NPS చందాదారులు ఫిర్యాదులు ఎలా నమోదు చేయాలి?

ఎన్‌పీఎస్ చందాదారులు వారి లాగిన్ ఐడి, పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఎన్‌పీఎస్‌ కింద ఏదైనా సంస్థపై ఫిర్యాదును నమోదు చేయవచ్చు

Updated : 18 Aug 2022 16:39 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: జాతీయ పింఛను ప‌థ‌కం (NPS) అనేది.. పెన్ష‌న్‌తో కూడిన పెట్టుబ‌డుల పథకం. ఇందులో టైర్-I, టైర్-II రెండు రకాల ఖాతాలుంటాయి. ఎన్‌పీఎస్‌లో చేరాల‌నుకునేవారు కచ్చితంగా టైర్- I ఖాతాలో చేరాలి. టైర్-II ఖాతాలో స్వ‌చ్చందంగా మ‌దుపు చేయొచ్చు. ఎన్‌పీఎస్‌లో రాబడులు మార్కెట్‌తో ముడిపడి ఉంటాయి. టైర్- II ఖాతాలో నిధుల‌ను ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకోవ‌చ్చు. టైర్-I ఖాతా నిధుల ఉప‌సంహ‌ర‌ణ‌పై మాత్రం నిబంధ‌న‌లు వ‌ర్తిస్తాయి. కాలానుగుణంగా నిబంధ‌న‌ల్లో మార్పులు చేస్తుంటారు. అందువ‌ల్ల ఎన్‌పీఎస్ గురించిన పూర్తి స‌మాచారం అందించేందుకు, ఫిర్యాదుల‌ను స్వీక‌రించేందుకు ఎన్‌పీఎస్ మ‌ల్టీ లేయ‌ర్డ్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్ట‌మ్‌ను ఏర్పాటు చేసింది. దీని ద్వారా చందాదారులు త‌మ సందేహాల‌ను నివృత్తి చేసుకోవ‌చ్చు. అలాగే, ఏమైనా ఫిర్యాదులు ఉంటే తెలియ‌జేయ‌వ‌చ్చు.

ఫిర్యాదులను నమోదు చేయడానికి మార్గాలు..

చందాదారులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న ఫిర్యాదు పరిష్కార వ్యవస్థ ద్వారా గానీ, రాతపూర్వ‌కంగా సెంట్ర‌ల్ గ్రీవెన్స్ మేనేజ్‌మెంట్ సిస్ట‌మ్ వ‌ద్ద గానీ, ఎన్‌పీఎస్ సీఆర్ఏ కాల్‌ సెంటర్‌కు కాల్ చేసి గానీ ఫిర్యాదును నమోదు చేసుకోవచ్చు. చందాదారులు మాత్ర‌మే కాకుండా చందాదారులు కాని వారు కూడా ఫిర్యాదులను న‌మోదు చేయ‌వ‌చ్చు.

ఆన్‌లైన్ ద్వారా..

  • ఎన్‌పీఎస్ చందాదారులు తమ లాగిన్ ఐడీ, పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఎన్‌పీఎస్‌ కింద ఏదైనా సంస్థపై ఫిర్యాదును నమోదు చేయొచ్చు. వెబ్‌సైట్‌లోని సబ్‌స్క్రైబర్స్ కార్నర్ కింద లాగ్ యువర్ గ్రీవెన్స్/ఎంక్వైరీ విభాగాన్ని సందర్శించడం మరొక మార్గం. ఫిర్యాదు విజయవంతంగా నమోదు చేసిన త‌ర్వాత‌ టోకెన్ నంబర్ జారీ చేస్తారు.
  • ఎన్‌పీఎస్ చందాదారులు నేరుగా ఇక్క‌డ ఇచ్చిన లింకును క్లిక్ చేయ‌డం ద్వారా ఈ-ఎన్‌పీఎస్ కి లాగిన్ అవ్వ‌చ్చు.
  • ఆన్‌లైన్‌లో స‌మాచారం కోసం లేదా ఫిర్యాదులు ఫైల్ చేసేందుకు..హోమ్ పేజీ కింది భాగంలో 'పోస్ట్ యువ‌ర్ క్వెరీస్‌/గ్రీవెన్స్ - క్లిక్ హియ‌ర్' అనే ఆప్ష‌న్ క‌నిపిస్తుంది. దానిపై క్లిక్ చేయాలి.
  • ఇక్క‌డ మీకు ఏ విధంగా స‌హాయ‌ప‌డ‌గ‌లం (HOW CAN WE HELP YOU) అనే పేజీ తెరుచుకుంటుంది. ఇక్క‌డ మీకు కొంత స‌మాచారం ల‌భిస్తుంది. మీ సందేహాల‌కు స‌మాధానం ఇక్క‌డ ల‌భిస్తే.. ఇక్క‌డితో ఆపివేయ‌వ‌చ్చు. లేదంటే.. ప్రొసీడ్ బ‌ట‌న్ క్లిక్ చేసి ముందుకు వెళ్ల‌వ‌చ్చు.
  • ఇక్క‌డ మీకు రెండు ఆప్ష‌న్లు క‌నిపిస్తాయి. మీ వ‌ద్ద ప్రాన్ వివ‌రాలు అందుబాటులో లేక‌పోతే మొద‌టి ఆప్ష‌న్, అందుబాటులో ఉంటే రెండో ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఒక‌వేళ ఇప్ప‌టికే మీరు ఫిర్యాదు రిజిస్ట‌ర్ చేసివుంటే దాని స్టేట‌స్ ఇక్క‌డ తెలుసుకోవ‌చ్చు.
  • ఒక‌వేళ మీ వ‌ద్ద ప్రాన్ వివ‌రాలు అందుబాటులో ఉంటే.. రెండో ఆప్ష‌న్ ఎంచుకుని, ప్రాన్‌, క్యాప్చా ఎంట‌ర్ చేసి, నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫిర్యాదుల ఫారం ఓపెన్ అవుతుంది.
  • ఒక‌వేళ మీ వ‌ద్ద ప్రాన్ అందుబాటులో లేక‌పోతే మొద‌టి ఆప్ష‌న్ ఎంచుకోవాలి. ఇక్క‌డ మీరు ఎన్‌పీఎస్‌లో రిజిస్ట‌ర్ అయ్యి ఉన్నారా? లేదా సెల‌క్ట్ చేసుకోవాలి. ఒక‌వేళ ఎన్‌పీఎస్ రిజిస్ట‌ర్ అయ్యి కూడా ప్రాన్ వివ‌రాలు అందుబాటులో లేక‌పోతే.. PAO/POP-SP/CBO Reg No ఎంట‌ర్ చేసి కింద క‌నిపిస్తున్న క్యాప్చా కోడ్‌ని ఎంట‌ర్ చేసి నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫిర్యాదుల ఫారం ఓపెన్ అవుతుంది.
  • ఒక‌వేళ మీరు ఎన్‌పీఎస్ చందాదారుడు కాక‌పోతే.. మీకు నాలుగు ఆప్ష‌న్లు అందుబాటులో ఉంటాయి. మీకు కావాల్సిన దాన్ని ఎంచుకుని, క్యాప్చాను ఎంట‌ర్ చేసి, నెక్స్ట్ పై క్లిక్ చేస్తే ఫిర్యాదుల ఫారం ఓపెన్ అవుతుంది.
  • ఫిర్యాదుల ఫారంలో మీ ఈ-మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్‌ ఇచ్చి మీ ఫిర్యాదును రిజిస్ట‌ర్ చేయొచ్చు.

కాల్ సెంట‌ర్ లేదా ఐవీఆర్ సిస్ట‌మ్‌..

చందాదారులు NSDL CRA కాల్ సెంట‌ర్‌ 1800 222 080 నంబ‌రుకు కాల్ చేసి ఫిర్యాదు న‌మోదు చేయ‌వ‌చ్చు. ఇక్కడ చందాదారులు T-pinని ఉపయోగించి ప్రమాణీకరించాలి. ఫిర్యాదు నమోదు చేసిన తర్వాత, భవిష్యత్ రిఫ‌రెన్స్‌ కోసం టోకెన్ నంబరు జారీ చేస్తారు. 

ఫారం ఉప‌యోగించి..

ఎన్‌పీఎస్ చందాదారులు POP-SPకి రాతపూర్వకంగా కూడా ఫిర్యాదును సమర్పించవచ్చు. అథెంటికేషన్ కోసం చందాదారులు త‌మ ప్రాన్ నంబ‌ర్‌ను ఇవ్వాల్సి ఉంటుంది. ఫారం సమ‌ర్పించిన త‌ర్వాత రసీదు ఇస్తారు. త‌ర్వాత టోకెన్ నంబ‌ర్‌ను చందాదారునికి ఈ-మెయిల్ చేస్తారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని