Updated : 09 Jun 2022 14:58 IST

Financial Planning: సంపాదనతో పాటు పెట్టుబడులూ ప్రారంభించండి!

ఇంటర్నెట్‌ డెస్క్‌: సాధారణంగా చదువు పూర్తి చేసుకుని 20 ఏళ్లలోనే చాలామంది సంపాదన మొదలు పెడుతుంటారు. ఉద్యోగంలో చేరి సంపాదన ప్రారంభించిన కొత్తల్లో భవిష్యత్తు అవసరాలు గానీ, వాటికి ఎప్పుడు? ఎంత మొత్తం అవసరమవుతుందో పెద్దగా అవగాహన ఉండదు. కాబట్టి, వచ్చిన ఆదాయాన్ని పొదుపు, పెట్టుబడులకు మళ్లించకుండా ఖర్చు చేసేస్తుంటారు. ఇది సరియైన పనికాదు.

బాధ్య‌త‌లు లేవని పొదుపు మానొద్దు..
ముందే చెప్పుకున్నట్లు 24, 25 ఏళ్ల వయసులో సంపాదన ప్రారంభమైతే..ఆ వయసులో ఉన్నప్పుడు తల్లిదండ్రులు కూడా ఆర్జిస్తారు కాబట్టి కుటుంబ బాధ్యతలు ఎక్కువగా ఉండకపోవచ్చు. అదీగాక ఉద్యోగం కోసం తల్లిదండ్రుల వద్ద కాకుండా వేరే చోట నివసించాల్సి వస్తుంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ కూడా ఉండదు కాబట్టి ఎక్కువ డబ్బు విందులు, ఇతర విలాసాల కోసం ఖర్చు చేసే అవకాశం ఉంటుంది. వివాహం అయిన తర్వాత బాధ్యతలు మొదలవుతాయి. ఖర్చులు పెరగడం వల్ల పొదుపు లేదా మదుపు చేసే ఆస్కారం తక్కువ ఉండొచ్చు లేదా అస్సలు ఉండకపోవచ్చు. అందువల్ల ముందు నుంచే పొదుపు చేయడం మంచిది.

ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు..?
పొదుపు/ మదుపు చేయడానికి ఇంకా చాలా సమయం ఉంది.. ఇప్పుడు ఆనందించకపోతే ఇంకా ఎప్పుడు ఆనందిస్తాం వంటి ఆలోచనలు.. అనేక రకాల వస్తువుల, విలాసాల ఆకర్షణలకు ఎక్కువ ఖర్చు చేసేలా చేస్తాయి. పొదుపు గురించి ఆలోచించనివ్వవు. కాలం గడిచే కొద్దీ పెరుగుతున్న ఖర్చుల కారణంగా పొదుపు శక్తి తగ్గిపోతుంది. అప్పుడు పెట్టుబడులు చేయడం సాధ్యం కాదు. 
అందువల్ల పెట్టుబడులు చేసే విషయంలో ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు అని ఆలోచించండి. బాధ్యతలు లేనందువల్ల ఖర్చు తక్కువ... కాబట్టి ఇప్పుడే పొదుపు చేయగలం. ఇప్పుడు నష్టభయాన్ని అధిగమించి పెట్టుబడులు చేయగలరని గుర్తుంచుకోవాలి.

సంపాదించగలమనే ధీమా వద్దు: చాలా మంది భవిష్యత్తులో మరింతగా సంపాదించగలం అనే ధీమాతో ఉంటారు. ఇది మంచిదే. నమ్మకం మంచిదే గానీ ఇది పరిమితంగా ఉండాలి. ఎందుకంటే, ఏ రోజు ఎలా ఉంటుందో మనం ఊహించలేం. గత రెండు సంవత్సరాలుగా ప్రపంచం ఎదుర్కున్న కరోనా సమస్య ఇందుకు ఉదాహరణ. అదీగాక మన సంపాదన పెరుగుతున్న కొద్దీ జీవన శైలి అలవాట్లు మారే అవకాశం ఉంటుంది. ఇంకా ద్ర‌వ్యోల్బ‌ణ ప్ర‌భావంతో నేడు రూ.100కి వ‌చ్చే వ‌స్తువు కోసం రేప‌టి రోజున రూ.120 ఖ‌ర్చు చేయాల్సి రావ‌చ్చు. అందువ‌ల్ల‌ సంపాద‌న‌తోపాటే ఖర్చు పెరుగుతుందని గుర్తుంచుకోండి.

వాయిదా వేయకండి: కొంత మంది కచ్చితమైన ప్రణాళిక‌తో పొదుపు, మదుపు మొదలు పెడదామనుకుంటే రోజులు, నెలలు, సంవత్సరాలు కూడా గడిపేస్తుంటారు. కానీ ప్రణాళిక వేయరు.. పెట్టుబడులు ప్రారంభించరు. ఆర్థిక లక్ష్యాల సాధనకు ప్రణాళిక అవసరమే. అయితే, కచ్చితమైన ప్రణాళిక ఉండాలని ఆలోచిస్తూ పెట్టుబడులను ఆలస్యం చేస్తూ పోతే భవిష్యత్‌ రాబడిని కోల్పోతారు.

  • ఉదా: మీరు 25 ఏళ్ల వ‌య‌సులో ప్ర‌తి నెలా రూ.5 వేలు మ‌దుపు చేస్తున్నారునుకుందాం. 8 శాతం రాబ‌డి అంచ‌నాతో 60 ఏళ్లు వ‌చ్చే స‌రికి సుమారు రూ.1.15 కోట్లు కూడ‌బెట్ట‌గ‌ల‌రు. ఇందులో మీరు పెట్టుబ‌డి పెట్టే మొత్తం రూ. 21 ల‌క్ష‌లు మాత్ర‌మే. రాబ‌డి రూ. 94 ల‌క్ష‌లు.
  • అదే 30 ఏళ్ల వ‌య‌సులో రూ.7 వేల‌తో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే, అదే 8 శాతం రాబ‌డి అంచ‌నాతో 60 ఏళ్లు వ‌చ్చే స‌రికి సుమారు రూ. 1.05 కోట్లు వ‌ర‌కు స‌మ‌కూర్చ‌గ‌ల‌రు. ఇందులో మీరు పెట్టుబ‌డి పెట్టే మొత్తం రూ.25.20 ల‌క్ష‌లు.. రాబ‌డి సుమారు రూ.79.82 ల‌క్ష‌లు.
  • అదే 35 ఏళ్ల వ‌య‌సులో రూ.11 వేల‌తో పెట్టుబ‌డులు ప్రారంభిస్తే, అదే 8 శాతం రాబ‌డి అంచ‌నాతో 60 ఏళ్లు వ‌చ్చే స‌రికి సుమారు రూ.1.05 కోట్ల‌ వ‌ర‌కు స‌మ‌కూర్చ‌గ‌ల‌రు. ఇందులో మీరు పెట్టుబ‌డి పెట్టే మొత్తం రూ.33 ల‌క్ష‌లు.. రాబ‌డి సుమారు రూ.72.31 ల‌క్ష‌లు.

పై ఉదాహ‌ర‌ణ‌లో చూస్తే.. పెట్టుబ‌డులు ఐదేళ్లు లేదా పదేళ్లు ఆల‌స్యం చేయ‌డం వ‌ల్ల.. నెల‌వారీ మ‌దుపు మొత్తం పెంచిన‌ప్ప‌టికీ  రాబ‌డి మాత్రం త‌గ్గుతుంది. ఇదే చక్ర వడ్డీ ప్ర‌భావం. కాబ‌ట్టి, పెట్టుబ‌డుల‌ను వాయిదా వేయ‌కండి. మీకు తెలిసినంతలో సరళంగా ప్రారంభించండి. అవ‌స‌ర‌మ‌నుకుంటే ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోండి.

బాధ్య‌త‌లు పెరిగితే పొదుపు శక్తి తగ్గొచ్చు: వివాహంతో ఒక కొత్త వ్య‌క్తి మీ జీవితంలోకి వ‌స్తారు. ఆ త‌ర్వాత‌ పిల్లలు కలిగి, వారి పోషణ, విద్యా ఖర్చులు అంటూ ప్రతి సంవత్సరం ఖ‌ర్చులు పెరుగుతూనే ఉంటాయి. కాబట్టి, అప్పుడు ఎక్కువగా పొదుపు చేయలేకపోవచ్చు. ఇక పదవీ విరమణ తర్వాత సంపాదన ఆగిపోతుంది. పెన్ష‌న్‌గా ప్రతి నెలా కొంత మొత్తం వచ్చినా ఆ మొత్తం మీ జీవన శైలికి సరిపోకపోవచ్చు. అందువల్ల ముందు నుంచే పొదుపు చేసి పెట్టుబడులు పెడితే జీవితంలోని ముఖ్య‌మైన స‌మ‌యాల్లో డ‌బ్బు కోసం ఇబ్బంది ప‌డ‌కుండా తగిన నిధిని సమకూర్చుకోగలుగుతారు.

కలలు సాకారం చేసుకోవాలంటే?: భవిష్యత్‌ కలలు సాకారం చేసుకోవాలంటే.. సంపాదన ప్రారంభమైన నాడే కొద్ది మొత్తంతోనైనా మదుపు మొదలు పెట్టాలి. ప్రతి ఏడాదీ వయసు, అనుభవంతోపాటు ఆదాయంలో కూడా పెరుగుదల ఉంటుంది కాబట్టి, మదుపు మొత్తాన్ని పెంచుకుంటూ ఉండాలి. మదుపు ఎంత తొందరగా మొదలుపెడితే, దీర్ఘకాలంలో చక్రవడ్డీ ప్రభావంతో అంత అధిక మొత్తంలో లాభపడవచ్చు.

Read latest Business News and Telugu News

Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat, and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని