నేటి నుంచి సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం తొమ్మిదో సిరీస్‌ ప్రారంభం

ఈ ప‌థ‌కం 9వ సిరీస్ 5 రోజుల స‌భ్య‌త్వం సోమవారం ప్రారంభమైంది.

Updated : 10 Jan 2022 14:56 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం 2021-22 సిరీస్ 9 ప్రారంభమైంది. సోమవారం నుంచి ఐదు రోజుల పాటు అందుబాటులో ఉంటుంది. ఈ గోల్డ్ బాండ్ ప‌థ‌కం ఇష్యూ ధ‌ర గ్రాముకి రూ.4,786గా నిర్ణ‌యించారు. మునుప‌టి సిరీస్ ధ‌ర‌కంటే గ్రాముకి రూ.5 చొప్పున తగ్గించారు. బిడ్డ‌ర్ల‌ కోసం జ‌న‌వ‌రి 14 వరకు సబ్‌స్క్రిప్షన్‌కు తెరిచి ఉంటుంది.

సావ‌రిన్ గోల్డ్ బాండ్ కొన్ని ముఖ్య‌మైన వివ‌రాలు

స‌బ్‌స్క్రిప్ష‌న్ తేదీ: సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కం 2021-22 తొమ్మిదో విడత స‌బ్‌స్క్రిప్ష‌న్ జనవరి 10వ తేదీన ప్రారంభ‌మ‌వుతుంది. ఇది 14 జ‌న‌వ‌రి 2022 వ‌ర‌కు బిడ్డింగ్ కోసం తెరిచి ఉంటుంది.

ఇష్యూ ధ‌ర: ఈ ప‌థ‌కం ఇష్యూధ‌ర గ్రాముకి రూ.4,786గా నిర్ణ‌యించారు.

ధ‌ర ఎవ‌రికి త‌గ్గింపు: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునే చందాదారుల‌కు గ్రాముకి రూ.50 త‌గ్గించి అందించాల‌ని భార‌త ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఇటువంటి (ఆన్‌లైన్ లేదా డిజిట‌ల్‌) చెల్లింపు పెట్టుబ‌డిదారుల‌కు, ఈ గోల్డ్ బాండ్ ఇష్యూ ధ‌ర గ్రాము బంగారంపై రూ.4,736గా ఉంటుంద‌ని ఆర్‌బీఐ తెలిపింది.

పెట్టుబ‌డి ప‌రిమితి: సావ‌రిన్ గోల్డ్ బాండ్ ప‌థ‌కంలో అనుమ‌తించ‌దగిన క‌నీస పెట్టుబ‌డి ఒక గ్రాము బంగారం. స‌బ్‌స్క్రిప్ష‌న్ గ‌రిష్ఠ ప‌రిమితి వ్య‌క్తికి 4 కిలోలు. అవిభాజ్య హిందూ కుటుంబాల‌కు (హెచ్‌యూఎఫ్‌)కి 4 కిలోలు, ట్ర‌స్టులు, వాటికి సంబంధించిన సంస్థ‌ల‌కు ఆర్థిక సంవ‌త్స‌రానికి 20 కిలోలు దాకా పెట్టుబ‌డి పెట్టొచ్చు.

కేవైసీ అర్హ‌త: భౌతిక‌మైన బంగారం కొనుగోలుకు సంబంధించిన కేవైసీ నిబంధ‌న‌లు దీనికి ఒకే విధంగా ఉంటాయి.

దరఖాస్తు ఎక్క‌డ చేయాలి: సావ‌రిన్ గోల్డ్ బాండ్ స్కీమ్ 2021-22, సిరీస్ 9ని బ్యాంకులు (స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు, చెల్లింపు బ్యాంకులు మిన‌హా), స్టాక్ హోల్డింగ్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎస్‌హెచ్‌సీఐఎల్‌), ఎంపిక చేసిన పోస్టాఫీసులు, గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీలు (ఎన్ఎస్ఈ, బీఎస్‌ఈ) ద్వారా విక్రయిస్తారు.

బాండ్ కాలం ఎంత: ఈ బాండ్ పూర్తి కాలం 8 సంవ‌త్స‌రాలు. 5వ సంవ‌త్స‌రం నుంచి నిష్క్ర‌మ‌ణకు అనుమ‌తి ఉంది.

వ‌డ్డీ చెల్లింపు: మ‌దుపుదారుల‌కు నామ‌మాత్ర‌పు విలువ‌పై సంవ‌త్స‌రానికి 2.50% ఫిక్స్‌డ్ రేటుతో వార్షికంగా చెల్లిస్తారు.

ప‌న్ను విధింపు: మెచ్యూరిటీ వ‌ర‌కు ఉంచిన సావ‌రిన్ గోల్డ్ బాండ్స్‌పై ఎటువంటి మూల‌ధ‌న లాభాల ప‌న్ను విధించరు. ఒక‌వేళ ఎక్స్ఛేంజీల‌లో మెచ్యూరిటీ తేదీకి ముందు ఈ బాండ్స్ విక్ర‌యించినట్లయితే మూల‌ధ‌న లాభాలు వ‌ర్తించే రేట్ల వ‌ద్ద ప‌న్ను విధిస్తారు. సావ‌రిన్ గోల్డ్ బాండ్స్ నుంచి సంపాదించిన వ‌డ్డీకి మ‌దుపుదారుల ప‌న్ను స్లాబ్ ప్ర‌కారం ప‌న్ను విధిస్తారు.

ఈ బాండ్స్ ముఖ్య ఉద్దేశం: దేశీయ బంగారు అమ్మ‌కాల్లో 85% బంగారం భార‌త్ దిగుమ‌తి చేసుకున్న‌దే. ఈ దిగుమ‌తులు త‌గ్గించ‌డానికి భౌతిక బంగారం డిమాండ్‌ను త‌గ్గించి, దేశీయ పొదుపులో కొంత భాగాన్ని బంగారం కొనుగోలుకు బ‌దులుగా.. ఆర్థిక పొదుపుగా మార్చాల‌నే ల‌క్ష్యంతో సార్వ‌భౌమ బంగారు ప‌థ‌కాన్ని న‌వంబ‌ర్ 2015లో కేంద్ర ప్ర‌భుత్వం ప్రారంభించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని