Financial Planning: కెరీర్ ప్రారంభంలో ఉన్నారా.. ఆర్థిక స్వేచ్ఛ సాధించాలంటే..?

ఆర్థిక స్వేచ్ఛ అంటే డ‌బ్బు సంపాదించ‌డం మాత్ర‌మే కాదు. మీ ఆర్థిక స్థితి మీ చేతుల్లో ఉండ‌డం. భ‌విష్య‌త్తులో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం జీవించ‌గ‌ల‌గ‌డం.

Published : 12 Aug 2022 20:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఆర్థిక స్వేచ్ఛ అంటే డ‌బ్బు సంపాదించ‌డం మాత్ర‌మే కాదు. మీ ఆర్థిక భవిష్యత్‌ మీ చేతుల్లో ఉండ‌డం. భ‌విష్య‌త్‌లో ఎలాంటి ఇబ్బందులూ రాకుండా ఒక ప్ర‌ణాళిక ప్ర‌కారం జీవించ‌గ‌ల‌గ‌డం. చాలా మంది అవసరాలకు మించే డ‌బ్బు సంపాదిస్తారు గానీ, అవ‌స‌రం వ‌చ్చిన‌ప్పుడు మాత్రం వారి వ‌ద్ద డ‌బ్బు ఉండ‌దు. అప్పు కోసం ప‌రుగుతీయాల్సిందే. అలాకాకుండా.. జీవితంలో ఏ ద‌శ‌లోనైనా అవ‌స‌రాల కోసం ఇబ్బంది ప‌డ‌కుండా ఉన్న‌ప్పుడే ఆర్థిక స్వేచ్ఛ మీ సొంత‌మ‌వుతుంది. ఉద్యోగంలో చేరిన రోజు నుంచే ప్ర‌ణాళికతో న‌డుచుకుంటే.. ప‌ద‌వీ విర‌మ‌ణ జీవితాన్ని కూడా ఆర్థిక స్వేచ్ఛ‌తో జీవించ‌వ‌చ్చు. ఇందుకోసం ఎలాంటి మార్గాల‌ను అనుస‌రించాలో ఇప్పుడు చూద్దాం.

1. ప్ర‌స్తుత ఆర్థిక‌ స్థితిని తెలుసుకోండి: ‘సంపాదించిన డ‌బ్బు మొత్తం ఎలా ఖ‌ర్చువుతుందో కూడా తెలియ‌డం లేదు’.. అని మ‌న‌కు తెలిసిన వాళ్లు నుంచి త‌ర‌చుగా వింటూ ఉంటాం. ఇదే ప‌రిస్థ‌తి ఉంటే ఆర్థిక స్వేచ్ఛ‌ను సాధించ‌డం క‌ష్ట‌మే. అందువ‌ల్ల‌ మొద‌ట‌గా మీ ఆర్థిక స్థితిని మీరు తెలుసుకోవాలి. మీ ప్ర‌స్తుత ఆదాయం, నెల‌వారీ ఖ‌ర్చులు, పొదుపు, తీర్చ‌వ‌ల‌సిన‌ బ‌కాయిలు మొద‌లైన వాటి గురించి స్ప‌ష్ట‌త ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ ఆర్థిక నివేదిక మీ వ‌ద్ద ఉండాలి.  

2. ల‌క్ష్యాల‌ను రాయండి..: ల‌క్ష్యం లేకుండా సాగ‌డం అంటే.. గమ్యం లేకుండా ప్ర‌యాణించ‌డ‌మే. ఎక్క‌డికి వెళ్లాలో తెలియ‌న‌ప్పుడు ఎంత దూరం ప్ర‌యాణించినా, ఎంత క‌ష్ట‌ప‌డినా లాభం ఏముంటుంది? ఆర్థిక విషయాల్లోనూ ఇదే సూత్రం వ‌ర్తిస్తుంది. మ‌న‌కు డ‌బ్బు ఎందుకు అవ‌స‌రం అనేది తెలుసుకోవాలి. ఉదాహ‌ర‌ణ‌కు మీరు కెరీర్ ప్రారంభంలో ఉన్న‌వారైతే.. ఉన్న‌త చ‌దువుల కోసం విద్యా రుణం తీసుకుని ఉండొచ్చు. ఈ రుణాన్ని తీర్చ‌డం మీకు ఒక‌ ల‌క్ష్యం అవుతుంది. అలాగే, రెండేళ్ల త‌ర్వాత విదేశాల‌కు విహార యాత్ర‌ల‌కు వెళ్లాల‌నుకుంటున్నారు.. ఇదీ ఒక ల‌క్ష్యం. వివాహం, పిల్ల‌ల చ‌దువులు, ఇల్లు, కారు కొనుగోలు చేయ‌డం, ప‌ద‌వీ విర‌మ‌ణ.. ఇలా ప్ర‌తీ ఒక్క‌రి జీవితంలో అనేక ల‌క్ష్యాలు ఉంటాయి. ముందుగా వాటిని ఒక పేప‌రుపై రాయండి. ఇందులో నుంచి ప్రాధాన్య‌ం ఉన్న ల‌క్ష్యాల‌ను వేరు చేయండి. అదే విధంగా 1,5,10,20 ఏళ్లు కాల‌వ్య‌వ‌ధితో చేరుకోగ‌ల‌ ల‌క్ష్యాల‌ను వేరు వేరుగా రాయండి. ల‌క్ష్యాల‌ను జాబితా చేసేట‌ప్పుడు ఒక విష‌యం గుర్తుంచుకోవాలి. ఈ ల‌క్ష్యం వాస్త‌విక‌త‌కు ద‌గ్గ‌ర‌గా, సాధించ‌గ‌లిగిన‌దై ఉండాలి. 

3. ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయండి: మ‌నం రోజువారీ జీవితంలో ఎన్నో ఖ‌ర్చులు చేస్తుంటాం. ఆ ఖ‌ర్చుల‌ను ట్రాక్ చేయడానికి యాప్, ఎక్స‌ల్ షీట్‌ లేదా డైరీ వాడొచ్చు. మ‌నం ఒక్క రూపాయిని ఖ‌ర్చు చేసినా ఇందులో రాయాలి. కొన్ని యాప్‌లు ట్రావెల్‌, షాపింగ్‌, రెస్టారెంట్లులో భోజ‌నం త‌దిత‌ర ఖ‌ర్చుల‌ను ఎంట‌ర్ చేస్తే.. ఏ కేట‌గిరీలో ఎంత ఖ‌ర్చు చేస్తున్నారో ట్రాక్ చేస్తాయి. నెలవారీగా, త్రైమాసికంగా, అర్ధ వార్షికంగా, వార్షికంగా చేసే ఖ‌ర్చుల‌ను కూడా ట్రాక్ చేసి స‌మ‌గ్ర‌మైన డేటాను మీకు అందిస్తాయి. ఇది ఖ‌ర్చుల‌ను నియంత్ర‌ణ‌లో ఉంచేందుకు ఎంతగానో స‌హాయ‌ప‌డుతుంది.

4. ముందు పొదుపు: మీ ఆదాయం నుంచి పొదుపు మొత్తాన్ని పక్కన పెట్టాకే.. ఇంటి అద్దె, బిల్లులు, ఇత‌ర ఖ‌ర్చుల‌ను చేయాలి. ఈ ప్ర‌ణాళిక‌ మీ ఖ‌ర్చుల‌ను ప‌రిమితం చేస్తుంది. ఒక‌వేళ ఖ‌ర్చుల కోసం తీసిన మొత్తం స‌రిపోవ‌ట్లేదంటే మీరు ఖ‌ర్చుల ప‌ట్ల మ‌రింత జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హరించాల‌ని అర్థం. జీవ‌నశైలిలో చిన్న చిన్న మార్పులు చేసుకుంటే ఖ‌ర్చుల‌ను త‌గ్గించుకోవ‌చ్చు. ఇలా ముందుగా పొదుపు లేదా పెట్టుబ‌డుల‌కు కావాల్సిన మొత్తాన్ని పక్కన పెట్ట‌డం వ‌ల్ల ఆర్థిక భ‌విష్య‌త్‌ చ‌క్క‌గా ప్లాన్ చేసుకోవ‌చ్చు.

5. రుణాలు స‌కాలంలో చెల్లించండి: సాధార‌ణంగా కెరీర్ ప్రారంభంలో ఉన్న‌వారికి.. విద్యా రుణం ఉంటుంది. అలాగే ఉద్యోగంలో చేరిన త‌ర్వాత సొంతంగా బైక్ ఉండాలని రుణం తీసుకుని కొనుగోలు చేస్తుంటారు. ఇవే కాకుండా మీకు ఏ ర‌క‌మైన రుణాలు ఉన్నా వాటి ఈఎంఐల‌ను స‌కాలంలో చెల్లించండి. ఇలా చేయ‌డం ద్వారా మీ క్రెడిట్ స్కోరు బ‌ల‌ప‌డుతుంది. దీంతో భ‌విష్య‌త్‌లో గృహ రుణం వంటి దీర్ఘ‌కాలిక రుణాలు సుల‌భంగా ల‌భించ‌డంతో పాటు త‌క్కువ వ‌డ్డీ రేటుకే అందుబాటులో ఉంటాయి. కెరీర్ ప్రారంభంలో ఉన్న‌వారు అప్పుల జోలికి పోకుండా ఉంటే మంచిది. 

6. ఆర్థిక అనిశ్చితుల‌కు సిద్ధంగా ఉండాలి: భ‌విష్య‌త్‌ను మ‌నం ఊహించ‌లేం. ఇప్పుడు అంతా స‌వ్యంగానే ఉన్నా.. భ‌విష్య‌త్‌లో ఎప్పుడు ఏమౌతుందో మ‌నం చెప్పలేం. కాబ‌ట్టి అన్ని ర‌కాల అనిశ్చితుల‌కు సిద్ధంగా ఉండాలి. ప్ర‌తి ఒక్క‌రూ త‌మ త‌మ ఆదాయం, కుటుంబ నేప‌థ్యం ఆధారంగా జీవిత, ఆరోగ్య బీమా పాల‌సీల‌ను స‌రైన హామీ మొత్తంతో తీసుకోవాలి. అలాగే, క‌నీసం 6 నెల‌ల నుంచి ఏడాది ఖ‌ర్చుల‌కు స‌రిపోయే అత్య‌వ‌స‌ర నిధిని ఏర్పాటు చేసుకోవాలి. ఆర్థిక మాంద్యం వంటి వాటి కార‌ణంగా రెండు, మూడు నెలలు ఉద్యోగం కోల్పోవాల్సి వచ్చినా.. అత్య‌వ‌స‌ర వైద్య ప‌రిస్థితులు త‌లెత్తినా ఈ మొత్తం మీకు స‌హాయ‌ప‌డుతుంది.

7. రెండో ఆదాయ మార్గం ఉండాలి: ఇప్పుడు ఉన్న ఒత్తిడికి ఒక ఉద్యోగం చేయ‌డానికే క‌ష్టంగా ఉంటోంది. అలాంటిది మరో ఉద్యోగం అంటే.. చాలా మందికి వీలుకాదు. మ‌రి రెండో ఆదాయ మార్గం ఎలా? దీనికి నిపుణులు చెప్పే స‌మాధానం పెట్టుబ‌డులు. మ‌నం చేసే పొదుపును పెట్టుబ‌డుల‌కు మ‌ళ్లిస్తే.. అవి మ‌న‌కు ఆదాయాన్ని సంపాదించి పెడతాయి. దీర్ఘ‌కాలంపాటు చేసే పెట్టుబుడులు కాంపౌండ్ వ‌డ్డీ ప్ర‌భావంతో మంచి రాబ‌డిని అందిస్తాయి. అందువ‌ల్ల ఎంత త్వ‌ర‌గా పెట్టుబ‌డులు ప్రారంభిస్తే అంత మంచిది. ఉద్యోగంలో చేరిన కొత్త‌లో జీతం కాస్త త‌క్కువ‌గా ఉండొచ్చు. అయితే, కుటుంబ బాధ్య‌త‌లు త‌క్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి ఎక్కువ మొత్తం పొదుపు చేసే వీలుంటుంది. విద్యా రుణం వంటివి తీర్చాల్సి రావ‌డం వ‌ల్ల ఎక్కువ మొత్తంలో పొదుపు చేయ‌లేక‌పోయినా ప‌ర్వాలేదు, చిన్న చిన్న మొత్తాల‌తోనైనా పెట్టుబ‌డులు ప్రారంభించండి. జీతం పెరిగిన ప్ర‌తిసారీ పెట్టుబ‌డులను పెంచండి. అలాగే, ఎక్క‌డ పెట్టుబ‌డులు పెడుతున్నారు (అసెట్ అలోకేష‌న్‌) అనేది కూడా ముఖ్య‌మే. మీ న‌ష్ట‌భ‌యం ఆధారంగా, ఈక్వీటీ, నాన్‌-ఈక్వీటీ పెట్టుబ‌డుల‌ను ఎంచుకోండి.

8. కెరీర్ గ్రోత్ కోసం కొంత పక్కన పెట్టండి: ప్ర‌స్తుత పోటీ ప్ర‌పంచంలో నిల‌దొక్కుకోవాలంటే.. ఎప్ప‌టిక‌ప్పుడు స్కిల్స్ మెరుగుప‌రుచుకుంటూ ఉండాలి. మార్కెట్లోకి వ‌చ్చే కొత్త కొత్త నైపుణ్యాల‌ను నేర్చుకోవాలి. అప్పుడే మీరు ప‌నిచేసే సంస్థ‌కు మెరుగైన సేవ‌ల‌ను అందించ‌గ‌ల‌రు. తద్వారా ఉద్యోగంలో వృద్ధి సాధించ‌గ‌ల‌రు. ఒక‌వేళ వ్యాపారం చేసే వారైతే కొత్త వ్యూహాల‌తో స‌రికొత్త సాంకేతిక‌త‌తో వ్యాపారాన్ని మ‌రింత‌గా విస్తరించ‌గ‌లుగుతారు. 

చివ‌రిగా: కెరీర్ ప్రారంభంలోనే కాదు.. జీవితంలో ఏ ద‌శ‌లోనైనా ఆర్థిక స్వేచ్ఛ అవ‌సరం. అందువ‌ల్ల త‌గిన ఆర్థిక ప్ర‌ణాళిక‌తో ముందుకు సాగ‌డం మంచిది. ఒక‌వేళ పెట్టుబ‌డులు, ఇత‌ర ఆర్థిక విష‌యాల పట్ల మీకు అవ‌గాహ‌న లేక‌పోతే, ఆర్థిక నిపుణుల స‌ల‌హా తీసుకోవ‌డం మంచిది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని