Investments: మొద‌టి జీతంతోనే పెట్టుబ‌డులు ప్రారంభించండి..

యుక్త వ‌య‌సులో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అనిపిస్తుంది. వారి దగ్గర కావాల్సినంత సమయం ఉంటుంది.

Updated : 03 Feb 2022 16:34 IST

ఎంత తొందరగా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే… అంత తొందరగా  మీరు అనుకున్న ఆర్థిక లక్ష్యాలను చేర‌కోవ‌చ్చు. చాలామంది వివాహం అయ్యి, పిల్లలు పుట్టాక, భ‌ద్య‌త‌లు పెరిగాక‌, పిల్ల‌ల భ‌విష్య‌త్తు కోసం అప్పుడు పెట్టుబ‌డులు పెడ‌తారు. కానీ, అప్పటికే ఆలస్యం అవుతుంది. ఎందుకంటే ల‌క్ష్యానికి నిర్ణీత స‌మయం మాత్ర‌మే ఉంటుంది. పైగా, ఖ‌చ్చితంగా డ‌బ్బు స‌మ‌కూర్చుకోవాలి. దీంతో రిస్క్ తీసుకునే శ‌క్తి క్ర‌మీణ త‌గ్గుతుంది. పెట్టుబ‌డులు ఆచితూచి ఎంచుకుంటారు. రిస్క్ ఎక్కువ‌గా ఉండే పెట్టుబ‌డుల జోలికి పోరు. 

కానీ యువకులు అలా కాదు. యుక్త వ‌య‌సులో ఉన్నప్పుడు ఏదైనా సాధ్యం అనిపిస్తుంది. ఎందుకంటే… వారి దగ్గర కావాల్సినంత సమయం ఉంటుంది. అసలు అదే వారికి శక్తి. ఉద్యోగంలో చేరిన కొత్తలోనే కొంత డబ్బును పెట్టుబడి పెట్టేందుకు కొంత ఇబ్బంది అనిపించవచ్చు. కానీ, ఇది మీరు పెట్టుబడులు ప్రారంభించేందుకు అడ్డంకిగా మాత్రం మారకూడదు. మీరు ఆర్జించిన మొదట్లో కొన్నేళ్లపాటు చేసిన మదుపు… భవిష్యత్తులో పెద్ద ఎత్తున సంపద సృష్టించడానికి బాటలు వేస్తుందని గుర్తుంచుకోవాలి. 

20 ఏళ్ల వయసులో పెట్టుబడుల ప్రపంచంలోకి అడుగుపెట్ట‌డం జీవితంలో గొప్ప మలుపునకు శ్రీకారం అని చెప్పుకోవచ్చు. వేత‌నం త‌క్కువే అయినా, విద్యారుణం ఉన్నా, కొద్ది మొత్తంలోనైనా మ‌దుపు చేసి.. పెట్టుబ‌డుల‌ను అలావాటు చేసుకోవాలి. ఈ రోజుల్లో యువ‌త‌ జీవితం ప‌ట్ల ఉన్న‌త‌మైన ఆలోచ‌న‌లతో ఉంటున్నారు. ప్రారంభంలోనే మంచి కొలువుల‌ను సాధిస్తున్నారు. మంచి వేత‌నంతోనే క‌ళాశాల నుంచి బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. ఉద్యోగం సాధించ‌డంలోనే కాదు మ‌దుపు విష‌యంలోనూ ప్రణాళికాయుతంగా ఉండాల‌ని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం స‌రైన పెట్టుబ‌డి మార్గాల కోసం  అన్వేషిస్తున్నారు. క్ర‌మ‌శిక్ష‌ణతో మ‌దుపు చేయ‌డం అల‌వాటు చేసుకునేందుకు మ్యూచువ‌ల్ ఫండ్ల‌ను ఎంచుకోవ‌చ్చు.

వ్యక్తిగత జీవితంలోనైనా, పెట్టుబడుల్లోనైనా అనిశ్చితి సహజం. ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలన్నీ ఒకదానితో ఒకటి అల్లుకుపోయాయి. ప్రపంచంలో ఒక మూలన ఏదైనా ఇబ్బంది ఏర్పడితే… దాని ప్రభావం రెండో వైపు ఉంటోంది. ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్లూ దానికి అనుగుణంగా స్పందించి ఒడిదుడుకుల‌కు లోన‌వుతూ ఉంటాయి. వీటి గురించి ఆందోళ‌న చెంద‌కుండా..క్ర‌మం తప్పకుండా మదుపు చేసే అలవాటు చేసుకోవాలి. సంపాదన మొదలు పెట్టినప్పుడే, సరైన ఆర్థిక ప్రణాళికలు వేసుకుని, ముందుకు వెళ్తే.. కావాల్సినంత సొమ్ము ఎప్పుడూ మీ దగ్గర అందుబాటులో ఉండేలా చూసుకోవచ్చు. 

చిన్న వయసులో ఉన్నప్పుడు కాస్త నష్టం వచ్చినా తట్టుకునే శక్తి ఉంటుంది. కాబట్టి, పెట్టుబడుల్లో 80 శాతం వరకూ ఈక్విటీలకు కేటాయించినా ఇబ్బంది ఉండదు. దీర్ఘకాలంలో పెట్టుబడులు సంపదను సృష్టించేందుకు తోడ్ప‌డ‌తాయి కాబ‌ట్టి వీటిపై కాస్త అధికంగానే దృష్టి పెట్టాలి. వీటిని ఎంత తొందరగా ప్రారంభిస్తే అంత‌ వేగంగా మనం వృద్ధి చెందవ‌చ్చు. అయితే, మొద‌టిసారి పెట్టుబ‌డులు పెట్టేవారు ఈక్విటీల్లో నేరుగా మదుపు చేసే బదులు మ్యూచువల్‌ మార్గంలో వెళ్లడం ఆచరణీయం.

మ్యూచువల్‌ ఫండ్లు వైవిధ్యమైన పెట్టుబడికి అవకాశం కల్పిస్తాయి. అదే సమయంలో ఇవి నిపుణుల పర్యవేక్షణలో పనిచేస్తాయి. అనేక రకాల పెట్టుబడి మార్గాలను ఎంచుకోవడంతో నష్టభయం కూడా తక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని తట్టుకునేలా రాబడిని అందించడంలోనూ ఇవి ముందే ఉంటాయి. వీటి గురించి నిరంతరం పట్టించుకోవాల్సిన అవసరమూ ఉండదు. అంటే, బోలెడంత సమయం మీకు ఆదా అవుతుంది. 

పెట్టుబ‌డులను తొంద‌ర‌గా ప్రారంభించ‌డం వ‌ల్ల ఎలాంటి  ప్ర‌యోజ‌నం ఉంటుందో ఒక ఉదాహ‌ర‌ణ‌తో తెలుసుకునే ప్ర‌య‌త్నం చేద్దాం. ర‌వి, విజ‌య్‌, ర‌ఘు ముగ్గురు స్నేహితులు. 25 ఏళ్ల వ‌య‌సులో ఉద్యోగంలో చేరారు. ఇప్పుడు ముగ్గురికి 40 సంవ‌త్స‌రాలు. ర‌వి మొద‌టి జీతం అందుకున్న‌ప్ప‌టి నుంచీ నెలకు రూ. 5 వేలు చొప్పున‌ మ్యూచువల్‌ ఫండ్లలో సిప్‌ చేస్తూ వచ్చాడు. అంటే గత 15 ఏళ్లుగా ఇతడు మదుపును కొనసాగిస్తున్నాడు. విజ‌య్‌ గత ఏడేళ్లుగా నెలకు రూ.5 వేలు మదుపు చేస్తున్నాడు. ఇక ర‌ఘు గత మూడేళ్లుగా నెలకు రూ.5 వేలు పెట్టుబడి ప్రారంభించాడు. 

12 శాతం రాబ‌డిని అంచ‌నా వేసి చూస్తే ర‌వి గత 15 ఏళ్లుగా మదుపు చేస్తున్నాడు కాబట్టి…రూ.25 లక్షలు స‌మ‌కూర్చుకున్నాడు. ఇక్క‌డ ర‌వి పెట్టుబ‌డి పెట్టిన మొత్తం రూ. 9 ల‌క్ష‌లు మాత్రమే. విజ‌య్ కూడ‌బెట్టిన మొత్తం రూ. 6.50 ల‌క్ష‌లు..ఇందులో పెట్టుబ‌డి రూ. 4.20 ల‌క్ష‌లు, ఇక రఘు స‌మ‌కూర్చుకున్న మొత్తం రూ. 2.17 ల‌క్ష‌లు. ఇందులో పెట్టుబ‌డి మొత్తం రూ. 1.80 ల‌క్ష‌లు.

పై ఉదాహ‌ర‌ణ‌లో  విజ‌య్.. ర‌వి పెట్టిన పెట్టుబ‌డులో దాదాపు స‌గం మొత్తాన్ని పెట్టుబ‌డి పెట్టాడు. కానీ ర‌వి పొందిన రాబ‌డిలో స‌గం రాబ‌డి కూడా లేదు. ఇదే సమయానికి ఉన్న గొప్పతనం. ఎంత తొందరగా మొదలుపెడితే అంత రాబడి పొందడానికి అవకాశం ఉంటుంది. అయితే, సిప్ చేయడం వల్ల కచ్చితమైన రాబడి వస్తుందని చెప్పలేము. ఇది రిస్క్ మాత్రమే తగ్గిస్తుంది. మార్కెట్ బాగా ఒడిదుడుకులకు లోనయినప్పుడు కొంత మొత్తాన్ని మదుపు చేస్తూ ఉండడం వల్ల అధిక యూనిట్స్ సమకూర్చుకోవచ్చు, తద్వారా రాబడి పెంచుకోవచ్చు. 

 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని