ ఖాతాను తెరిచేందుకు మీరు పోస్టాఫీసును గానీ, బ్యాంకులను గానీ సంప్రదించవచ్చు. రికరింగ్‌ డిపాజిట్ల నుంచి ఎక్కువ రాబడి పొందేందుకు అనుసరించాల్సిన మార్గాలను ఇప్పుడు చూద్దాం.. 

సరైన బ్యాంకును ఎంచుకోండి..

ముందుగా నిర్ణయించిన మొత్తాన్ని ప్రతి నెలా ఆర్‌డీ ఖాతకు జమ చేయాలి. బ్యాంకుకు వెళ్లి డిపాజిట్‌ చేయాలంటే.. ఒక్కోసారి మర్చిపోవచ్చు లేదా కుదరకపోవచ్చు. కాబట్టి, పొదుపు ఖాతా నుంచి ఆర్‌డీ ఖాతాకు ప్రతి నెలా నిర్దిష్ట తేదీన జమ చేసేలా బ్యాంకుకు సూచనలు ఇవ్వండి. దీని కోసం అవాంతరాలు లేకుండా సేవలను అందించే బ్యాంకును ఎంచుకోవడం అవసరం. రికరింగ్‌ డిపాజిట్‌ ఖాతా వడ్డీ రేట్లు, ఖాతా ఇతర నియమ నిబంధనలు, షరతులు పోల్చి చూడండి. బ్యాంకును అనుసరించి వడ్డీ రేట్లు మారుతూ ఉంటాయి. కాబట్టి మంచి వడ్డీ రేటును అందించే బ్యాంకును ఎంచుకోండి. ప్రస్తుతం వివిధ బ్యాంకులు ఆర్‌డీ ఖాతాలపై 5.50% నుంచి 7.50% మధ్య వడ్డీని ఇస్తున్నాయి. 

లక్ష్యాలకు అనుగుణంగా కాలవ్యవధి..

బ్యాంకులు సాధారణంగా కనీసం 6 లేదా 12 నెలల కాలపరిమితితో ఆర్‌డీ ఖాతాను ఇస్తాయి. గరిష్ఠంగా 10 సంవత్సరాల వరకు కూడా ఉంటుంది. మీరు మీ ఆర్థిక లక్ష్యాన్ని పరిగణనలోకి తీసుకుని కాలపరిమితిని ఎంచుకోవాలి. ఉదాహరణకు మీరు పిల్లల ట్యూషన్‌ ఫీజు 12 నెలల్లో చెల్లించవలసి వస్తే, ఇదే కాలపరిమితితో ఎంచుకోవచ్చు. ఆర్‌డీ ఖాతా స్వల్పకాల అవసరాల కోసం అనుకూలంగా ఉంటుంది.

ఆర్‌డీ మొత్తం..

ప్రతి నెలా ఎంత మొత్తం పెట్టుబడి పెట్టాలనుకుంటున్నారో ఆర్‌డీ ఖాతా ప్రారంభానికి ముందే నిర్ణయించుకోవాలి. మీ ఆర్థిక లక్ష్యాన్ని బట్టి, మీరు నెల నెలా పొదుపు చేయగల మొత్తాన్ని బట్టి నిర్ణయం తీసుకోవాలి. ఆర్‌డీ ఖాతాలో ప్రతి నెలా క్రమం తప్పకుండా డిపాజిట్‌ చేయాలి. కాబట్టి, ఎక్కువ మొత్తం ఎంచుకుంటే మీపై ఆర్థిక భారం పడొచ్చు. దీని ప్రభావం మీ ఇతర అవసరమైన ఖర్చులపై లేదా ఇతర పెట్టుబడులపై పడొచ్చు. అందువల్ల పెట్టుబడి మొత్తాన్ని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. 

ముందస్తు విత్‌డ్రాలు వద్దు..

మెచ్యూరిటి పీరియడ్‌ వరకు ఆర్డీ ఖాతాను కొనసాగించడం అవసరం. అన్ని బ్యాంకులూ ముందస్తు విత్‌డ్రాలను అనుమతించవు. ఒకవేళ అనుమతించినా ముందస్తు విత్‌డ్రాలపై పెనాల్టీ వర్తిస్తుంది. కొనసాగించిన కాలాన్ని బట్టి వడ్డీని లెక్కిస్తారు. అందువల్ల ఖాతా తెరిచే ముందే అధిక వడ్డీ రేటుతో పాటు ముందస్తు విత్‌డ్రాలపై తక్కువ పెనాల్టీ వసూలు చేసే బ్యాంకును ఎంచుకోవాలి. 

ఒకవేళ మధ్యలోనే డిపాజిట్లను నిలిపివేస్తే, అప్పుడు కూడా బ్యాంకులు జరిమానా విధిస్తాయి. సాధారణంగా ఇచ్చే వడ్డీ కంటే 1 నుంచి 2 శాతం తక్కువ వడ్డీ ఇస్తాయి. దీంతో రాబడి తగ్గిపోతుంది. అలాగే ప్రతి నెలా నిర్ణీత సమయానికి డబ్బు డిపాజిట్‌ చేయకపోయినా పెనాల్టీ వర్తిస్తుంది. కాబట్టి ఖాతాను మధ్యలోనే నిలిపి వేయడం, ముందస్తు విత్‌డ్రాలు లాంటివి చేయకపోవడమే మంచిది.

ఫ్లెక్సీ రికరింగ్ డిపాజిట్‌..

కొన్ని బ్యాంకులు ఫ్లెక్సీ రికరింగ్‌ డిపాజిట్లను అందిస్తున్నాయి. మెచ్యూరిటీ మొత్తాన్ని పెంచుకునేందుకు ప్రతి నెలా రికరింగ్‌ డిపాజిట్‌ మొత్తాన్ని పెంచుకునే ఎంపికను అందిస్తున్నాయి. ఎంచుకున్న డిపాజిట్‌తో మీ లక్ష్యానికి తగినట్లుగా డబ్బు సమకూరనప్పుడు, ఇతర పెట్టుబడులపై ప్రభావం పడకుండా ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్‌ చేయగలం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్‌ ఎంచుకోవడం మంచిది. 

రుణ సౌకర్యం..

ఆర్‌డీ ఖాతాలో రుణ సదుపాయం అందుబాటులో ఉంటుంది. మీరు డిపాజిట్‌ చేసిన మొత్తంపై 80 నుంచి 90 శాతం రుణం తీసుకోవచ్చు. అయితే, అత్యవసరం అనుకున్నప్పుడు మాత్రమే ఈ ఆప్షన్‌ ఎంచుకోవాలి. 

నామినేషన్‌..

ఆర్‌డీ ఖాతాకు నామినేషన్‌ తప్పకుండా జోడించాలి. అనుకోకుండా ఖాతా తీసుకున్న వ్యక్తికి ఏమైనా జరిగితే నామినీకి సులభంగా డబ్బు చేరుతుంది.

చివరిగా..

ఆర్‌డీ ఖాతాకు ఎఫ్‌డీ మాదిరిగా ఒకేసారి డబ్బు జమ చేయాల్సిన అవసరం లేదు. నెల నెలా జమ చేయవచ్చు. 1 నుంచి 3 సంవత్సరాల (ఇంటి రిపేర్లు, పిల్లల ట్యూషన్‌ ఫీజు, ప్రయాణం వంటివి) స్వల్పకాల లక్ష్యాలకు మాత్రమే ఆర్‌డీ అనుకూలంగా ఉంటుంది. మెచ్యూరిటీ సమయంలో డిపాజిట్‌ చేసిన మొత్తంతో పాటు వడ్డీని కూడా చెల్లిస్తారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని