Steel prices: 6 నెలల్లో 40% తగ్గిన స్టీల్‌ ధరలు: స్టీల్‌మింట్‌

దేశీయంగా సరఫరా పెంచే లక్ష్యంతో ప్రభుత్వం స్టీల్‌ ఉత్పత్తుల ఎగుమతులపై సుంకం విధించింది. దీంతో స్థానికంగా ధరలు దిగొచ్చాయి.

Published : 20 Oct 2022 15:01 IST

దిల్లీ: గత ఆరు నెలల్లో దేశీయ మార్కెట్‌లో స్టీల్‌ ధర 40 శాతం తగ్గి టన్ను రూ.57,000కు చేరినట్లు స్టీల్‌మింట్‌ తెలిపింది. ఎగమతులపై 15 శాతం సుంకం విధించడంతో విదేశీ ఆర్డర్లు తగ్గాయని పేర్కొంది. అందువల్లే దేశీయంగా ధరలు దిగొచ్చాయని వెల్లడించింది. 2022 ఆరంభంలో ‘హాట్‌ రోల్డ్‌ కాయిల్‌ (HRC)’ ధరలు పెరగడంతో సర్వత్రా ఆందోళన వ్యక్తమైన విషయం తెలిసిందే. స్థిరాస్తి, నిర్మాణం, మౌలిక వసతులు, ఆటోమొబైల్‌, వినియోగ వస్తువులు, నివాస రంగాలన్నింటిపై స్టీల్‌ ధరల ప్రభావం నేరుగా ఉంటుంది.

ఏప్రిల్‌లో స్టీల్‌ టన్ను ధర రూ.78,800గా నమోదైంది. 18 శాతం జీఎస్టీతో ధర రూ.93,000 వద్ద గరిష్ఠానికి చేరింది. ఏప్రిల్‌ చివరి నుంచి ధరలు తగ్గుముఖం పడుతూ వచ్చాయి. జూన్‌ చివరి నాటికి టన్ను ధర రూ.60,200కు దిగొచ్చింది. సెప్టెంబరు కల్లా అది మరింత తగ్గి రూ.57,000కు చేరింది. స్టీల్‌ ఉత్పత్తులపై ప్రభుత్వం విధించిన పన్నులు, విదేశీ ఆర్డర్లు తగ్గడం, అధిక ద్రవ్యోల్బణం, ఇంధన ఖర్చులు పెరగడమే ధరలు దిగిరావడానికి ప్రధాన కారణాలుగా స్టీల్‌మింట్‌ పేర్కొంది. వచ్చే త్రైమాసికంలోనూ ధరలు పరిమిత శ్రేణిలోనే కదలాడే అవకాశం ఉందని స్టీల్‌మింట్‌ అంచనా వేసింది. విదేశీ ఆర్డర్లు మరో రెండు నెలల పాటు పెద్దగా పుంజుకోకపోవచ్చునని తెలిపింది.

మే 21న ప్రభుత్వ ఇనుప ఖనిజం ఎగుమతులపై 50 శాతం, ఇతర స్టీల్‌ ఉత్పత్తులపై 15 శాతం సుంకం విధించింది. అలాగే స్టీల్‌ పరిశ్రమలో ఉపయోగించే కోకింగ్‌ కోల్‌, ఫెర్రోనికెల్‌ దిగుమతులపై సుంకం విధించింది. దేశీయ సరఫరాలను పెంచాలన్న లక్ష్యంతోనే ప్రభుత్వం ఈ దిశగా నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని