Tesla: ‘టెస్లాకు ప్రత్యేక రాయితీలు భారత్‌కు అంత మంచిది కాదు’

భారత్‌లో టెస్లాకు ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేయడం దేశ ప్రయోజనాల అంత మంచిది కాదని ఓలా వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు....

Published : 04 Jul 2022 12:50 IST

ఓలా సీఈఓ భవీష్‌ అగర్వాల్‌

బెంగళూరు: విద్యుత్తు వాహన (EV) రంగంలో స్వదేశీ కంపెనీల వృద్ధిని వేగవంతం చేయడానికి ప్రభుత్వం కృషి చేస్తోంది. ఈ తరుణంలో భారత్‌లో టెస్లా (Tesla)కు ప్రత్యేక ప్రోత్సాహకాలను మంజూరు చేయడం దేశ ప్రయోజనాలకు అంత మంచిది కాదని ఓలా (Ola) వ్యవస్థాపకుడు భవీష్‌ అగర్వాల్‌ అభిప్రాయపడ్డారు. సాఫ్ట్‌ బ్యాంక్-మద్దతుగల ఓలా.. ముకేష్‌ అంబానీ నేతృత్వంలో రిలయన్స్ ఇండస్ట్రీస్, హ్యుందాయ్‌ సహా మరికొన్ని ఇతర కంపెనీలతో కలిసి స్థానికంగా బ్యాటరీ సెల్ ఉత్పత్తిని పెంచడానికి కేంద్ర ప్రభుత్వ 2.4-బిలియన్ డాలర్ల ప్రోగ్రామ్ కింద ఇటీవల టెండర్‌ను గెలుచుకుంది.

‘‘భారత్‌లో టెస్లా తమ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేసి విక్రయాలు జరుపుకోవచ్చు. కానీ, వారు ప్రత్యేక ప్రయోజనాలను ఆశిస్తున్నారు. ఇది దేశ ప్రయోజనాలకు అంతమంచిది కాదని నేను విశ్వసిస్తున్నాను’’ అని అగర్వాల్ అన్నారు. మరోవైపు మార్చిలో ఒక స్కూటర్‌లో మంటలు చెలరేగడంతో ఓలా తమ 1,400 స్కూటర్ల బ్యాచ్‌ని రీకాల్ చేసింది. దీనిపై అగర్వాల్‌ స్పందిస్తూ.. ఆ సంఘటన ‘ప్రత్యేకమైనదని’ పేర్కొన్నారు. అరుదైన సందర్భాల్లో ఇతర కంపెనీల విద్యుత్తు వాహనాల్లో జరిగినట్లుగానే ఇదీ జరిగిందన్నారు. విద్యుత్తు స్కూటర్ల అగ్నిప్రమాదాలపై మార్చిలో ప్రారంభించిన ప్రభుత్వ విచారణకు ఓలా సహకరిస్తోందని తెలిపారు.

టెస్లా ఇప్పటి వరకు భారత్‌లో తయారీ కార్యకలాపాలను ప్రారంభించలేదు. అయితే, ఆ కంపెనీ సీఈఓ ఎలాన్ మస్క్ మాత్రం తమ కార్ల విక్రయాలు, సర్వీసింగ్‌కు ముందు అనుమతి ఇవ్వని దేశాల్లో తయారీని ప్రారంభించబోమని మే నెలలో తేల్చి చెప్పారు. చైనాలో టెస్లా ఘన విజయాన్ని అందుకుంది. దీంతో ఆ దేశంలో విద్యుత్తు వాహనరంగం పుంజుకోవడానికి దోహదపడింది. బదులుగా, చైనా టెస్లాకు పలు పన్ను మినహాయింపులు ఇచ్చింది. అలాగే తక్కువ-వడ్డీ రుణాలతో సహా పలు ప్రోత్సాహకాలను అందించింది. భారత్‌లో కూడా మస్క్‌ ఈ తరహా ప్రయోజనాలను ఆశిస్తున్నారు.

జపాన్‌కు చెందిన సుజుకీ అనుబంధ సంస్థ మారుతీ సుజుకీ మినహా భారత్‌లో ఇతర విదేశీ వాహన కంపెనీలు పెద్దగా రాణించలేకపోయాయి. గత సెప్టెంబరులో అమెరికా కార్ల తయారీ సంస్థ ఫోర్డ్ భారతదేశంలో తయారీని నిలిపివేయాలని నిర్ణయించుకుంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని