‘అందుకే భారత్‌తో డీల్‌ను రద్దు చేసుకున్నాం’

కొలంబో ఓడరేవు తూర్పు కంటెయినర్‌ టెర్మినల్‌(ఈసీటీ) అభివృద్ధి కోసం భారత్‌-జపాన్‌తో కుదుర్చున్న త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఏకపక్షంగా వెనకడుగు వేసిన శ్రీలంక అందుకు

Published : 13 Feb 2021 19:10 IST

ఓడరేవు అభివృద్ధి ఒప్పంద రద్దుపై శ్రీలంక

కొలంబో: కొలంబో ఓడరేవు తూర్పు కంటెయినర్‌ టెర్మినల్‌(ఈసీటీ) అభివృద్ధి కోసం భారత్‌-జపాన్‌తో కుదుర్చున్న త్రైపాక్షిక ఒప్పందం నుంచి ఏకపక్షంగా వెనకడుగు వేసిన శ్రీలంక అందుకు గల కారణాలను గురువారం అక్కడి పార్లమెంటుకు తెలిపింది. ఈ ఒప్పందంలో భాగంగా ఉన్న ఓ భారత కంపెనీ కొత్త నిబంధనలకు అంగీకరించని కారణంగానే డీల్‌ను రద్దు చేసుకోవాల్సి వచ్చిందంటూ సాకులు చెప్పుకొచ్చింది. ఈ మేరకు అక్కడి ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నకు పార్లమెంటులో ఆ దేశ నౌకాశ్రయాల అభివృద్ధి శాఖ మంత్రి రోహిత అభయగుణవర్ధణే  సమాధానం ఇచ్చారు. ఈ ఒప్పందం కుదిరిన వెంటనే దేశంలో వివిధ వర్గాల నుంచి నిరసన వ్యక్తమవడంతో క్యాబినెట్‌ సబ్‌ కమిటీ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కమిటీ ప్రతిపాదించిన కొత్త నిబంధనలకు భారత కంపెనీ అంగీకరించలేదని చెప్పుకొచ్చారు. అందువల్లే ఒప్పందాన్ని రద్దు చేసుకోవాల్సి వచ్చిందని తెలిపారు.

కొలంబో ఓడరేవు తూర్పు టెర్మినల్ అభివృద్ధికి భారత్-జపాన్‌-శ్రీలంక మధ్య 2019, మే నెలలో అవగాహనా ఒప్పదం కుదిరినట్లు ఫిబ్రవరి 4న విదేశాంగశాఖ అధికార ప్రతినిధి అనురాగ్‌ శ్రీవాస్తవ వెల్లడించారు. ఇటీవల అక్కడికి వెళ్లిన విదేశాంగ మంత్రి జైశంకర్‌ పర్యటనలో శ్రీలంక ప్రభుత్వం ఒప్పందాన్ని బలపర్చినట్లు తెలిపారు. వివిధ దేశాల సరకు రవాణాలో కీలకంగా ఉన్న కొలంబో పోర్టును అభివృద్ధి చేయడం వల్ల మూడు దేశాలకు ప్రయోజనకరంగా ఉంటుందని భావిస్తున్నామన్నారు. ఒప్పందంలో భాగంగా పోర్టును 49 శాతం వాటాతో భారత్, జపాన్ నిర్మించి నిర్వహిస్తాయని శ్రీలంక ప్రభుత్వం పేర్కొంది. కానీ భారత్‌ నుంచి అధికారిక ప్రకటన వెలువడిన మూడు రోజులకే శ్రీలంక మంత్రివర్గం సమావేశమై తూర్పు టెర్మినల్ నూరు శాతం శ్రీలంక పోర్ట్ అథారిటీ యాజమాన్యంలోనే ఉంటుందని తీర్మానించింది. కావాలంటే పశ్చిమ టెర్మినల్‌ను పబ్లిక్, ప్రైవేట్ భాగస్వామ్యం కింద భారత్, జపాన్ అభివృద్ధి చేయాలని ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించింది.

శ్రీలంకలో చైనా ప్రభావం రోజురోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే. తీసుకున్న రుణాలను చెల్లించడంలో విఫలమైన కారణంగా ఇప్పటికే చైనాకు శ్రీలంక హంబన్‌తోటా పోర్టును 99 సంవత్సరాలకు లీజుకి ఇచ్చిన విషయం తెలిసిందే. దీనితో పాటు శ్రీలంకలో చైనా అనేక ప్రాజెక్టులను చేపట్టింది. ఈ నేపథ్యంలో డ్రాగన్‌ ఒత్తిళ్లకు తలొగ్గే తూర్పు టెర్మినల్ అభివృద్ధి ఒప్పందాన్ని శ్రీలంక రద్దు చేసుకుందన్న ఆరోపణలు ఉన్నాయి.

ఇవీ చదవండి...

ప్రై‘వేటు’పై విమర్శలొస్తున్నా పట్టుదల ఎందుకు?

సర్కారు X రాహుల్‌ సరిహద్దు యుద్ధం!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని