Sri Lanka Crisis: ముదిరిన లంక సంక్షోభం.. వెల్లువెత్తిన ప్రజాగ్రహం.. 5 కీలక పాయింట్లు

శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. ఈ క్రమంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది....

Updated : 01 Apr 2022 14:57 IST

కొలంబో: శ్రీలంకలో ఆర్థిక సంక్షోభం రోజురోజుకీ ముదురుతోంది. నిత్యావసర వస్తువుల దిగుమతులకు విదేశీ మారక నిల్వలు లేవు. ఆకాశన్నంటిన ధరలు, ఆహార పదార్థాల కొరతతో ప్రజలు తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. ఇంధన సరఫరాలకు కూడా బిల్లులు చెల్లించలేని స్థాయికి అక్కడి ప్రభుత్వ ఆర్థిక పరిస్థితి దిగజారింది. ఈ క్రమంలో ప్రజాగ్రహం వెల్లువెత్తుతోంది. ప్రజలు వీధుల్లోకి వచ్చి ఆందోళనలు, నిరసనలు తెలుపుతున్నారు.

అధ్యక్ష భవనం ముట్టడి: రాజధాని కొలంబోలోని అధ్యక్షుడు రాజపక్స నివాసాన్ని గురువారం రాత్రి వేలాది మంది ముట్టడించారు. అధ్యక్ష బాధ్యతల నుంచి గొటబయా తప్పుకోవాలని డిమాండ్ చేశారు. రెండు వేల మందికిపైగా నిరసనకారులు అక్కడకు చేరుకోవడంతో పోలీసులు వారిని అడ్డుకున్నారు. దీంతో పోలీసులు, నిరసనకారుల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఐదుగురు పోలీస్ అధికారులు గాయపడ్డారు. ఓ బస్సు, పోలీస్ జీప్ సహా రెండు ద్విచక్రవాహనాలు దగ్ధమయ్యాయి. మరో రెండు ప్రాంతాల్లో ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. ఈ ఘటనలో ఓ మహిళ సహా 45 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

వారంతా రాజీనామా చేయాలి: నిరసనకారులు రాజపక్స కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని నినాదాలు చేస్తున్నారు. ప్రభుత్వంలో వివిధ బాధ్యతల్లో ఉన్న ఆ కుటుంబ సభ్యులంతా రాజీనామా చేయాలని డిమాండ్‌ చేస్తున్నారు. ‘పిచ్చివాళ్లంతా ఇంటి వెళ్లండి’ అని నినదిస్తూ తమ నిరసనను వ్యక్తం చేస్తున్నారు. అధ్యక్షుడు గొటబయ రాజపక్స పెద్ద సోదరుడు మహింద రాజపక్స ప్రధానిగా ఉన్నారు. మరో సోదరుడు బసిల్‌ ఆర్థికమంత్రిగా, ఇంకో సోదరుడు చమల్‌ వ్యవసాయశాఖ మంత్రిగా, మహింద కుమారుడు నమల్‌ క్రీడాశాఖమంత్రిగా ఉన్నారు.

డీజిల్‌ అమ్మకాలు నిలిపివేత: శ్రీలంకలో దేశవ్యాప్తంగా గురువారం డీజిల్‌ అమ్మకాలను నిలిపివేశారు. దీంతో ప్రయాణ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. కొన్ని ప్రాంతాల్లో పెట్రోల్‌  విక్రయిస్తున్నప్పటికీ.. చాలా పరిమిత స్థాయిలో అందజేస్తుండడం గమనార్హం. దీంతో చాలా మంది తమవంతు కోసం కార్లను క్యూ లైన్లలోనే వదిలేసి వెళ్లిపోతున్నారు.

బస్సులు బంద్‌: డీజిల్‌ విక్రయాల నిలిపివేతతో ప్రయాణ వ్యవస్థలు పూర్తిగా స్తంభించిపోయాయి. ముఖ్యంగా బస్సులు సర్వీసులు ఆగిపోయాయి. కేవలం అత్యవసర వాహనాలు మాత్రమే రోడ్లపై తిరుగుతున్నాయి. అయితే, ఇప్పటి వరకు నగరాలకే పరిమితమైన నిరసనలను గ్రామాలకు చేరకూడదనే ప్రభుత్వం బస్సు సర్వీసులుకు అంతరాయం కలగజేస్తోందన్న ఆరోపణలు వస్తున్నాయి. దేశంలో 60 శాతం ప్రజారవాణా ప్రైవేటు బస్సుల మీదే ఆధారపడి ఉంది. ఇంధన కొరతతో వారంతా బస్సులను నడపలేమని తేల్చి చెప్పారు.

వీధిదీపాల ఆర్పివేత: దేశవ్యాప్తంగా విద్యుత్తు కొరత తీవ్ర స్థాయిలో ఉంది. డీజిల్‌ అందుబాటులో లేకపోవడంతో జనరేటర్లను నడపలేమని విద్యుదుత్పత్తి సంస్థలు తేల్చి చెప్పాయి. దీంతో దాదాపు రోజుకు 13 గంటల విద్యుత్తు కోతలు అధికారికంగా చెలామణిలో ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఇది 18గంటల వరకు ఉన్నట్లు సమాచారం. ఇక విద్యుత్తు ఆదాకు చివరకు వీధి దీపాలను ఆర్పేయాల్సిన అవసరం ఏర్పడింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని