Stock Market: నాలుగోరోజూ నష్టాల్లోనే.. 19,700 దిగువకు నిఫ్టీ

Stock Market: సెన్సెక్స్‌ (Sensex) 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 68.10 పాయింట్లు నష్టపోయి 19,674.25 దగ్గర ముగిసింది.

Published : 22 Sep 2023 16:21 IST

ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ (Stock market) సూచీలు వరుసగా నాలుగోరోజూ నష్టాలు మూటగట్టుకున్నాయి. ఉదయం లాభాలతో ప్రారంభమైన మార్కెట్లు కాసేపటికే నష్టాల్లోకి జారుకున్నాయి. తిరిగి పుంజుకొని మధ్యాహ్నం ఇంట్రాడే గరిష్ఠాలను తాకాయి. అమ్మకాల ఒత్తిడితో చివరకు నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్లలోని ప్రతికూల సంకేతాలు ప్రభావం మార్కెట్లలో కనిపించింది. భారత్‌, కెనడా మధ్య పరిణామాలు, జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్ల బాండ్‌ ఇండెక్స్‌లో భారత్‌ చేరనుండడం వంటి అంశాలు దేశీయ సూచీలపై మిశ్రమ ప్రభావం చూపాయి.

ఉదయం సెన్సెక్స్‌ (Sensex) 66,215.04 దగ్గర లాభాలతో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 65,952.83 వద్ద కనిష్ఠాన్ని, 66,445.47 దగ్గర గరిష్ఠాన్ని తాకింది. చివరకు 221.09 పాయింట్ల నష్టంతో 66,009.15 దగ్గర స్థిరపడింది. నిఫ్టీ (Nifty) 19,744.85 దగ్గర ప్రారంభమై ఇంట్రాడేలో 19,798.65 వద్ద గరిష్ఠాన్ని, 19,657.50 దగ్గర కనిష్ఠాన్ని నమోదు చేసింది. చివరకు 68.10 పాయింట్లు నష్టపోయి 19,674.25 దగ్గర ముగిసింది. మార్కెట్లు ముగిసే సమయానికి డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.95 వద్ద నిలిచింది.

సెన్సెక్స్‌ (Sensex)30 సూచీలో ఇండస్‌ఇండ్‌ బ్యాంక్‌, మారుతీ, ఎస్‌బీఐ, ఎంఅండ్ఎం, బజాజ్‌ ఫిన్‌సర్వ్‌, ఏషియన్‌ పెయింట్స్‌, టెక్‌ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, టీసీఎస్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, హెచ్‌యూఎల్‌, నెస్లే ఇండియా, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో ముగిశాయి. విప్రో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, అల్ట్రాటెక్‌ సిమెంట్స్‌, పవర్‌గ్రిడ్‌, సన్‌ఫార్మా, ఐసీఐసీఐ బ్యాంక్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, టైటన్‌, టాటా స్టీల్‌, భారతీ ఎయిర్‌టెల్‌, జేఎస్‌డబ్ల్యూ స్టీల్‌ షేర్లు అత్యధికంగా నష్టపోయిన షేర్ల జాబితాలో ఉన్నాయి.

మార్కెట్‌లోని ఇతర విషయాలు..

జెన్‌ టెక్నాలజీస్‌కు భారత రక్షణ మంత్రిత్వ శాఖ నుంచి రూ.227.65 కోట్లు విలువ చేసే ఆర్డర్‌ లభించింది. దీంతో కంపెనీ షేరు ఈరోజు 5 శాతం పెరిగి రూ.730.90 దగ్గర స్థిరపడింది.

భవిష్యత్‌లో బలమైన వృద్ధి అంచనాల నేపథ్యంలో హడ్కో షేర్లు గతకొన్ని రోజులుగా రాణిస్తున్నాయి. ఇంట్రాడేలో ఈ షేరు ఐదేళ్ల గరిష్ఠాన్ని తాకింది. ఏప్రిల్‌ నుంచి ఈ షేరు ఏకంగా 95 శాతం పుంజుకోవడం విశేషం. ఈరోజు చివరకు షేరు విలువ 18.01 శాతం పెరిగి రూ.85.20 దగ్గర ముగిసింది.

లక్స్‌ ఇండస్ట్రీస్‌ రూ.200 కోట్లు పన్ను ఎగవేసినట్లు.. దీనిపై ఆదాయ పన్ను విభాగం సోదాలు చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ఎక్స్ఛేంజీలు కంపెనీని వివరణ కోరాయి. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు ఈరోజు 3.02 శాతం నష్టపోయి రూ.1,473.50 దగ్గర నిలిచింది.

భారత ప్రభుత్వ బాండ్లు జేపీ మోర్గాన్‌ ఎమర్జింగ్‌ మార్కెట్‌ బాండ్‌ ఇండెక్స్‌లో చేరనున్న నేపథ్యంలో పీఎన్‌బీ గిల్ట్స్‌ షేరు ఈరోజు 20 శాతం పెరిగి రూ.81.60 అప్పర్‌ సర్క్యూట్‌ని తాకి అక్కడే స్థిరపడింది.

గ్లెన్‌మార్క్‌ లైఫ్‌ సైన్సెస్‌లో 75 శాతం విక్రయించనున్న నేపథ్యంలో గ్లెన్‌మార్క్‌ ఫార్మా షేరు ఈరోజు ఇంట్రాడేలో 6 శాతం నష్టపోయింది. చిరవకు 2.98 శాతం నష్టపోయి రూ.803.05 దగ్గర ముగిసింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని