Home Loan: హోమ్‌లోన్‌ కావాలా? ఇప్పటికీ 7 శాతం వడ్డీకి పొందే ఛాన్స్‌!

Home Loan: నిన్న మొన్నటి వరకు చవగ్గా లభించిన గృహ రుణాలు (Home Loans) ఒక్కసారిగా ప్రియమయ్యాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ (RBI Rate hike) తీసుకున్న రెపోరేట్ల పెంపు నిర్ణయంతో బ్యాంకులు ఒక్కసారిగా వడ్డీరేట్లను సవరించాయి.

Published : 12 Jun 2022 17:55 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నిన్న మొన్నటి వరకు చవగ్గా లభించిన గృహ రుణాలు (Home Loans) ఒక్కసారిగా ప్రియమయ్యాయి. ద్రవ్యోల్బణం కట్టడికి ఆర్‌బీఐ (RBI Rate hike) తీసుకున్న రెపోరేట్ల పెంపు నిర్ణయంతో బ్యాంకులు ఒక్కసారిగా వడ్డీరేట్లను సవరించాయి. దీంతో కొత్తగా ఇల్లు కొందామని సిద్ధమైన వారు కూడా పెరిగిన వడ్డీ రేట్లతో వెనకడుగు వేస్తున్నారు. అయితే, ఒకవేళ మీరూ ఆ కోవకు చెందిన వారేనా? అయితే ఇప్పటికీ మీరు 7 శాతం వడ్డీకే గృహ రుణాలు పొందొచ్చు. అందుకు కావాల్సింది.. మంచి క్రెడిట్‌ స్కోరు. మీ క్రెడిట్‌ స్కోరు బాగుంటే ఇప్పుడే కాదు.. భవిష్యత్‌లోనూ ఇతరులతో పోలిస్తే తక్కువ వడ్డీకే రుణాలు పొందే అవకాశం ఉంది.

Also Read: మీ క్రెడిట్ స్కోర్ తక్కువగా ఉందా? పెంచుకోవడమెలా..?

క్రెడిట్‌ స్కోరును క్రెడిట్‌ బ్యూరో సంస్థలు అందిస్తాయి. 300 నుంచి 900 మధ్య ఈ నంబర్‌ ఉంటుంది. మీ క్రెడిట్‌ స్కోరు అనేది ఆర్థిక విషయాల్లో మీరు ఎంత కచ్చితంగా ఉన్నారో చెబుతుంది. ఒకవేళ మీరు గృహ రుణం తీసుకోవాలనుకుంటే ముందు మీ క్రెడిట్‌ స్కోరును తనిఖీ చేయండి. ఒకవేళ మీ క్రెడిట్‌ స్కోరు 750 కంటే ఎక్కువ ఉంటే మీకు హోమ్‌లోన్‌ సులువుగానే కాకుండా తక్కువ వడ్డీకే దొరుకుతుంది. పైగా వడ్డీ కోసం బ్యాంకులతో బేరసారాలు కూడా ఆడొచ్చు. క్రెడిట్‌ స్కోరు బాగా ఉందీ అంటే.. మీరు రుణాన్ని ఎగ్గొట్టే వ్యక్తి కాబోరని రుణ జారీ సంస్థలు భావిస్తాయి. అందుకే అలాంటి వ్యక్తులకు తక్కువ వడ్డీకి రుణం ఇచ్చేందుకు ఆసక్తి చూపిస్తాయి.

Also Read: క్రెడిట్‌ స్కోరు 750కి తగ్గకుండా

ప్రస్తుతానికి బ్యాంక్‌ ఆఫ్‌ మహారాష్ట్ర, బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా 750 కంటే ఎక్కువ సిబిల్‌ స్కోరు ఉన్న వారికి 7 శాతం లోపే రుణాలు అందిస్తున్నాయి. ఇండియన్‌ బ్యాంక్‌, పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌, యూకో బ్యాంక్‌, యూనియన్‌ బ్యాంక్‌, ఎల్‌ఐసీ హౌసింగ్‌ ఫైనాన్స్‌ వంటివి కూడా 6.90 నుంచి 7.40 శాతం మధ్య వడ్డీకి గృహ రుణాలను ఆఫర్‌ చేస్తున్నాయి.

క్రెడిట్‌ స్కోరు పెంచుకోవాలంటే..?

  • ఏదైనా కారణంతో మీ క్రెడిట్‌ స్కోరు తక్కువగా ఉన్నప్పటికీ భవిష్యత్‌లోనైనా రుణాలు తీసుకున్నప్పుడు ఈ క్రెడిట్‌ స్కోరు కీలక భూమిక పోషిస్తుంది. కాబట్టి ఇప్పటి నుంచే మీ క్రెడిట్‌ స్కోరును పెంచుకోవడంపై దృష్టి సారించండి.
  • రుణాలుంటే వాటి బకాయిలను వెంటనే చెల్లించండి.
  • క్రెడిట్‌ కార్డు చెల్లింపులను సకాలంలో చేయండి. పూర్తి బిల్లు చెల్లించడానికి ప్రాధాన్యం ఇవ్వండి.
  • రుణాల కోసం వెంట వెంటనే దరఖాస్తులు చేయకండి.
  • క్రెడిట్‌ కార్డులో ఉన్న లిమిట్‌ మొత్తం వాడేయకండి. 30 శాతం లోపే వాడేందుకు ప్రయత్నించండి. ఇలా చేయడం ద్వారా మీ క్రెడిట్‌స్కోరు పెరుగుతుంది.

Also Read: క్రెడిట్‌కార్డు వాడుతున్నారా? అయితే, దీనిపై ఓ కన్నేసి ఉంచండి!

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని