Stock Market: లాభాల్లో ముగిసిన మార్కెట్‌ సూచీలు.. 19,700 ఎగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 173.22 పాయింట్ల లాభంతో 66,118.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 51.75 పాయింట్ల లాభపడి 19,716.45 దగ్గర ముగిసింది.

Published : 27 Sep 2023 16:13 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock Market) సూచీలు బుధవారం లాభాలతో ముగిశాయి. ఉదయం నష్టాలతో ప్రారంభమైన సూచీలకు ఇంట్రాడే కనిష్ఠాల వద్ద కొనుగోళ్ల అండ లభించింది. దీంతో మధ్యాహ్నం తర్వాత సూచీలు లాభాల్లోకి ఎగబాకి ఇంట్రాడే గరిష్ఠాలను నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్లలో మిశ్రమ సంకేతాల మూలంగా సూచీలు ఉదయం నష్టాలు చవిచూశాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 65,925.64 దగ్గర నష్టాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,549.96 వద్ద కనిష్ఠాన్ని, 66,172.27 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 173.22 పాయింట్ల లాభంతో 66,118.69 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,637.05 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,730.70- 19,554.00 మధ్య కదలాడింది. చివరకు 51.75 పాయింట్ల లాభపడి 19,716.45 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 83.22 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఎల్‌అండ్‌టీ, ఐటీసీ, సన్‌ఫార్మా, మారుతీ, రిలయన్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఇండస్ఇండ్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, భారతీ ఎయిర్‌టెల్‌, విప్రో, ఇన్ఫోసిస్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. టైటన్‌, ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, టాటా స్టీల్‌, నెస్లే ఇండియా, బజాజ్‌ ఫైనాన్స్‌, ఎన్‌టీపీసీ, ఎంఅండ్‌ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌ నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

మ్యాక్స్‌ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌ నుంచి అహ్లూవాలియా కాంట్రాక్ట్స్‌కు రూ.832.40 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ లభించింది. అహ్లూవాలియా షేరు ఈరోజు ఒకశాతానికి పైగా పెరిగింది. చివరకు 0.32 శాతం లాభంతో రూ.723 దగ్గర స్థిరపడింది.

పీఎన్‌బీ షేరు ఈరోజు ఇంట్రాడేలో నాలుగేళ్ల గరిష్ఠానికి చేరింది. దీంతో మార్కెట్‌ క్యాప్‌ రూ.లక్ష కోట్లకు చేరువైంది. చివరకు షేరు విలువ 2.46 శాతం లాభంతో రూ.81.30 దగ్గర ముగిసింది.

 కనీసం 25 శాతం సీఏజీఆర్‌ చొప్పున వృద్ధి రేటు సాధించాలని గ్రావిటా ఇండియా లక్ష్యంగా నిర్దేశించుకుంది. ఈ మేరకు ‘విజన్‌ 2027’ పేరిట ప్రణాళికను విడుదల చేసింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 13.65 శాతం వృద్ధితో రూ.918.55 దగ్గర స్థిరపడింది.

 సాయి సిల్క్స్‌ లిమిటెడ్‌ (కళామందిర్‌) షేర్లు ఈరోజు స్టాక్‌ మార్కెట్‌లో లిస్టయ్యాయి. ఇష్యూ ధర రూ.222తో పోలిస్తే 4 శాతం లాభంతో నమోదయ్యాయి. చివరకు 10.32 శాతం లాభంతో రూ.244.90 దగ్గర స్థిరపడింది. ఇంట్రాడేలో రూ.247 దగ్గర గరిష్ఠాన్ని నమోదు చేసింది.

సిగ్నేచర్‌ గ్లోబల్‌ షేర్లు సైతం ఈరోజు స్టాక్‌ ఎక్స్ఛేంజీల్లో నమోదయ్యాయి. ఇష్యూ ధర రూ.385తో పోలిస్తే 16 శాతం లాభంతో ట్రేడింగ్‌ను మొదలుపెట్టాయి. చివరకు 19.10 శాతం పెరిగి రూ.458.55 దగ్గర ముగిసింది. ఇంట్రాడేలో రూ.474 దగ్గర గరిష్ఠాన్ని నమోదు చేసింది.

ఈరోజు వాలియంట్‌ ల్యాబ్స్‌ ఐపీఓ ప్రారంభమైంది. ధరల శ్రేణి రూ.133- 140. రూ.152.46 కోట్ల సమీకరణ లక్ష్యంతో కంపెనీ ఐపీఓకి వచ్చింది. కనీసం 105 షేర్లకు బిడ్లు దాఖలు చేయాలని నిబంధన విధించారు. ఈ లెక్కన మదుపర్లు రూ.13,965 కనీసం పెట్టుబడిగా పెట్టాలి. తొలిరోజు రిటైల్‌ విభాగంలో 0.55 రెట్ల షేర్లకు బిడ్లు దాఖలయ్యాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు