Starbucks: స్టార్‌బక్స్‌ సీఈఓగా లక్ష్మణ్ నరసింహన్.. మరో అంతర్జాతీయ కంపెనీకి భారతీయుడి నేతృత్వం

మరో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి భారత సంతతి వ్యక్తి నేతృత్వం వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా...

Updated : 02 Sep 2022 13:14 IST

వాషింగ్టన్‌: మరో ప్రముఖ అంతర్జాతీయ కంపెనీకి భారత సంతతి వ్యక్తి నేతృత్వం వహించబోతున్నారు. ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన కాఫీ వ్యాపార సంస్థ స్టార్‌బక్స్‌ (Starbucks) తమ సీఈఓగా లక్ష్మణ్‌ నరసింహన్‌ (Laxman Narasimhan)ను ప్రకటించింది. ప్రస్తుతం ఆయన యూకే కేంద్రంగా పనిచేస్తున్న రెకిట్‌ బెంకిజర్‌కు సీఈఓగా ఉన్నారు. ఈ కంపెనీ నుంచి సెప్టెంబరు 30న నిష్క్రమిస్తున్నట్లు ఆయన గురువారం ప్రకటించారు. గత మూడేళ్లుగా ఇక్కడ బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

స్టార్‌బక్స్‌కి ముందు..

రెకిట్‌కు ముందు నరసింహన్‌ (55) ప్రముఖ సాఫ్ట్‌ డ్రింక్స్‌ సంస్థ పెప్సికో కంపెనీలో వివిధ నాయకత్వ హోదాల్లో పనిచేశారు. స్టార్‌బక్స్‌, పెప్సీకో మధ్య సుదీర్ఘకాలంగా పలు అంశాల్లో ఒప్పందం ఉన్న విషయం తెలిసిందే. వీటిలో కొన్ని నరసింహన్‌ పెప్సీకో లాటిన్‌ అమెరికా విభాగానికి సీఈఓగా వ్యవహరిస్తున్న సమయంలో కుదిరాయి. అక్టోబరులో నరసింహన్‌ (Laxman Narasimhan) స్టార్‌బక్స్‌(Starbucks)లో చేరతారు. ఏప్రిల్‌లో సీఈఓ బాధ్యతల్ని స్వీకరిస్తారు. అప్పటి వరకు ప్రస్తుతం ఆ హోదాలో ఉన్న హోవర్డ్‌ షూల్జ్‌ కొనసాగుతారు. నరసింహన్‌ సీఈఓగా చేరిన తర్వాత కూడా షూల్జ్‌ కంపెనీ బోర్డులో ఉంటారు.

ఐదేళ్ల తర్వాత కెవిన్‌ పీటర్సన్‌ స్టార్‌బక్స్‌ సీఈఓ బాధ్యతల నుంచి తప్పుకోవడంతో షూల్జ్‌ ఏప్రిల్‌లో తాత్కాలికంగా ఆ హోదాలో చేరారు. అప్పటి నుంచి కంపెనీ దీర్ఘకాల సీఈఓ కోసం వేట ప్రారంభించింది. కంపెనీ బయటి వ్యక్తిని తీసుకోవాలని నిర్ణయించి.. చాలా మంది వ్యక్తుల్ని ఇంటర్వ్యూ చేసింది. నరసింహన్‌కు ఉన్న అనుభవం దృష్ట్యా స్టార్‌బక్స్‌ పునర్నిర్మాణాన్ని సమర్థంగా ముందుకు నడిపించగలరని భావించినట్లు కంపెనీ ఓ ప్రకటనలో పేర్కొంది.

అనేక సవాళ్లు..

సీఈఓగా నరసింహన్‌ స్టార్‌బక్స్‌లో అనేక సవాళ్లను ఎదుర్కోనున్నారు. మెరుగైన ప్రయోజనాల కోసం అమెరికాలో కంపెనీ ఉద్యోగులు పెద్ద ఆందోళన చేస్తున్నారు. దీంతో కంపెనీ అనేక న్యాయపరమైన చిక్కులు ఎదుర్కొంటోంది. అమెరికా తర్వాత అతిపెద్ద మార్కెట్‌గా ఉన్న చైనాలో కంపెనీ ఇంకా కొవిడ్‌ ఆంక్షల నుంచి కోలుకోవాల్సి ఉంది. మరోవైపు కరోనా సంక్షోభం తర్వాత మారిన వినియోగదారుల అభిరుచులకు అనుగుణంగా కంపెనీని తీర్చిదిద్దాల్సి ఉందని ఇటీవల షూల్జ్‌ తెలిపారు. దానికోసం కంపెనీ వ్యాపారంలో అనేక కీలక మార్పులు తీసుకురావాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ఇదీ ఆయన ప్రస్థానం..

లక్ష్మణ్‌ నరసింహన్‌ 1957 ఏప్రిల్‌ 15న పుణెలో జన్మించారు. కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్ పుణె నుంచి మెకానికల్‌ ఇంజినీరింగ్‌లో డిగ్రీ పొందారు. యూనివర్శిటీ ఆఫ్‌ పెన్సిల్వేనియాకు చెందిన లాడర్‌ ఇన్‌స్టిట్యూట్‌ నుంచి జర్మన్‌, ఇంటర్నేషన్‌ స్టడీస్‌లో ఎంఏ పట్టా తీసుకున్నారు. అదే యూనివర్శిటీకి చెందిన వార్టన్‌ స్కూల్‌లో ఎంబీఏ కూడా పూర్తిచేశారు. అనంతరం ప్రముఖ అంతర్జాతీయ సంస్థ మెకిన్సీలో ఉద్యోగంలో చేరారు. అక్కడే దిల్లీ ఆఫీస్‌ డైరెక్టర్‌, లోకేషన్‌ మేనేజర్‌ స్థాయికి ఎదిగారు. 19 ఏళ్ల సుదీర్ఘ అనుభవం తర్వాత అక్కడి నుంచి బయటకు వచ్చి పెప్సీకోలో చేరారు. ఈ కంపెనీలో సీసీఓ స్థాయికి చేరారు. అనంతరం రెకిట్‌ బెంకిజర్‌లో సీఈఓగా నియమితులయ్యారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని