SSY: సుకన్య సమృద్ధి యోజన పథకం గురించి ఈ విషయాలు మీకు తెలుసా?

సుకన్య సమృద్ధి యోజన ఖాతాదారులు తమకు డబ్బు అవసరమైనప్పుడు రుణం పొందడానికి అవకాశముంటుందా? ఖాతా ఉపసంహరణకు ఎలాంటి నియమాలు ఉంటాయి? ఇప్పుడు చూద్దాం.

Published : 24 Feb 2023 13:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: సుకన్య సమృద్ధి యోజన గురించి దాదాపు అందరూ వినే ఉంటారు. అయితే, ఇందులో కొన్ని విషయాల గురించి పెద్దగా అవగాహన ఉండకపోవచ్చు. వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

పథకం ముఖ్యాంశాలు

సుకన్య సమృద్ధి ఖాతా అనేది బాలికల కోసం ప్రభుత్వ మద్దతుతో కూడిన పొదుపు పథకం. ఈ పథకంపై వడ్డీ ప్రస్తుతం 7.60% లభిస్తుంది. బాలికలకు 10 సంవత్సరాల వయసు వచ్చే వరకు ఈ ఖాతాను తెరవొచ్చు. ఒక బాలికకు ఒక ఖాతా మాత్రమే తెరవడానికి అవకాశం ఉంటుంది. కుటుంబంలో ఇద్దరు బాలికల వరకు ఖాతా తెరిచే అనుమతి ఉంటుంది. ఖాతాను పోస్టాఫీసు లేదా అనుమతి ఉన్న బ్యాంకుల శాఖలలో తెరవొచ్చు. ఖాతాను తెరిచేటప్పుడు బాలిక జనన ధ్రువీకరణ పత్రం సమర్పించాలి. ఖాతాను భారతదేశం అంతటా ఎక్కడికైనా బదిలీ చేయొచ్చు. ఖాతా 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మెచ్యూర్‌ అవుతుంది.

దీనిపై రుణం పొందొచ్చా?

ఈ పథకంపై రుణం పొందలేరు, పాక్షిక ప్రీ-మెచ్యూర్‌ ఉపసంహరణకు మాత్రమే అనుమతి ఉంటుంది. అది కూడా అమ్మాయి పెళ్లి లేదా ఉన్నత విద్య కోసం అవసరమైన ఖర్చుల నిమిత్తం పాక్షిక ఉపసంహరణ చేయొచ్చు. సుకన్య సమృద్ధిలో బాలిక సంక్షేమం, భవిష్యత్‌ కోసం మాత్రమే ఉపసంహరణ అనుమతిస్తారు. ఏ ఇతర ప్రయోజనం కోసం ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసే సౌకర్యం ఉండదు.

కనీస/ గరిష్ఠ డిపాజిట్‌ ఎంత?

ఏడాదికి కనీసం రూ.250 చెల్లించాలి. గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు కూడా చెల్లించొచ్చు. ఖాతా లాక్‌-ఇన్‌ వ్యవధి 21 సంవత్సరాలు పూర్తయ్యే వరకు డిపాజిట్లు చేయాలి.

బహుళ డిపాజిట్లకు అనుమతి ఉంటుందా?

ఒక ఆర్థిక సంవత్సరంలో రూ.100 కంటే ఎక్కువ మొత్తాన్ని ఎన్నిసార్లయినా డిపాజిట్‌ చేయొచ్చు. అయితే, ఆ సంవత్సరంలో గరిష్ఠ డిపాజిట్‌ మొత్తం రూ.1.50 లక్షలు దాటకూడదు.

డిపాజిట్‌ చేయకపోతే?

ఖాతాలో ఏదైనా ఏడాది కనీస డిపాజిట్‌ చేయకపోతే జరిమానాగా రూ.50 విధిస్తారు. అలాగే ఖాతా ‘డిపాల్ట్‌ ఖాతా’గా మారుతుంది, అయినప్పటికీ, అప్పటికే ఉన్న డిపాజిట్‌పై వడ్డీ వస్తూనే ఉంటుంది.

ఖాతాను ఎలాంటి పరిస్థితుల్లో మూసివేయొచ్చు?

అమ్మాయి వివాహం, పౌరసత్వంలో మార్పు, దేశంలో నివాసం లేకపోవడం మొదలైన అనేక కారణాల వల్ల తల్లిదండ్రులు ఖాతాను ముందుగానే మూసివేయొచ్చు. అయితే, అటువంటి అభ్యర్థన చేయడానికి ముందు కనీసం 5 సంవత్సరాలు ఖాతాను నిర్వహించాలి. ఖాతాదారు (బాలిక) మరణించిన సందర్భంలో లేదా ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నప్పుడు కూడా ఖాతాను ముందుగానే మూసివేయొచ్చు.

ఈ పథకం పన్ను రహితమా?

డిపాజిట్లపై గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు సెక్షన్‌ 80సి కింద ఆదాయ పన్ను మినహాయింపు ఉంటుంది. వడ్డీపై ఆదాయ పన్ను ఉండదు. మధ్యలో ఉపసంహరణ, మెచ్యూర్‌ అయ్యే సమయానికి వచ్చే మొత్తం రాబడిపై ఎలాంటి ఆదాయ పన్ను ఉండదు.

ముందుగానే పాక్షిక విత్‌డ్రా చేయొచ్చా?

మొత్తం నిల్వలో 50% వరకు ఖాతా నుంచి పాక్షికంగా విత్‌డ్రా చేసుకోవచ్చు. అమ్మాయికి 18 ఏళ్ల వయసు వచ్చిన తర్వాత, ఉన్నత విద్య కోసం 50% వరకు అకాల ఉపసంహరణకు అనుమతి ఉంటుంది. ఉపసంహరణను ఒకేసారి లేదా వాయిదాల్లో చేయవచ్చు. దీనికి 10వ తరగతి సర్టిఫికెట్‌ రుజువు అవసరం.

మెచ్యూర్‌ అయిన తర్వాత ఖాతాను కొనసాగించవచ్చా?

ఈ ఖాతా కాలవ్యవధి 21 సంవత్సరాలు. మెచ్యూరిటీ తర్వాత మొత్తాన్ని పూర్తిగా ఉపసంహరించుకోవచ్చు. లేదా బ్యాలెన్స్‌పై వడ్డీని పొందడానికి ఖాతాను అలాగే ఉంచొచ్చు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని