Sri Lanka Crisis: శ్రీలంకకు భారత్‌ యూరియా ఎగుమతి

శ్రీలంకకు 65,000 మెట్రిక్‌ టకన్నుల యూరియాను సరఫరా చేసేందుకు భారత్‌ అంగీకరించింది....

Published : 14 May 2022 16:42 IST

కొలంబో: సంక్షోభంలో చిక్కుకున్న శ్రీలంకకు భారత్‌ అండగా నిలుస్తోంది. ఇప్పటికే 3 బిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్రకటించింది. తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. 65,000 మెట్రిక్‌ టన్నుల యూరియాను సరఫరా చేసేందుకు అంగీకరించింది. దీనికి దిల్లీలోని శ్రీలంక హై కమిషనర్‌ మిలింద మొరగొడ భారత్‌కు కృతజ్ఞతలు తెలిపారు. 

యూరియా ఎగుమతులపై భారత్‌లో నిషేధం కొనసాగుతోంది. కానీ, శ్రీలంక ప్రభుత్వ ప్రత్యేక విజ్ఞప్తి మేరకు అక్కడి పరిస్థితులు దృష్టిలో ఉంచుకొని సరఫరా చేసేందుకు అంగీకరించింది. ఈ 65 వేల మెట్రిక్‌ టన్నుల ఎగుమతిని తక్షణమే ప్రారంభించనున్నట్లు కేంద్ర ఎరువుల విభాగం కార్యదర్శి రాజేశ్‌ కుమార్‌ చతుర్వేది తెలిపారు. ఈ యూరియాను ‘యాలా’గా పిలిచే మే-ఆగస్టు సీజన్‌లో వరిసాగుకు ఉపయోగించనున్నట్లు శ్రీలంక హైకమిషన్‌ వెల్లడించింది. ఈ ఎగుమతులను క్రెడిట్‌ లైన్‌ కింద నిరంతరాయంగా కొనసాగించాలని నిర్ణయించినట్లు తెలిపింది. 

సేంద్రియ సాగును ప్రోత్సహించడంలో భాగంగా గత ఏడాది శ్రీలంక ప్రభుత్వం కృత్రిమ ఎరువులపై నిషేధం విధించింది. కానీ, కావాల్సిన స్థాయిలో సేంద్రియ ఎరువులు అందుబాటులో లేకపోవడంలో పంట దిగుబడులు గణనీయంగా పడిపోయాయి. ముఖ్యంగా వరి, తేయాకు దిగుబడులు పూర్తిగా దెబ్బతిన్నాయి. వాతావరణం కూడా అనుకూలించకపోవడంతో ఆహార కొరత ఏర్పడింది. ఫలితంగా ధరలు పెరిగి ద్రవ్యోల్బణం కొండెక్కింది. 

మరోవైపు విదేశీ మారక నిల్వలు పూర్తిగా అడుగంటిపోవడంతో నిత్యావసరాల దిగుమతులకు కూడా నిధులు లేక శ్రీలంక పూర్తి సంక్షోభంలోకి కూరుకుపోయింది. ఈ ద్వీపదేశంలో దాదాపు 20 లక్షల మందికి పైగా రైతులు ఉన్నారు. అలాగే 2.2 కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో దాదాపు 70 శాతం మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. ఎరువుల దిగుమతికి ఆ దేశానికి ఏటా దాదాపు 400 మిలియన్‌ డాలర్లు అవసరమని అంచనా.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని