Stock Market: మూడు రోజుల నష్టాలకు బ్రేక్‌.. రాణించిన అదానీ స్టాక్స్‌

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 297.94 పాయింట్ల లాభంతో 61,729.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 73.45 పాయింట్లు లాభపడి 18,203.40 దగ్గర ముగిసింది.

Published : 19 May 2023 16:06 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు శుక్రవారం లాభాలతో ముగిశాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లో జారుకున్నాయి. దాదాపు చివరి గంటన్నర వరకు ఒడుదొడుకుల మధ్య ట్రేడయ్యాయి. ఆఖరికి కొనుగోళ్ల అండతో మూడు రోజుల వరుస నష్టాల నుంచి తేరుకున్నాయి. ఐటీ, టెక్ స్టాక్స్‌లో వచ్చిన ర్యాలీ సూచీలకు దన్నుగా నిలిచింది. అదానీ గ్రూప్‌ స్టాక్స్‌లో వచ్చిన లాభాలు సైతం మార్కెట్లకు ఆఖర్లో ఊతమిచ్చాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 61,556.25 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 61,784.61 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 297.94 పాయింట్ల లాభంతో 61,729.68 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 18,186.15 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 18,218.10 దగ్గర గరిష్ఠానికి చేరింది. చివరకు 73.45 పాయింట్లు లాభపడి 18,203.40 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఐదు పైసలు తగ్గి 82.67 దగ్గర నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో టాటా మోటార్స్‌, టెక్‌ మహీంద్రా, ఇన్ఫోసిస్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎంఅండ్‌ఎం, ఐసీఐసీఐ బ్యాంక్‌, విప్రో, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, కొటాక్ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభపడ్డాయి. ఎన్‌టీపీసీ, ఏషియన్‌ పెయింట్స్‌, టైటన్‌, పవర్‌గ్రిడ్‌, టాటా స్టీల్‌, సన్‌ఫార్మా, హెచ్‌డీఎఫ్‌సీ, బజాజ్‌ ఫైనాన్స్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

రెప్రో ఇండియాలో ఇటీవల మాధురీ ముధుసూదన్‌ కేలా అండ్‌ బ్రిజ్‌కిశోర్‌ ట్రేడింగ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంయుక్తంగా 3.59 శాతం వాటాలను కొనుగోలు చేశాయి. దీంతో గత వారం రోజుల్లో రెప్రో స్టాక్‌ విలువ 48 శాతానికి పైగా పెరిగింది. ఈరోజు స్టాక్‌ ధర 2.05 శాతం పెరిగి రూ.601.20 దగ్గర స్థిరపడింది.

గోద్రేజ్‌ ఇండస్ట్రీస్‌ ఏకీకృత నికర లాభం మార్చి త్రైమాసికంలో 33 శాతం పెరిగింది. దీంతో కంపెనీ షేరు విలువ ఈరోజు 2.24 శాతం పెరిగి రూ.470 దగ్గర ముగిసింది. 

అదానీ గ్రూప్ స్టాక్స్‌ ర్యాలీల వెనుక ఎటువంటి నియంత్రణా వైఫల్యాన్ని ప్రాథమికంగా నిర్ధారించలేమని సుప్రీం కోర్టుకు నిపుణుల బృందం తెలిపింది. దీంతో అదానీ గ్రూప్‌లోని ప్రధాన కంపెనీ అదానీ ఎంటర్‌ప్రైజెస్‌ షేరు విలువ 3.44 శాతం పెరిగి రూ.1,955 దగ్గర ముగిసింది. గ్రూప్‌లోని ఇతర నమోదిత కంపెనీల స్టాక్స్‌ సైతం రాణించాయి. అదానీ విల్మర్‌ షేరు అత్యధికంగా 6.87 శాతం లాభపడింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని