Starbucks: ‘వాళ్లందరినీ తీసేయ్‌’.. స్టీవ్‌జాబ్స్‌ చెప్పిన సలహా ఇదే: స్టార్‌బక్స్‌ మాజీ సీఈఓ

Starbucks: తన లీడర్‌షిప్‌ బృందం మొత్తాన్ని ఉద్యోగంలో నుంచి తీసేయమని స్టీవ్‌ జాబ్స్‌ సలహా ఇచ్చినట్లు స్టార్‌బక్స్‌ మాజీ సీఈఓ వెల్లడించారు.

Updated : 08 Jul 2024 17:14 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: యాపిల్‌ సహ వ్యవస్థాపకుడు స్టీవ్‌ జాబ్స్‌ ఇచ్చిన సలహాకు షాక్‌కు గురైనట్టు తెలిపారు స్టార్‌బక్స్‌ ఫౌండర్‌, మాజీ సీఈఓ హావద్‌ షుల్ట్స్‌. కంపెనీలోని లీడర్‌షిప్‌ టీమ్‌ మొత్తాన్ని విధుల నుంచి తొలగించమని స్టీవ్‌ చెప్పినట్లు తెలిపారు. ఆయన అలా ఎందుకన్నారో కొన్ని నెలల తర్వాత అర్థమైందన్నారు. ఓ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడుతూ స్టీవ్‌తో సమావేశాన్ని గుర్తుచేసుకున్నారు.

‘‘మొబైల్‌ ఆర్డర్లు, ఇతర అంశాలకు సంబంధించి 2008లో స్టార్‌బక్స్‌, యాపిల్‌ సంయుక్తంగా ఓ సమావేశాన్ని ఏర్పాటు చేశాయి. అనంతరం  మేమిద్దరం క్యాంపస్‌ గార్డెన్‌లో నడుస్తూ మాట్లాడుకుంటుండగా.. నా కంపెనీ సమస్యల గురించి ఆయనకు వివరించా. అప్పుడు ఆయన నన్ను ఆపి.. ‘నువ్వు చేయాల్సింది ఒక్కటే..! మీ లీడర్‌షిప్‌ టీమ్‌ మొత్తాన్ని విధుల్లో నుంచి తొలగించు’ అని అన్నారు. ఆయన జోక్‌ చేస్తున్నారేమో అనుకున్నా. కానీ, ‘వాళ్లందరినీ తీసేయ్‌’ అంటూ గట్టిగా చెప్పారు. అలా చేస్తే పని ఎలా జరుగుతుంది? అందరినీ ఒకేసారి ఎలా తొలగిస్తాం? అని స్టీవ్‌ను అడిగా. ‘నువ్వు తీసినా తీయకపోయినా వారు ఆరు నెలలు లేదా తొమ్మిది నెలల్లో వెళ్లిపోతారు’ అని ఆయన సమాధానమిచ్చారు’’ అని హావద్‌ షుల్ట్స్‌ వెల్లడించారు.

‘బడ్జెట్‌’లో సొంతిల్లు.. ప్రభుత్వ సహకారం అందేనా?

‘‘ఆయన చెప్పిందే నిజమైంది. జనరల్ కౌన్సిల్‌ మినహా మా టీమ్‌లోని అందరూ ఉద్యోగం మానేసి వెళ్లిపోయారు. ఈ భేటీ జరిగిన కొద్ది నెలల తర్వాత ఓ వేదికపై మేమిద్దరం మళ్లీ కలిశాం. ‘వాళ్లంతా వెళ్లిపోయారు’ అని నేను చెబితే.. ‘నువ్వు ఆరు నెలలు లేట్‌’ అని స్టీవ్‌ అన్నారు’’ అంటూ నాటి సంభాషణను గుర్తుచేసుకున్నారు.

స్టార్‌బక్స్‌ వ్యవస్థాపకుడైన హావద్‌ షుల్ట్స్‌ 1986-2000, 2008-2017 మధ్య కంపెనీ ఛైర్మన్‌, సీఈఓగా వ్యవహరించారు. ఆ తర్వాత 2022 నుంచి 2023 వరకు తాత్కాలిక సీఈఓగా బాధ్యతలు చేపట్టారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని