Updated : 13 May 2022 15:36 IST

చిన్న మొత్తంతో పట్టుబడి ప్రారంభించండిలా...

మనలో చాలా మంది పెట్టుబడి పెట్టడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరమని భావిస్తుంటారు. కానీ అది అవాస్తవం. చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టడం ద్వారా కూడా మీరు ధనవంతులయ్యే అవకాశం ఉంది. దాని కోసం మీరు సిస్టమాటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ (సిప్) ని ఎంచుకోవచ్చు. సిప్ రూపంలో మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించినట్లైతే, కాలక్రమేణా మీ పెట్టుబడి వృద్ధి చెందుతుంది. మీరు మ్యూచువల్ ఫండ్లు లో సిప్ ద్వారా నెలకు రూ. 500 నుంచి పెట్టుబడి పెట్టవచ్చు. క్రమశిక్షణతో మీరు చేసే పెట్టుబడులు దీర్ఘ కాలంలో మెరుగైన రాబడులను అందించడమే కాకుండా మీకు అవసరమైన పన్ను ప్రయోజనాలను కూడా అందిస్తాయి. 

తక్కువ డబ్బుతో పెట్టుబడి పెట్టడానికి అనుసరించాల్సిన పద్దతుల గురించి కింద తెలుసుకుందాం. 

 1. పరిమాణంతో సంబంధం లేకుండా పెట్టుబడి పెట్టడం ప్రారంభించండి :

పెట్టుబడులను ప్రారంభించడానికి పెద్ద మొత్తంలో డబ్బు అవసరం లేదు. చిన్న మొత్తంతో కూడా పెట్టుబడులను ప్రారంభించవచ్చు.  కీలకమైన ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో ఆలస్యం చేసినట్లయితే, దానికి అధిక మూల్యం చెల్లించాల్సి రావచ్చు. మొదటి రోజు నుంచే ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవడం మొదలు పెడితే, మీరు డబ్బు సంపాదనపై పట్టు సాదించగలరు. మనలో చాలా మంది డబ్బు విషయంలో మరొక రోజుకి ప్రణాళికను వాయిదా వేయడం లేదా చివరి నిమిషం వరకు అలసత్వం చేసే ధోరణిని కలిగి ఉంటారు, ఎందుకంటే మనకు చేయవలసిన వేరే పని ఉండడం లేదా మనకు అది అర్థం కాకపోవడం కారణం కావచ్చు.

2. స్థిరంగా ఉండండి :

మీరు పెట్టుబడి పెట్టడం ప్రారంభించిన తర్వాత, దానిని స్థిరంగా ఉంచడం చాలా ముఖ్యం. పెట్టుబడులకు ఒక క్రమశిక్షణా విధానాన్ని అనుసరించి, సరైన ఆస్తి తరగతిని ఎంచుకోండి, అలాగే దీర్ఘకాలిక పెట్టుబడులకు ప్రణాళికను కలిగి ఉండడం చాలా ముఖ్యం. ఒకవేళ మీకు పెట్టుబడులపై సరైన అవగాహన ఉన్నట్లైతే, దీర్ఘకాలం పాటు పెట్టుబడులు పెట్టనవసరం లేదు, తెలివిగా వ్యవహరించి పెట్టుబడులను మార్చుతూ ఉండాలి. 

3. చిన్న పొదుపు :

చిన్న పొదుపులు స్వల్ప కాలంలో మిమ్మల్ని ప్రభావితం చేయకపోయినా, దీర్ఘకాలంలో మీకు కచ్చితంగా సహాయ పడతాయి. ఉదాహరణకు, చిన్న పొదుపు సమీకరణకు పిగ్గీ బ్యాంకు ఒక అద్భుతమైన ఉదాహరణ. ఓర్పుతో క్రమానుగుణంగా పొదుపు చేసినట్లయితే, అది చివరగా ఎంత మొత్తాన్ని సమకూరుస్తుందో తెలిస్తే మీరు ఆశ్చర్యానికి గురవుతారు. ఇలాగే అర్ధవంతంగా వృద్ధి చెందినట్లైతే, మీరు పెట్టుబడి పెట్టిన దానికంటే ఎక్కువ డబ్బును పొందుతారు.

4. పెట్టుబడి మొత్తాన్ని కాలక్రమేణా పెంచండి :

కాలక్రమేణా మీ ఆదాయం పెరుగుతుంది కాబట్టి, మీ పెట్టుబడి మొత్తాన్ని కూడా పెంచండి. ఆదాయం పెరుగుతుంటే, దానికి తగ్గట్టుగా ఖర్చులు కూడా పెరుగుతాయనే వాస్తవాన్ని మనలో చాలా మంది గుర్తిస్తారు. ఇది మనం చేసే వృధా ఖర్చుల కారణంగా ఏర్పడుతుంది. అందువలన మనం ఆదాయానికి తగ్గట్టుగా పొదుపును పెంచకపోతే, తక్కువ పొదుపును మాత్రమే కలిగి ఉంటాము. 

5. ఓర్పుతో ఉండండి :

క్రమశిక్షణ, ఓర్పుతో దీర్ఘ కాలం పెట్టే పెట్టుబడులతో గొప్ప ఫలితాలను సాధించవచ్చు. ఓర్పు లేకపోవడం వలన కొన్ని సందర్భాల్లో మీరు పెద్ద మొత్తంలో డబ్బు సంపాదించే అవకాశాన్ని కోల్పోవచ్చు. మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, హెచ్చుతగ్గులనేవి పెట్టుబడి చక్రంలో ఒక భాగం మాత్రమే. ఒకవేళ ట్రెండ్స్ బలహీనపడితే, మీ విశ్వాసాన్ని కోల్పోవద్దు. కాలక్రమేణా నష్టాలు, సవాళ్లు ఎదురవుతూనే ఉంటాయి. వాటిని అధిగమించి మంచి రాబడులను పొందడానికి ప్రయత్నించండి. 

Read latest Business News and Telugu News

 Follow us on Facebook, Twitter, Instagram, Koo, ShareChat and Google News.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.


మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

మరిన్ని