Stock Market: నష్టాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 19,550 దిగువన స్థిరపడ్డ నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) చివరకు 316.31 పాయింట్ల నష్టంతో 65,512.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) చివరకు 109.55 పాయింట్ల నష్టపోయి 19,528.75 దగ్గర ముగిసింది.

Published : 03 Oct 2023 16:18 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు మంగళవారం నష్టాలతో ముగిశాయి. ఉదయమే ప్రతికూలంగా ట్రేడింగ్‌ ప్రారంభించిన మార్కెట్లు రోజంతా అదే బాటలో పయనించాయి. ఏ దశలోనూ సూచీలకు కొనుగోళ్ల మద్దతు లభించలేదు. ఈవారంలో కీలక వడ్డీరేట్ల పెంపుపై ఆర్‌బీఐ ప్రకటన చేయనుంది. మదుపర్లు దీనిపై ప్రధానంగా దృష్టి సారించారు. అలాగే ద్రవ్యోల్బణం, వృద్ధి రేటుపై కేంద్ర బ్యాంకు వ్యాఖ్యలనూ మదుపర్లు నిశితంగా పరిశీలించనున్నారు. మరోవైపు అధిక చమురు ధరలు, ఎఫ్‌ఐఐల అమ్మకాలు, రూపాయి బలహీనతలు మార్కెట్లపై ప్రభావం చూపాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 65,813.42 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,344.59 దగ్గర కనిష్ఠాన్ని తాకింది. చివరకు 316.31 పాయింట్ల నష్టంతో 65,512.10 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,622.40 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,479.65 దగ్గర దిగువ స్థాయికి చేరుకుంది. చివరకు 109.55 పాయింట్లు నష్టపోయి 19,528.75 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.20 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో బజాజ్‌ ఫైనాన్స్‌, ఎల్‌అండ్‌టీ, టైటన్‌, బజాజ్ ఫిన్‌సర్వ్‌, ఎస్‌బీఐ, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, హెచ్‌యూఎల్‌, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. మారుతీ, ఎన్‌టీపీసీ, టాటా మోటార్స్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, రిలయన్స్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌, ఎంఅండ్‌ఎం, ఐటీసీ, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా షేర్లు నష్టాల్లో స్థిరపడ్డాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

☛ ప్రభుత్వ రంగ సంస్థ పవర్‌ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ వివిధ ప్రాజెక్టులకు రూ.15 వేల కోట్లు మంజూరు చేసినట్లు మంగళవారం ప్రకటించింది. కొత్తగా ఎయిర్‌పోర్ట్‌ ప్రాజెక్టులకూ నిధులు అందిస్తున్నట్లు తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు రూ.251.75 దగ్గర ఫ్లాట్‌గా ముగిసింది.

☛ మార్పిడి రహిత డిబెంచర్ల జారీ ద్వారా రూ.150 కోట్లు సమీకరించినట్లు కల్పతరు ప్రాజెక్ట్స్ ఇంటర్నేషనల్‌ ప్రకటించింది. కంపెనీ షేరు ఈరోజు 2.29 శాతం పెరిగి రూ.646 దగ్గర స్థిరపడింది.

☛ తమ అనుబంధ సంస్థల్లో ఒకదానికి ముంబయిలో ఓ భారీ వంతెన నిర్మాణ ప్రాజెక్టు లభించినట్లు ఎల్‌అండ్‌టీ తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు 1.67 శాతం పెరిగి రూ.3,074 వద్ద నిలిచింది. 

☛ ఈ ఏడాది తొలి ఆరు నెలల్లో బొగ్గు ఉత్పత్తి 83 శాతం పెరిగినట్లు ఎన్‌టీపీసీ తెలిపింది. కంపెనీ షేరు ఈరోజు 1.65 శాతం నష్టపోయి రూ.241.50 దగ్గర ముగిసింది. 

☛ ఎన్‌సీసీ లిమిటెడ్‌కు రూ.4,206 కోట్లు విలువ చేసే మూడు ఆర్డర్లు లభించాయి. కంపెనీ షేరు ఈరోజు 3.77 శాతం పుంజుకొని రూ.160.90 దగ్గర స్థిరపడింది. 

☛ ఆభరణ విక్రయశాలలు నిర్వహిస్తున్న వైభవ్‌ జెమ్స్‌ అండ్‌ జువెలర్స్ షేర్లు ఈరోజు తొలిసారి మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఇష్యూ ధరతో పోలిస్తే రూ.215 వద్ద ఫ్లాట్‌గా ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. ఇంట్రాడేలో రూ.222 దగ్గర గరిష్ఠానికి చేరాయి. చివరకు 0.23 శాతం లాభంతో రూ.215.50 దగ్గర నిలిచాయి.

☛ జేఎస్‌డబ్ల్యూ ఇన్‌ఫ్రా షేర్లు సైతం ఈరోజే స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.119తో పోలిస్తే 22 శాతం ప్రీమియంతో లిస్టయ్యాయి. తర్వాత 32 శాతం పెరిగి రూ.157 దగ్గర అప్పర్‌ సర్క్యూట్‌ని తాకింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని