Sri Lanka Crisis: మా ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలింది: శ్రీలంక ప్రధాని

ఆహారం, ఇంధనం, విద్యుత్తు కొరతతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బుధవారం పార్లమెంటునుద్దేశించి శ్రీలంక ప్రధాని రణిల్‌ విక్రమసింఘే ప్రసంగిస్తూ అన్నారు....

Published : 22 Jun 2022 17:52 IST

కొలంబో: ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక (Sri Lanka Economic Crisis) పరిస్థితి రోజురోజుకీ మరింత దయనీయంగా మారుతోంది. ఇప్పటి వరకు అప్పులతో నెట్టుకొచ్చిన ఆ దేశానికి ఇప్పుడు ఆ మార్గాలు కూడా మూసుకుపోతున్నాయి. ఈ విషయాన్ని ఆ దేశ ప్రధాని రణిల్‌ విక్రమసింఘే (Ranil Wickremesinghe) స్వయంగా ప్రకటించారు. ఆహారం, ఇంధనం, విద్యుత్తు కొరతతో కొట్టుమిట్టాడుతున్న తమ దేశ ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని బుధవారం పార్లమెంటునుద్దేశించి ప్రసంగిస్తూ అన్నారు.

తమ దేశ పెట్రోలియం కార్పొరేషన్‌ భారీ ఎత్తున అప్పుల్లో కూరుకుపోయిందని విక్రమసింఘే (Ranil Wickremesinghe) ప్రకటించారు. దీంతో నగదు చెల్లించి కూడా ఇంధనాన్ని దిగుమతి చేసుకునే పరిస్థితులు లేవని తెలిపారు. పరిస్థితిని గాడిన పెట్టే అవకాశాన్ని కూడా ప్రభుత్వం కోల్పోయిందని పేర్కొన్నారు. ఆర్థిక వ్యవస్థ అత్యంత దయనీయ స్థితికి చేరే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయని ప్రకటించారు.

ఈ సందర్భంగా భారత్‌ (India) అందించిన ఆపన్నహస్తం గురించి విక్రమసింఘే ప్రస్తావించారు. ఇప్పటి వరకు ఇండియా 4 బిలియన్‌ డాలర్లు క్రెడిట్‌లైన్ (CreditLine) కింద ఇచ్చిందని పేర్కొన్నారు. మరింత సాయం చేయాలని కోరామన్నారు. భారత్‌ చేసిన ఆర్థిక సాయం దాతృత్వ విరాళాలు కాదని తెలిపారు. ఇంకా ఎంతకాలం భారత్‌ సాయం చేయగలదని నిర్వేదం వ్యక్తం చేశారు. వారి సాయానికి కూడా కొన్ని పరిమితులుంటాయని స్పష్టం చేశారు. అదే సమయంలో ఈ రుణసాయాన్ని చెల్లించే ప్రణాళికను సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

శ్రీలంక ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడం ద్వారానే ఈ సంక్షోభం నుంచి బయటపడగలమని విక్రమసింఘే ప్రకటించారు. అందుకు తొలుత విదేశీ మారక నిల్వల కొరతను పరిష్కరించాలన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను తిరిగి గాడిన పెట్టడం అంత సులభమైన అంశం మాత్రం కాదని తేల్చి చెప్పారు. అంతర్జాతీయ ద్రవ్య నిధితో చర్చలు జరపడం ఒక్కటే తమ ముందున్న సురక్షితమైన ప్రత్యామ్నాయని తెలిపారు. అదనపు సాయాన్ని పొందేలా ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.

తీవ్ర ఆర్థిక సంక్షోభంలో కూరుకుపోయిన శ్రీలంక ఏప్రిల్‌లో 7 బిలియన్‌ డాలర్ల విదేశీ రుణాన్ని ఎగవేస్తున్నట్లు ప్రకటించింది. 2026 నాటికి పలు దేశాలకు శ్రీలంక 25 బిలియన్‌ డాలర్లు చెల్లించాల్సి ఉంది. ఆ దేశానికి మొత్తం 51 బిలియన్‌ డాలర్ల విదేశీ అప్పులు ఉన్నాయి. వచ్చే సోమవారం అమెరికా ఆర్థిక విభాగం నుంచి తమ దేశానికి ప్రతినిధులు రానున్నారని విక్రమసింఘే ప్రకటించారు. జులై చివరి నాటికి ఐఎంఎఫ్‌తో అధికారిక ఒప్పందం కుదుర్చుకునేందుకు ప్రయత్నిస్తున్నామని తెలిపారు.

విక్రమసింఘే పార్లమెంటులో ప్రసంగిస్తున్న సమయంలోనే శ్రీలంకపై చర్యలు తీసుకోవాలని అమెరికాలో హామిల్టర్‌ రిజర్వు బ్యాంకు కేసు నమోదు చేసింది. వచ్చే నెల కాలపరిమితి ముగియనున్న బిలియన్‌ డాలర్ల బాండ్ల చెల్లింపులను ఇప్పటి వరకు చెల్లించలేదని తెలిపింది. తీవ్ర అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాజపక్స కుటుంబమే ఈ ఎగవేతకు కారణమని ఆరోపించింది. బిలియన్‌ డాలర్ల సంపదను పోగుచేసుకున్న ఆ కుటుంబం దుబాయ్‌, సీషెల్స్‌, మార్టిన్‌ బ్యాంకుల్లో డబ్బు దాచుకుందని తెలిపింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని