Indian economy: భారత వృద్ధిరేటు 7.3 శాతం.. ఎస్‌అండ్‌పీ అంచనా

ఈ ఆర్థిక సంవత్సరం భారతదేశ వృద్ధి రేటును ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 7.3 శాతంగా అంచనా వేసింది...

Updated : 17 Oct 2022 12:04 IST

దిల్లీ: ఈ ఆర్థిక సంవత్సరం భారతదేశ వృద్ధి రేటును ఎస్‌అండ్‌పీ గ్లోబల్‌ రేటింగ్స్‌ 7.3 శాతంగా అంచనా వేసింది. వచ్చే ఏడాది ఇది 6.5 శాతంగా ఉంటుందని లెక్కగట్టింది. 2022 ఆఖరు వరకు ద్రవ్యోల్బణం ఆర్‌బీఐ లక్ష్యిత పరిధి అయిన ఆరు శాతం ఎగువనే ఉంటుందని తెలిపింది. కరోనా సంక్షోభం నుంచి క్రమంగా కోలుకుంటున్న దేశ ఆర్థిక వ్యవస్థకు వచ్చే ఏడాది స్థానిక వినియోగం దన్నుగా నిలుస్తుందని పేర్కొంది. ఈ మేరకు సోమవారం ‘ఎకానమిక్‌ అవుట్‌లుక్‌ ఫర్‌ ఏషియా పసిఫిక్‌’ పేరిట నివేదికను విడుదల చేసింది.

అధిక ద్రవ్యోల్బణం, వడ్డీరేట్ల పెంపు నేపథ్యంలో ఇప్పటికే పలు ఆర్థిక సంస్థలు భారత వృద్ధిరేటు అంచనాలను తగ్గించిన విషయం తెలిసిందే. ఫిచ్‌ రేటింగ్స్‌ 7.8 శాతం నుంచి 7 శాతానికి; ఇండియా రేటింగ్స్‌ అండ్‌ రీసెర్చ్‌ 7 శాతం నుంచి 6.9 శాతానికి; ఏషియన్‌ డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ 7.5 శాతం నుంచి 7 శాతానికి కుదించాయి. గత ఏడాది భారత్‌ 8.7 శాతం వృద్ధిరేటును నమోదు చేసింది. ఈ ఆర్థిక సంవత్సరం 7.2 శాతం చొప్పున వృద్ధి చెందనుందని ఆర్‌బీఐ ఆగస్టులో ప్రకటించిన ద్వైమాసిక పరపతి విధాన సమీక్ష నిర్ణయాల్లో తెలిపింది.

ఈ ఆర్థిక సంవత్సరంలో ద్రవ్యోల్బణం సగటున 6.8 శాతంగా నమోదు కానుందని ఎస్‌అండ్‌పీ తెలిపింది. 2023 ఏప్రిల్‌ నుంచి ప్రారంభం కానున్న వచ్చే ఆర్థిక సంవత్సరంలో ధరల పెరుగుదల 5 శాతానికి తగ్గుతుందని అంచనా వేసింది. 2022 ఆఖరు వరకు ద్రవ్యోల్బణం 6 శాతం ఎగువనే ఉంటుందని తెలిపింది. గోధుమ, బియ్యంతో సహా ఇతర ఆహార పదార్థాల ధరలు పెరగడమే దీనికి దోహదం చేయనున్నట్లు పేర్కొంది. వినియోగదారుల ధరల ఆధారిత ద్రవ్యోల్బణ సూచీ ఆగస్టులో 7 శాతంగా నమోదైన విషయం తెలిసిందే. వరుసగా ఎనిమిదో నెలా ఆర్‌బీఐ గరిష్ఠ పరిమితి అయిన 6 శాతం ఎగువన నమోదైంది. మరోవైపు టోకు ధరల ఆధారిత ద్రవ్యోల్బణం వరుసగా 17వ నెల రెండంకెల్లో రికార్డయ్యింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని