Updated : 04 Jun 2022 13:41 IST

Aadhaar: ఈ 7 టిప్స్‌తో మీ ఆధార్‌ను భద్రంగా ఉంచుకోండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రభుత్వ సంక్షేమ పథకాల నుంచి కాలేజీ చేరికల వరకు అన్నింటికీ తప్పనిసరి అయిన ఆధార్‌ (Aadhaar) భద్రత గురించి ఆందోళన వ్యక్తమవుతోంది. ఇటీవల కేంద్రం ఆధార్‌ ఫొటోకాపీలను ఎవరితో పంచుకోవద్దంటూ జారీ చేసిన ఆదేశాలు.. ఆ వెంటనే వాటిని ఉపసంహరించుకోవడం అనుమానాలను మరింత పెంచింది. భద్రతాపరంగా ‘ఆధార్‌’ సమాచారానికి వచ్చిన ఢోకా ఏమీ లేదని భారత విశిష్ట గుర్తింపు సంఖ్య ప్రాధికార సంస్థ (UIDAI) చెబుతోంది. అయినప్పటికీ.. మన ఆధార్‌ (Aadhaar)ను రక్షించుకోవాల్సిన బాధ్యత మనదే. తప్పుడు చేతుల్లోకి వెళ్లకుండా మన తరఫున కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి.


 ఆధార్‌ ఇచ్చే ముందు వెరిఫై చేయాలి..

ఎక్కడైనా ఆధార్‌ ఫొటోకాపీ సమర్పించే ముందు వివరాలను వెరిఫై చేయాలి. ఆధార్‌ అంటే చాలా మంది కేవలం కార్డుపై కనిపించే 12 అంకెల ప్రత్యేక సంఖ్య మాత్రమే అనుకుంటారు. ఆధార్‌ వెబ్‌సైట్‌కు వెళ్లి మీ ఆధార్‌ సంఖ్యను ఎంటర్‌ చేసి కీలక సమాచారం సరిగ్గా ఉందో లేదో వెరిఫై చేసుకోవచ్చు. ఇది ఇటు కార్డుదారులతో పాటు దాన్ని స్వీకరించే వారికి కూడా శ్రేయస్కరం. https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ఈ లింక్‌పై క్లిక్‌ చేసి ఆధార్‌ను వెరిఫై చేసుకోవచ్చు.


ఓటీపీని ఇతరులతో పంచుకోవద్దు..

ఆధార్‌ను ధ్రువపరిచేందుకు ఓటీపీ (Aadhaar OTP) ఓ సులువైన మార్గం. ఓటీపీతో ఎక్కడి నుంచైనా ఆధార్‌ను అధీకృతం చేయొచ్చు. మీ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎవరితో పంచుకోవద్దు. https://myaadhaar.uidai.gov.in/verifyAadhaar ఈ లింక్‌పై క్లిక్‌ చేసి వివరాలు అందజేస్తే ఏ మొబైల్‌ నంబరుకు ఓటీపీ వస్తుందో వెంటనే తెలిసిపోతుంది.


డౌన్‌లోడ్‌ కాపీని డిలీట్‌ చేయడం మర్చిపోవద్దు..

మీరు ఎక్కడైనా బయటి కంప్యూటర్లలో ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసినట్లయితే.. దాని ప్రింటవుట్‌ తీసుకున్న తర్వాత ఆ ఫైల్‌ను డిలీట్‌ చేయాలి. అలాగే ఆధార్‌ను ఎప్పుడూ అధికారిక వెబ్‌సైట్‌ నుంచి మాత్రమే డౌన్‌లోడ్‌ చేసుకోవాలి. eaadhaar.uidai.gov.in/genricDownloadAadhaar ఈ లింక్‌పై క్లిక్‌ చేసి ఈ-ఆధార్‌ను డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.


ఎక్కడెక్కడ వాడారో తెలుసుకోవచ్చు..

మనం ఆధార్‌ ఎక్కడెక్కడ.. ఎప్పుడెప్పుడు ఇచ్చామో తెలుసుకోవచ్చు. ఆధార్‌ వెబ్‌సైట్‌ లేదా యాప్‌ ద్వారా గత ఆరు నెలల్లో ఆధార్‌ అథెంటికేషన్‌ (Aadhaar Authentication) వివరాలను తెలుసుకోవచ్చు. గరిష్ఠంగా 50 అథెంటికేషన్స్‌కు సంబంధించిన సమాచారం అందుబాటులో ఉంటుంది. ఒకవేళ వాటిలో మీకు తెలియకుండా జరిగిన అథెంటికేషన్‌ ఏదైనా ఉంటే మీ ఆధార్‌ దుర్వినియోగం అయినట్లు గుర్తించొచ్చు.


ఆధార్‌ను లాక్‌ చేయొచ్చు..

ఆధార్‌లో నిక్షిప్తమై ఉండే బయోమెట్రిక్‌ సహా ఇతర వివరాలను లాక్‌ చేయొచ్చు. దీనివల్ల దుర్వినియోగాన్ని అరికట్టొచ్చు. అయితే, ఆధార్‌ సంఖ్య స్థానంలో వర్చువల్‌ ఐడీని గుర్తుంచుకోవాల్సి ఉంటుంది. ఈ 16 అంకెల వర్చువల్‌ ఐడీని ఉపయోగించి తిరిగి ఎప్పుడంటే అప్పుడు మళ్లీ ఆధార్‌ను అన్‌లాక్‌ చేసుకోవచ్చు. అథెంటికేషన్‌, ఈ-కేవైసీ సమయంలోనూ వర్చువల్‌ ఐడీని ఉపయోగించుకోవచ్చు. https://resident.uidai.gov.in/aadhaar-lockunlock లింక్‌ను ఉపయోగించి ఆధార్‌ను లాక్‌/అన్‌లాక్‌ చేయొచ్చు.


మాస్క్‌డ్‌ ఆధార్‌..

ఆధార్‌ నంబర్‌ ఇవ్వడం అంత శ్రేయస్కరం కాదని మీరు భావిస్తే వర్చువల్‌ ఐడీ లేదా.. ఆధార్‌ సంఖ్యలోని చివరి నాలుగు అంకెలు మాత్రమే కనిపించే మాస్క్‌డ్‌ ఆధార్‌ (Masked Aadhaar)ను ఉపయోగించుకోవచ్చు.


మొబైల్‌  నంబరు అప్‌డేట్‌ చేయాలి..

మీరు తాజాగా ఉపయోగిస్తున్న మొబైల్‌ నంబర్‌తో ఆధార్‌తో అనుసంధానించాలి. మొబైల్‌ నంబర్‌ మార్చిన ప్రతిసారీ ఆధార్‌ను అప్‌డేట్‌ చేయాలి. https://myaadhaar.uidai.gov.in/verify-email-mobile ఈ లింక్‌పై క్లిక్‌ చేసి మీ మొబైల్‌, ఈ-మెయిల్‌ను వెరిఫై చేసుకోవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

ఎక్కువ మంది చదివినవి (Most Read)

మరిన్ని